మీరు డిజిటల్ అడిక్షన్ అదేనండి...స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు ఇతర డిజిటల్ రూపాల్లోని పరికరాలు, వస్తువుల వినియోగం ఓ వ్యసనంగా మారే ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారా ? దీనికి అవుననే స్పష్టమైన సమాధానమే వస్తోంది. స్మార్ట్‌ఫోన్ల అతి వినియోగం నాడీమండలంలో మార్పులకు కారణమవుతోందని ఓ తాజా అధ్యయనంలో బయటపడింది. అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా తలమునకలైతే ఎదుటివారిని నిందించే స్వభావం, ప్రవర్తన పెరగడంతో పాటు సామాజికంగా ఇతరులకు దూరమై, ఒంటరితనానికి గురైనట్టుగా భావిస్తారని ఇటీవలే ‘న్యూరో రెగ్యులేషన్’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ స్టడీ వెల్లడించింది.
ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ తమ స్మార్ట్‌ఫోన్‌ను ఒక్కక్షణం కూడా వదిలి ఉండలేని పరిస్థితులున్నాయి. ఈ ఫోన్లలో వచ్చే మెసేజ్ అలర్ట్‌ల పట్ల స్పందిస్తున్న తీరు పురాతన కాలంలో ఏదైనా అనుకోని ముప్పు లేదా కీడు సంభవిస్తుందా అని నాటి మానవుడు పడిన ఆందోళన పోల్చదగినదిగా ఉంటోందని ఈ పరిశీలన పేర్కొంది. సిగిరెట్ల మాదిరిగానే డిజిటల్ టెక్నాలజీని కూడా ఓ వ్యసనంగా మారేలా రూపొందించారని నిఫుణులు భావిస్తున్నారు. వివిధ రూపాల్లో వచ్చే నోటిఫికేషన్లు, పింగ్‌లు, వైబ్రేషన్లు, అలర్ట్‌ల పట్ల ఏదో ప్రమాదం సంభవిస్తుందేమో అన్నట్టుగా స్పందిస్తున్నారు. ఓ వైపు తమ మనసులోని భావాలను ఫోన్ ద్వారా కమ్యూనికేట్ చేస్తూ అదే సమయంలో ఇతర పనులు (మల్టీ టాస్కింగ్) చేస్తున్నందు వల్ల మెదడు, శరీరం రిలాక్స్ కావడంలేదు.
దాంతో చురుకుదనం మందగిస్తోంది. ఒకేసారి రెండు, మూడు పనులు చేస్తున్నవారు వాటిపై పూర్తి దృష్టి పెట్టకపోవడం వల్ల ఆ పనులను సగం మాత్రమే సక్రమంగా నిర్వహిస్తున్నారని శాన్ ఫ్రాన్సిస్‌కో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. ప్రతీ చిన్న విషయానికి ఫోన్లపైనే ఆధారపడడం ఎక్కువై పోయింది. మనలో 40 శాతానికి పైగా ఉదయం నిద్రలేచిన 5 నిముషాల్లోనే ఫోన్లు చెక్ చేసుకుంటున్నట్టు, యాభైశాతానికి పైగా రోజుకు 25 సార్లు అంతకంటే ఎక్కువగానే ఫోన్లు పరీక్షించుకుంటున్నట్టు డెలాయిట్ సంస్థ స్టడీలో వెల్లడైంది.
గేమింగ్ డిజార్డరేనంటున్న డబ్ల్యూహెచ్‌ఓ...
పరిసరాలను పట్టించుకోకుండా నిరంతరం వీడియో గేమ్‌ల్లో మునిగిపోయే ‘గేమింగ్ డిజార్డర్’ ను కూడా ‘రివిజన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిజీసెస్’ (ఐసీడీ–11)లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చేర్చనుంది. దీనిలో భాగంగా ఈ డిజార్డన్‌ను అంతర్జాతీయ రోగాల వర్గీకరణ (ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్) జాబితాలో ప్రచురించనుంది.. ప్రపంచం లోని ఆరోగ్య పోకడలు, సమస్యల తీరును గుర్తించి, వాటి నిర్థారణతో పాటు వర్గీకరణకు ఉద్ధేశించి ఐసీగీ–11ను ఓ ప్రామాణిక సాధనంగా డాక్టర్లు, పరిశోధకులు, ఎపిడమియోలాజిస్ట్‌లు ఉపయోగిస్తున్నారు.
భారత్‌లో...
మనదేశంలో తొలిసారిగా 2016లో ఢిల్లీలోని రాంమనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యులు ఈ గేమింగ్ డిజార్డర్‌ను గుర్తించారు. సైకియాట్రీ వార్డులో 22 , 19 ఏళ్ల వయసున్న అన్నదమ్ములు నెలరోజుల పాటు చికిత్స తీసుకున్నారు. వారి తల్లితండ్రులు వైద్యుల సహాయం కోరేనాటికే కొన్నిరోజుల పాటు తిండి,నిద్ర అనే అలోచన లేకుండాS ఎడతెగని గేమింగ్ కారణంగా ఈ యువకులు సామాజికంగా ఇతరులతో కలవకుండా, శారీరకంగానూ పూర్తి నిస్సత్తులో మునిగిపోయారు.
అధిగమించేందుకు ఏం చేయాలి ?
స్మార్ట్‌ఫోన్టలోని అలర్ట్‌లు, నోటిఫికేషన్లను ఆపేయాలి.
ఆన్‌లైన్ కార్యకలాపాల కంటే ఆఫ్‌లైన్‌లో ఇతర కార్యక్రమాలు చేపట్టడం, కుటుంబసభ్యులు, మిత్రులతో సంభాషణలు కొనసాగించాలి.
నిద్రపోవడానికి గంట ముందు అన్ని పరికరాలు ఆఫ్ చేసేయాలి లేదా మరో గదిలో ఫోన్‌ను ఉంచాలి. ఫోన్లలోని ‘బ్లూ వేవ్ లెంథ్ లైట్’ మెదడులో నిద్రకు సమయం ఆసన్నమైనదని సూచించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటుంది.
రాత్రి భోజనం చేసేపుడే ఫోన్ ఆఫ్ చేసేయాలి. ఆ తర్వాత దానిని ఇంటి వద్దే వదిలేసి కొంతదూరం నడిచిరావాలి.
ప్రతీ చిన్న విషయానికి వెబ్‌లో సెర్చ్ చేసే ధోరణి మార్చుకోవాలి
నిరంతరం ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి నెట్‌వర్క్‌ల్లో మునిగిపోకుండా సామాజికమాధ్యమాల వినియోగంపై నియంత్రణ పాటించాలి.
కంప్యూటర్ లేదా మొబైల్‌ను చూడాలనే కోరిక కలిగినపుడు నచ్చిన పుస్తకంలోని కనీసం 30 పేజీలు చదివాకే వాటిని ముట్టుకోవాలని తమకు తాము సవాల్ చేసుకోవాలి.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment