వివాదానికి దారితీసిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు
నాగోలు: ఎల్బీనగర్ సర్కిల్లో శనివారం రాత్రి చేపట్టిన డ్రంకన్ డ్రైవ్ ట్రాఫిక్ పోలీసులకు సవాలుగా మారింది. ఓ పక్క మందుబాబుల వీరంగం, మరోపక్క పోలీసుల తనిఖీలతో కామినేని చౌరస్తా రణరంగంగా మారింది. ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీసులు కామినేని సమీపంలో ఉన్న ఓ బార్, వైన్స్ సమీపంలోనే తనిఖీలు చేపట్టడంతో వివాదం చోటు చేసుకుంది. వైన్స్, బార్ నుంచి వచ్చిన వారిని డ్రంకన్ డ్రైవ్లో బుక్ చేశారు. దీంతో మందుబాబులు పోలీసులపై తిరగబడ్డారు.
ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికంగా మద్యం తాగిన వారిని డ్రంకన్ డ్రైవ్ కింద కేసులు బుక్ చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బార్లో మద్యం తాగి బయటకు రాగానే.. వాహనాలు నడపకుండానే జరిమానాలు విధించి కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు మందుబాబులు ఆవేదన వ్యక్తం చేశారు. వివాదం పెద్దది కావడంతో ట్రాఫిక్ పోలీసులు ఎల్బీనగర్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు మందుబాబులను అరెస్ట్ చేశారు.