‘స్మార్ట్’ ఇయర్...2013 | 'Smart' Year ... 2013 | Sakshi
Sakshi News home page

‘స్మార్ట్’ ఇయర్...2013

Published Fri, Dec 27 2013 11:08 PM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

'Smart' Year ... 2013

యువత చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు సందడి చేశాయి..
 అవసరానికో ఆప్ పుట్టుకొచ్చింది..
 టాబ్లెట్లు, ఫాబ్లెట్లు, ఐపాడ్‌లు వెల్లువెత్తాయి..
 టెక్ సందడి నట్టింటికి వచ్చింది..
 ట్విట్టర్ నుంచి టిండర్ దాకా సోషల్ మీడియా హోరెత్తింది..
 మొత్తమ్మీద ఏడాదంతా హైటెక్ మెరుపులతో వెలిగిపోయింది..
 అందుకే నిజంగా ఇది ‘స్మార్ట్’ సంవత్సరం!

 
మరో మూడ్రోజుల్లో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకబోతున్నాం. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కొత్త ఆశలను ప్రోది చేసుకుంటున్నాం. పాత టెక్‌లను మించిన సరికొత్త టెక్‌ల కోసం ఎదురుచూస్తున్నాం. టెక్నాలజీని జీవితానికి మరింత దగ్గర చేస్తూ... 2013 తెచ్చిన బహుమతులేంటి? జీవితానికి అందం, ఆనందం, హంగులను అద్దుతూ... భరోసాను ఇస్తూ... ఈ ఏడాది ఇచ్చిన ముఖ్యమైన టెక్ ఆవిష్కరణలేంటి? ఓసారి గుర్తు చేసుకుందాం.
 
 ఆపిల్ ఐఫోన్ 5ఎస్
 
 ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లలో Apple iPhone 5 ఒకటి.   
 ఐఫోన్ 5 రివైజ్డ్ వెర్షన్‌గా సెప్టెంబరులో వచ్చిన ఐఫోన్ 5ఎస్‌లో ఫింగర్ ప్రింట్ స్కానర్, టచ్ ఐడీ, సమర్థమైన ఆప్ ఎకోసిస్టమ్ ఉండటం ప్రత్యేకతలు. 64 బిట్ ప్రాసెసర్‌తో వచ్చిన తొలి స్మార్ట్‌ఫోన్‌గా కూడా ప్రత్యేకత చాటుకుంది. ఆపిల్ కంపెనీ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్7 తో వచ్చిన తొలి ఫోన్ ఇదే. అయితే దీనికంటే ముందు వచ్చిన ఫోన్ల మాదిరిగానే ఉండటం దీనికి మైనస్. ధర రూ. 53,500.  
 
 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4
 
 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 మాదిరి డిజైన్‌తోనే ఈ ఏడాది మార్చిలో వచ్చిన Samsung Galaxy S4 హార్డ్‌వేర్ మార్పుతో, ఎక్కువ సాఫ్ట్‌వేర్ ఫీచర్లతో మరింత మెరుగైంది. తెరపై వేలిని అలా ఊపినా.. గుర్తించగలగడం దీని ప్రత్యేకత. అయితే 4జీకి చెందిన ‘ఎల్‌టీఈ అడ్వాన్‌న్స్‌డ్’ మొబైల్ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే హార్డ్‌వేర్ కలిగిన తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా రెండు నెలల్లోనే 2 కోట్లు, గత నెల దాకా 4 కోట్ల ఫోన్లు కొనుగోలు అయ్యాయి. ఇది సామ్‌సంగ్ చరిత్రలోనే బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ధర సుమారు రూ.33,000.
 
 హెచ్‌టీసీ వన్
 
 అద్భుతమైన డిస్‌ప్లే, హైపవర్ స్టీరియో సౌండ్ సిస్టమ్ ఉన్న ఈ ఫోన్ కూడా ప్రస్తుతం ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లలో ఒకటి. దీనికంటే ముందు ప్రవేశపెట్టిన హెచ్‌టీసీ వన్ ఎక్స్ వాణిజ్యపరంగా విఫలం కావడం తో.. హెచ్‌టీసీ కంపెనీ దీనిని ప్రతిష్ఠాత్మకంగా రూపొందించింది. 1080p full-HD display దీని ప్రత్యేకత. వీడియోలు, సినిమాలు చూసేందుకు చాలా బెస్ట్. పారిశ్రామికంగా ఉత్తమ డిజైన్‌గా ప్రశంసలు కూడా దక్కాయి. ధర రూ.42 వేలు.
 
  గూగుల్ నెక్సస్ 5
 
 బాగా వేగంగా పనిచేసే ఆండ్రాయిడ్ ఫోన్లలో LG Google Nexus 5 బెస్ట్ ఫోన్ అనే చెప్పొచ్చు. గూగుల్ బెస్ట్ సెల్లర్స్‌లో కూడా ఇది టాప్‌గా ఉంది. తాజాగా కిట్‌క్యాట్ 4.4 ఆండ్రాయిడ్ ఓఎస్‌ను విడుదల చేయడంతో ఇతర ఖరీదైన స్మార్ట్‌ఫోన్ల కన్నా ఇది ముందంజలో ఉన్నట్లే భావించవచ్చు. అయితే కెమెరా క్వాలిటీ తక్కువ కావడం, ఎక్స్‌టర్నల్ స్టోరేజీ ఎక్స్‌పాన్షన్ సౌకర్యం లేకపోవడం మైనస్‌లే. ధర సుమారు రూ. 30,000.
 
  సోనీ ఎక్స్‌పెరియా జెడ్1


ఆకర్షణీయంగా ఉండటంతోపాటు వాటర్, డస్ట్ రెసిస్టెంట్ కావడం, 20.7 మెగాపిక్సెల్ కెమెరా ఉండటం Sony Xperia Z1  ప్రత్యేకతలు. కొత్త కెమెరా ఇంటర్‌ఫేస్, షట్టర్ బటన్ కూడా ఉండటం అదనపు ఆకర్షణలు. సోషల్ లైఫ్, ఇన్‌ఫో ఐ వంటి పలు కొత్త కెమెరా ఆప్స్‌ను కూడా సోనీ ప్రవేశపెట్టింది. అన్ని పోర్టులూ మూసేందుకు వీలవుతుంది కాబట్టి... నీటిలో పడినా, దుమ్ములో పడినా నో ప్రాబ్లమ్.
 ధర రూ. 39,000.
 
 జీవితం ఆప్స్‌మయం!
 
 ఈ ఏడాది ఆప్స్ విపరీతంగా వెల్లువెత్తాయి. ఏ అవసరమైనా ఇట్టే తీర్చుకునేందుకు వీలుగా రకరకాల ఫీచర్లతో సందడి చేశాయి. మహిళలు, చిన్నపిల్లల రక్షణ మొదలుకొని దొంగతనాల నివారణకు, ఎన్నోరకాల సమస్యలు, ఇబ్బందులకు చెక్‌పెట్టేందుకు అనువుగా ఉండేలా ఆప్స్ వచ్చిపడ్డాయి. వినోదంతోపాటు విజ్ఞానాన్నీ  అందించేందుకు పోటీపడ్డాయి. అసలు సమస్య వచ్చిందే ఆలస్యం.. పరిష్కారంతో ఆప్ రెడీ! అన్న చందంగా ఆప్స్ వివిధ ఆప్ స్టోర్లను ముంచెత్తాయి. ఈ ఏడాది వచ్చిన ఆప్స్‌లో చాలావరకూ విభిన్నం. వేటికవే ప్రత్యేకం. వీటిలోంచి కూడా ఇవే బెస్ట్ అని చెప్పలేం!
 
 అతివలకు అండ.. ‘నిర్భయ’
 
 ఢిల్లీలో గతేడాది నిర్భయ అత్యాచార ఉదంతం నేపథ్యంలో భారత్ లో మహిళల రక్షణ కోసం ‘నిర్భయ’ ఉచిత ఆప్ అందుబాటులోకి వచ్చింది. ఆపదలో ఉన్నప్పుడు వెంటనే పోలీసులకు, సన్నిహితులకు సందేశం పంపేందుకు ఈ ఆప్ ఉపయోగపడుతుంది. మహిళలు ఉన్న ప్రదే శం చిరునామాను జీపీఎస్ ఆధారంగా గుర్తించి ఆ వివరాలను కూడా ఈ ఆప్ ఆటోమేటిక్‌గా పంపుతుంది. స్త్రీలకు అండగా నిలిచే ఇలాంటి ఆప్స్ చాలానే అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల ‘సాక్షి’ ఆధ్వర్యంలో కూడా ‘సాక్షి అభయ’ ఆండ్రాయిడ్ ఉచిత ఆప్ విడుదలైంది. ఫోన్‌లో ‘హెల్ప్’ బటన్ నొక్కితే చాలు... కుటుంబసభ్యులకు, సన్నిహితులకు సమాచారం అందడంతోపాటు నిందితులను పట్టుకోవడానికి వీలుగా ఈ ఆప్ ఆటోమేటిక్ వీడియో రికార్డింగ్ చేస్తుంది. వీటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 
 నాన్ గేమింగ్ ఆప్‌లలో టాప్.. WeChat!
 
 నాన్‌గేమింగ్ ఆప్‌లలో బాగా పాపులర్ అయిన ఈ ఆప్‌ను సుమారు 10 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. భారత్‌లో ఈ ఏడాది అత్యధికమంది డౌన్‌లోడ్ చేసుకున్న నాన్‌గేమింగ్ ఆప్స్‌లో ఇదే టాప్. ఐఓఎస్ ఆప్స్‌లో కూడా రెండో స్థానంలో నిలిచింది WeChat. ఆండ్రాయిడ్, ఐఫోన్, బ్లాక్‌బెర్రీ, విండోస్ ఫోన్  ఫ్లాట్‌ఫామ్‌లపై పనిచేసే ఈ ఆప్ హిందీతో సహా అనేక భాషలను సపోర్ట్ చేస్తుంది. వాయిస్ మెసేజ్‌లు, ఫొటో, వీడియో షేరింగ్, మల్టీమీడియా కమ్యూనికేషన్, అనేక ఫీచర్లతో ఆకట్టుకుని హవా కొనసాగిస్తోంది. గూగుల్ ప్లే, ఆండ్రాయిడ్, ఐఫోన్, విండోస్‌ఫోన్ ఆప్ సెంటర్ల నుంచి దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  
 
 నెంబర్ వన్ ఆప్.. WhatsApp!
 
 ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 కోట్ల మంది వాడుతున్న నెంబర్ వన్ ఆప్ ‘వాట్స్‌ఆప్ మెసెంజర్’. భారత్‌లో కూడా ఈ ఏడాది బాగా ఆదరణ పొందిన ఈ ఆప్ క్రాస్-ప్లాట్‌ఫామ్ మొబైల్ మెసేజింగ్ ఆప్. దీనితో ఎస్‌ఎంఎస్‌కు డబ్బులు చెల్లించకుండానే టెక్ట్స్‌మెసేజ్‌లు పంపుకోవచ్చు. ఐఫోన్, బ్లాక్‌బెర్రీ, ఆండ్రాయిడ్, విండోస్‌ఫోన్, నోకియా ఫోన్‌లో కూడా పనిచేస్తుంది. వాట్స్ ఆప్ యూజర్లు గ్రూపులుగా ఏర్పడతాయి. వీటితో ఫొటోలు, వీడియోలు కూడా పంపుకోవచ్చు. అందుకే దీని హవా కొనసాగుతోంది. దీనిని కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 
 ఇంకా మరెన్నో...
 
 మీడియా ఆప్స్.. సోషల్ మీడియా ఆప్స్.. బ్యాంక్ ఆప్స్.. ఇంకా మరెన్నో ఆప్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అవసరం ఏదైనా సరే.. ఇట్టే తీర్చేసే ఆప్స్ అనేకం ఉన్నాయి. వీటిలో చాలావరకూ ఉచితమే. కొనుగోలు చేసినా.. ఆ మేరకు  ప్రయోజనాలు కూడా పొందొచ్చు.
 
 2013.. టెక్ బహుమతులు
 
 ఈ ఏడాది అనేక గ్యాడ్జెట్స్ విడుదలయ్యాయి. వాటిలో కొన్ని బాగా ఉపయోగపడే స్మార్ట్ గ్యాడ్జెట్స్. మరికొన్ని వింతగా అనిపించినా.. ఉపయోగపడేవి కూడా. అలాంటి మూడు గ్యాడ్జెట్స్‌ను చూద్దాం.
 
 గ్లౌజ్‌తో కాల్ చేయొచ్చు!
 
 ఈ గ్లౌజ్ వేసుకుని అలా సైగ చేస్తే చాలు... స్మార్ట్‌ఫోన్ నుంచి కాల్ చేసేయవచ్చు. ఈ గ్లౌజ్ బొటనవేలిలో స్పీకర్, చిటికెన వేలిలో మైక్రోఫోన్ ఉంటాయి. వీటిపై ఉండే బటన్స్‌ను నొక్కి కాల్‌ను రిసీవ్ చేసుకోవచ్చు లేదా కట్ చేసేయవచ్చు. అంతేకాదు.. గ్లౌజ్ తీసేయకుండానే స్మార్ట్‌ఫోన్ టచ్‌స్క్రీన్ ను మామూలుగానే ఉపయోగించవచ్చు కూడా. ధర 80 డాలర్లు (రూ.5 వేలు) మాత్రమే! కొనుక్కోవాలనుకుంటే... www.hammacher.comలో ప్రయత్నించొచ్చు.
 
 ఎగ్ మైండర్!
 
 గుడ్లు ఏవి నిల్వ ఉన్నవో, ఏవి తాజావో చెప్పే ఎగ్ మైండర్ గ్యాడ్జెట్ ఇది. ట్రేలో ఉండే పాత గుడ్ల వద్ద ఎల్‌ఈడీ లైటును బట్టి వాటిని గుర్తుపట్టవచ్చు. ట్రేలో గుడ్లు దగ్గరపడితే ముందుగానే ఇది నోటిఫికేషన్ పంపిస్తుంది. ధర 70 డాలర్లు. కావాలనుకుంటే  Quirky.comలో ప్రయత్నించవచ్చు.
 
 ఆహారాన్ని పరీక్షించే స్కానర్!
 
 ఈ ఏడాది ఆవిష్కృతమైన వినూత్న స్కానర్ ఇది.  'TellSpec' అనే ఈ స్కానర్ ఆహారాన్ని పరీక్షించి అందులో ఉన్న అలర్జీ కారకాలు, పురుగుమందుల అవశేషాలు, క్యాలరీలు, అదనపు కొవ్వును గుర్తిస్తుంది. దీనిపై ఉండే బటన్‌ను నొక్కి ఆహారంపై తిప్పితే చాలు... లేజర్‌తో స్కానింగ్ చేస్తుంది. ఆ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఉండే డేటాబేస్‌కు పంపిస్తుంది. దాంతో అక్కడ విశ్లేషణ పూర్తయి, సంబంధిత వివరాలు స్మార్ట్‌ఫోన్‌కు అందుతాయి. దీనితో ఆహారపదార్థాలను 97.7 శాతం కచ్చితత్వంతో స్కాన్ చేయొచ్చట. ధర రూ.20 వేలు. వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదల కానుంది.
 
 క్రోమ్‌కాస్ట్...
 
 హెడీటీవీలను కలిగి ఉన్నవారిని సరికొత్త ప్రపంచంలో ఓలలాడించే డివైజ్ క్రోమ్‌కాస్ట్. టీవీ తెరపై ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చింది క్రోమ్ కాస్ట్. యూఎస్‌బీ టాంగెల్‌లా ఉండే క్రోమ్‌కాస్ట్‌ను టీవీకి కనెక్ట్ చేసి వైఫై ద్వారా టీవీకి ఇంటర్నెట్‌ను కనెక్ట్ చేయవచ్చు. మొబైల్‌ను, ఇతర స్మార్ట్ గాడ్జెట్లను టీవీతో అనుసంధానించవచ్చు. ఈ సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఈ ఏడాది నుంచే ఆరంభమైంది. క్రోమ్‌కాస్ట్ ధర రూ.2,300 వరకూ ఉంటుంది. అయితే ఇది ఇంకా ఇండియన్ మార్కెట్‌లోకి అందుబాటులోకి రాలేదు. బహుశావచ్చే ఏడాది అందుబాటులోకి రావచ్చు.  
 
 కర్వ్‌డ్ ఫోన్లు వచ్చేశాయి..
 
 డిస్‌ప్లేలో ఫ్లెక్సిబులిటీని తెస్తూ ఎల్‌జీ, సామ్‌సంగ్ కంపెనీలు కర్వ్‌డ్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. టచ్ విషయంలో కూడా కర్వ్‌డ్ ఫోన్లు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తున్నాయి. టచ్‌తో పనిచేయడమే ఒక మ్యాజిక్ అయితే కర్వ్‌డ్ ఫోన్ల టచ్ ఇంకా స్మూత్‌గా ఉండటం, కుషన్‌లా అణిగిపోతుండటంతో ఇవి విస్తృతంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
 
 - హన్మిరెడ్డి యెద్దుల
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement