
హనన్ వెన్నెముకకు గాయమవడంతో ఆమెను...
కొచ్చి : కుటుంబ పోషణ కోసం చేపలు అమ్మడం ద్వారా.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన కేరళ విద్యార్థిని హనన్ హమీద్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు... త్రిసూరు నుంచి బయల్దేరిన హనన్ కారు... కొడంగులూరు వద్ద ఓ కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు హనన్‌ను సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే ఈ ఘటనలో హనన్ వెన్నెముకకు గాయమవడంతో ఆమెను కొచ్చిలోని ఆస్పత్రికి తరలించాల్సిందిగా వైద్యులు సూచించారు.
కాగా కేరళలోని త్రిసూరుకి చెందిన19 ఏళ్ళ హనన్ కుటుంబాన్ని పోషించడం కోసం.. చేపలు అమ్మడంతో పాటుగా ఈవెంట్ మేనేజ్‌మెంట్, ట్యూషన్లు చెప్పడం, రేడియో ప్రోగ్రామ్స్ కూడా చేసింది. సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టుగా కూడా పని చేసింది. ఇలా.. బతుకుబండిని లాగేందుకు తనకొచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంది. తన కాళ్ళపై తాను నిలబడేందుకు హానన్ హమీద్ చేసిన బతుకు పోరాటాన్ని కొనియాడుతూ.. కేరళ దిన పత్రిక ‘మాతృభూమి’ కథనం ప్రచురించడంతో ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. దీంతో రాత్రికి రాత్రే ఆమె సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయారు. అయితే పబ్లిసిటీ కోసమే హనన్ ఇలా చేస్తోందంటూ కొంత మంది ట్రోల్ చేయడంతో... కేరళ సీఎం పినరయి విజయన్, కేంద్ర మంత్రి అల్ఫోన్స్ తదితర ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచారు. కాగా ఇటీవల జరగిన కేరళ చేనేత వస్త్రాల ప్రదర్శనలో పాల్గొన్న హనన్.. సంప్రదాయ దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేశారు. అలాగే కేరళ వరద బాధితులకు లక్షన్నర రూపాయల(తనను ఆదుకునేందుకు ప్రజలు ఇచ్చిన సొమ్ము) విరాళం ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు.