leaders demand
-
పరిహారంపై ప్రకటన చేయాలి
చింతలపూడి : చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ఎర్నేని నాగేంద్రబాబు డిమాండ్ చేశారు. సోమవారం చింతలపూడి మార్కెట్ కమిటీ ఆవరణలో ప్రజా చైతన్య రైతు సదస్సు నిర్వహించారు. రైతులకు న్యాయం జరిగే వరకు కాలువ తవ్వకం పనులను అడ్డుకోవాలని తీర్మానించారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణలో ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని నాగేంద్రబాబు విమర్శించారు. సమస్యలపై పోరాటం చేస్తే అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. చట్ట ప్రకారం రైతులకు రావాల్సిన నష్టపరిహారం కోసం ఐక్యంగా పోరాడదామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతుల భూములను కాజేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల్లో భూములు కోల్పోతున్న రైతులకు జిల్లా అంతా ఒకే తరహా నష్టపరిహారం అందచేయాలని డిమాండ్ చేశారు. మెట్ట ప్రాంత రైతులకు సాగు నీటి వసతి కల్పించాలన్న ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ పథకాన్ని మంజూరు చేశారన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు రైతుల సమస్యల పరిష్కారానికి శ్రద్ధ చూపాలని కోరారు. భారతీయ కిసాన్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి మాట్లాడుతూ ఈ పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ఇచ్చే పరిహారం విషయంలో జిల్లా కలెక్టర్ అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పీతల సుజాత సైతం రైతుల బాధలు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా చైతన్య సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.అమర్ మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు 4 రెట్లు నష్ట పరిహారం అందించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ ఛైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు, చింతలపూడి ఎత్తిపోతల పథకం అఖిలపక్ష రైతు సంఘం అధ్యక్షుడు అలవాల ఖాదర్‌బాబురెడ్డి, చిట్లూరి అంజిబాబు, రైతులు పాల్గొన్నారు. -
ఫుడ్ పార్క్‌ను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
భీమవరం : భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణం తక్షణం నిలిపి వేయాలని, అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో భీమవరంలో ప్రభుత్వ, పార్కు యాజమాన్య దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రకాశం చౌక్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కమిటీ కార్యదర్శి బి.సత్యనారాయణ మాట్లాడుతూ గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కును ఆరెంజ్ క్యాటగిరీలో చేర్చామని చుక్కనీరు కూడా గొంతేరు డ్రైయిన్‌లో కలవదని ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభ సందర్భంలో ప్రకటించిన సబ్‌కలెక్టర్ వందల కోట్ల రూపాయల ఖర్చుతో సముద్రంలోకి ప్రత్యేకSపైప్‌లైన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం ప్రజలను మోసగించడమేనని విమర్శించారు. ఫ్యాక్టరీకి అనుకూలంగా త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ఫుడ్‌పార్కు వ్యతిరేక పోరాట కమిటీ నాయకుడు కె.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఫుడ్ పార్కు పరిధిలోని మూడు గ్రామాల ప్రజలు కుటుంబ సమేతంగా నల్లబ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేస్తుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకుడు గాదిరాజు వెంకటసుబ్రహ్మణ్యంరాజు, సీపీఐ నాయకుడు మల్లుల సీతారామ్ ప్రసాద్, చేబోలు సత్యనారాయణ, ధనికొండ శ్రీనివాస్, ఎం.వైకుంఠరావు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, కలిపిండి సత్యనారాయణ పాల్గొన్నారు. -
బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి
పాలకొల్లు అర్బన్ : చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని సహా బీసీ శంఖారావ సభలో 22 తీర్మానాలు చేసినట్టు జిల్లా బీసీ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు నవుడు వెంకట రమణ, జిల్లా అధ్యక్షుడు వర్తనపల్లి కాశీవిశ్వేశ్వరరావు తెలిపారు. పాలకొల్లులో బుధవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పాల్గొన్న సభలో వివిధ అంశాలపై తీర్మానాలు చేసినట్టు వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, పంచాయతీ రాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్‌ను 34 శాతం నుంచి 50 శాతం పెంచి రాజ్యాంగ భద్రత కల్పించాలని, బీసీలకు విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్‌ను తొలగించాలని, కేంద్ర, విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బీసీల జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతంకు పెంచాలనే డిమాండ్లు తీర్మానాల్లో ఉన్నాయన్నారు. బీసీ కార్పొరేషన్ బడ్జెట్ ఏటా రూ. 20 వేల కోట్లు కేటాయించి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కేటాయించాలని కోరామన్నారు. బీసీ కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు కేటాయించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘ నూతన కమిటీ సభ్యులతో కృష్ణయ్య ప్రమాణస్వీకారం చేయించారన్నారు. -
సీమాంధ్రులది కృత్రిమ ఉద్యమం..
వేములవాడ, న్యూస్‌లైన్ : రాష్ర్ట విభజన ప్రక్రియలో అవుతున్న జాప్యం తెలంగాణ వాసులను కలవర పెడుతోందని, సీమాంధ్రు ల కృత్రిమ ఉద్యమ నేపథ్యంలో పార్లమెంట్లో వెంటనే బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ (టీటీఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వేములవాడలో ఆదివారం శాంతి సద్భావన ర్యాలీ నిర్వహించారు. వీరికి టీజేఏసీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. అమరవీరుల స్తూపం నుంచి ప్రా రంభమైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా వరకు సాగింది. ఈ సందర్భంగా టీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె. కిషన్‌రావు మాట్లాడుతూ సీమాంధ్రులది ముమ్మాటికి కృత్రిమ ఉద్యమమేనన్నారు. తెలంగాణ త్యాగాల ముందు అది దిగదుడుపే అని పేర్కొన్నారు. ఒత్తిళ్లకులొంగి కేంద్ర ప్రభుత్వం మాట తప్పితే సహించేది లేదన్నారు. తెలంగాణలో ఉద్యమ నేపథ్యంలో ఏనాడు కూడా ప్రత్యేకవాదులు దాడులకు పాల్పడలేదని గుర్తుచేశారు. ప్రాంతాలుగా విడిపోయి అన్నదమ్ముల వలే కలిసుందామని ఇందుకు సీమాంధ్రులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టీజేఏసీ నియోజకవర్గ చైర్మన్ తిరుమల్‌గౌడ్, కన్వీనర్ బొజ్జ కనుకయ్య, టీటీఎఫ్ నాయకులు కె.రాజేందర్, చంద్రశేఖర్, ఇప్పపూల దేవయ్య, ఎల్.దేవ య్య, పి. వెంకటేశ్వర్లు, బి,కృష్ణ, పి.రాజేందర్, ఆర్.శ్రీనివాస్, పి.శ్రీనివాస్, తిరుపతి, అంజయ్య పాల్గొన్నారు.