సెల్ పోయిందా? మీ పని గోవిందా!
అన్నానగర్: స్మార్ట్ ఫోన్ల వెల్లువలో యువత ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు ముందూవెనుకా చూడకుండా కొట్టుకొనిపోతున్నారు. అదేదో సినిమాలో హీరో మహేష్ బాబు చెప్పినట్లుగానే ఈ శతాబ్దపు అతి చెత్త ఆవిష్కరణల్లో సెల్‌ఫోన్ వినియోగం ఒకటిగా మారుతోంది. సోషల్ నెట్ వర్కింగ్ పిచ్చిలోపడి అమ్మాయిలు తాము దిగిన అన్ని ఫోటోలను, ముఖ్యమైన కుటుంబ సభ్యుల ఈ-మెయిల్ ఐడీలను, వ్యక్తిగత సమాచారాన్నిస్మార్ట్ ఫోన్ల ద్వారా సోషల్ మీడియాల్లో పోస్టు చేయడం అంత క్షేమకరం కాదని నగర సైబర్ క్రైం విభాగం హెచ్చరిస్తోంది. మీ టైం బాగాలేక మీ సెల్‌ఫోన్ పోయిందంటే ఇక మీ వ్యక్తిగత జీవితం అంతా గోవిందే అంటున్నారు సైబర్ క్రైం నిపుణులు.
మీరు పోగొట్టుకున్న ఫోన్ ఏ అపరిచితునికైనా దొరికిందంటే.. ఆ చిన్న సాధనంతో సదరు వ్యక్తి మీ జీవితంలోనేకాక కుటుంబ సభ్యుల జీవితాల్లో సైతం కలకలం సృష్టించే ప్రమాదం ఉంది. మీ ఫోన్‌లో ఉన్న డేటా, ఫోటోలు ఆధారంగా సదరు వ్యక్తులు మిమ్మల్నిగానీ, మీ కుటుంబ సభ్యులను కానీ బ్లాక్‌మెయిల్ చేయడం, మీ కుటంబ ప్రతిష్టను దిగజార్చేలా మీ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం, డబ్బు కోసం మిమ్మల్ని పదే పదే పీడించడం జరగవచ్చు.
ఇక మీ నాన్న సెల్ నంబరు వద్ద డాడీ అని, మామయ్యల నంబర్ల వద్ద అంకుల్ అని గానీ పేరును ఫీడ్ చెయ్యకండి. కేవలం వారి వారి పేర్లతో మాత్రమే నంబర్లను నమోదు చేయండి. స్మార్ట్ ఫోన్లలో మీ వ్యక్తిగత వివరాలు, ఫొటోలూ ఉంచడం ద్వారా మీ జీవితాన్ని మీరే బజారులో పెట్టుకున్నట్లని గుర్తించండి.
టీనేజ్ యువతుల చేతుల్లోని స్మార్ట్‌ఫోన్ ఆటంబాంబు సృష్టించేటంత విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఈ విషయాన్ని మీ ఇంట్లోని టీనేజ్ అమ్మాయికు వివరంగా అర్థమయ్యేలా విడమర్చి చెప్పండి. పోయిన ఫోన్ల లాక్‌ను సులువుగా ఛేదించే అక్రమహ్యకర్లు నగరంలో ఎక్కువయ్యారని సైబర్ క్రైం విభాగం హెచ్చరించింది.
కనుక వీలైనంత వరకూ సెల్‌ఫోన్లను మర్చిపోకుండా మీ బ్యాగుల్లో ఉంచండి. చేతిలో పట్టుకుని తిరిగితే, దాన్ని ఎక్కడైనా పెట్టి మర్చిపోయే ప్రమాదముంది. గడచిన రెండేళ్ల వ్యవధిలో సోషల్ నెట్‌వర్కుల్లో ఉంచిన 40 వేల మంది టీనేజ్ యువతల ఫోటోలను అగంతకులు వారు మానసికంగా మరణించే విధంగా మార్ఫింగ్ చేస్తారని అధికారులు హెచ్చరిస్తున్నారు.