టెక్ మహీంద్రా చేతికి ఎల్సీసీ కంపెనీ
న్యూఢిల్లీ: టెక్ మహీంద్రా కంపెనీ అమెరికాకు చెందిన లైట్బ్రిడ్జ్ కమ్యూనికేషన్స్ కార్పొరేషన్(ఎల్సీసీ)ని 24 కోట్ల డాలర్లు(రూ.1,468 కోట్లకు పైగా)కు కొనుగోలు చేయనున్నది. వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తయ్యే ఈ డీల్ ఈ ఏడాది అతి పెద్ద ఐటీ డీల్ అని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఎల్సీసీని పూర్తిగా నగదుతోనే టక్ మహీంద్రా కొనుగోలు చేయనున్నది. కాగా గత రెండు ఆర్థిక సంవత్సరాల్లోనే టెక్ మహీంద్రా కంపెనీ మొత్తం ఏడు కంపెనీలను కొనుగోలు చేసింది.
సత్యం కంప్యూటర్ సర్వీసెస్, హచిసన్ గ్లోబల్ సర్వీసెస్, కామ్వివా టెక్నాలజీస్ వంటివి వాటిల్లో కొన్ని. టెలికమ్యూనికేషన్స్ పరిశ్రమలో నెట్వర్క్ ఇంజినీరింగ్ సర్వీస్లను అందిస్తున్న అంతర్జాతీయ పెద్ద కంపెనీల్లో ఎల్సీసీ ఒకటి. వర్జీనియా కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఎల్సీసీ 50 దేశాల్లో 5,700 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీ వార్షికాదాయం 43 కోట్ల డాలర్లు. కాగా ఈ కంపెనీ కొనుగోలుకు అవసరమైన వనరులను అంతర్గతంగానే సమకూర్చుకుంటున్నామని టెక్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ పేర్కొన్నారు.