పతకధారి పేస్...
భారత బృందం ఎప్పుడు ఒలింపిక్స్‌కు వెళుతున్నా ఎవరిలోనూ పెద్దగా ఆశలు లేని రోజులవి... పతకాల సంగతి దేవుడెరుగు, మనవాళ్లు కనీసం పరువు నిలబెట్టుకునే ప్రదర్శన చేసినా గొప్పే అనిపించేది. 1980 మాస్కో ఒలింపిక్స్‌తోనే టీమ్ ఈవెంట్ హాకీ జోరు ముగిసింది. ఆ తర్వాత వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో 5, 6, 7 స్థానాల్లో నిలవడంతో దానినీ ఎవరూ పట్టించుకోలేదు. ఇక వ్యక్తిగత విభాగంలో విజయం అంటే సుదూర స్వప్నం. కానీ ఇలాంటి సమయంలో 23 ఏళ్ల కుర్రాడి సంచలన ప్రదర్శన ఒక్కసారిగా దేశంలో అమితానందం నింపింది. ఎవరూ ఊహించని విధంగా టెన్నిస్ సింగిల్స్‌లో కాంస్యం సాధించి లియాండర్ పేస్ అద్భుతం చేసి చూపించాడు. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో అతను గెలుచుకున్న కంచు పతకం అందరి దృష్టిలో బంగారమైంది.
దేశానికి ప్రాతినిధ్యం వహించినప్పుడల్లా అసమాన ఆటతీరు కనబర్చడం లియాండర్ పేస్‌లో కనిపించే ప్రత్యేక లక్షణం. ఆసియా క్రీడల్లో, డేవిస్కప్లాంటి పోటీల్లో అతని రికార్డులే చెబుతాయి. భారత్‌కు ఆడుతున్న సమయంలో ప్రత్యర్థి ఎంత బలమైనవాడో, ఏ ర్యాంకులో ఉన్నాడో అతనికి కనిపించదు. తన అత్యుత్తమ ఆటతీరుతో చెలరేగిపోయే తత్వంతో పేస్ పలు సంచలన విజయాలు నమోదు చేశాడు. సరిగ్గా ఇదే శైలితో అతను ఒలింపిక్స్‌లో భారత జాతీయ పతకాన్ని ఎగురవేశాడు.
సన్నాహాలు...
లియాండర్ పేస్‌కు ఇది రెండో ఒలింపిక్స్. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో అతను రమేశ్ కృష్ణన్‌తో కలిసి డబుల్స్ బరిలోకి దిగాడు కానీ పెద్దగా ఫలితం దక్కలేదు. దాంతో తర్వాతి ఒలింపిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అతను ఆ తర్వాత వెల్లడించాడు. 1996 ఒలింపిక్స్ కోసం నాలుగేళ్లు ప్రత్యేకంగా సన్నద్ధమయ్యాడు. ఇందుకోసం ప్రొఫెషనల్ టూర్లో కొన్ని టోర్నీలను వదిలేసుకున్నాడు. ఒలింపిక్స్ జరిగే అట్లాంటాలోని స్టోన్ మౌంటెయిన్ను పోలి ఉండే వాతావరణంలో (సముద్ర మట్టానికి ఎక్కువ ఎత్తులో ఉంటుంది) జరిగే టోర్నీలలో, అదీ హార్డ్‌కోర్టు టోర్నీలలో మాత్రమే పాల్గొన్నాడు.
ప్రతిభ ప్లస్ అదృష్టం...
అయితే ఇంతగా శ్రమించినా ఒలింపిక్స్ ‘డ్రా’ చూడగానే అతనిలో ఉత్సాహం ఆవిరైంది. తొలి రౌండ్ ప్రత్యర్థిగా దిగ్గజ ఆటగాడు పీట్ సంప్రాస్ ఎదురయ్యాడు. దాంతో సహచరులు కూడా అయ్యో అంటూ ఓదార్చారు. కానీ అతని కష్టం వృథా పోలేదు. అనూహ్యంగా సంప్రాస్ ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నాడు. దాంతో ఊపిరి పీల్చుకొని వరుసగా ప్రత్యర్థులను చిత్తు చేస్తూ పోయాడు. ఆ సమయంలో పేస్ ప్రపంచ ర్యాంక్ 126. కానీ అతని పట్టుదల ముందు ర్యాంక్‌లు పని చేయలేదు.
వరుస రౌండ్లలో రికీ రెనెబర్గ్ (వరల్డ్ నంబర్ 20), నికోలాస్ పెరీరా (వరల్డ్ నంబర్ 74), థామస్ ఎన్క్విస్ట్ (వరల్డ్ నంబర్ 10), రెంజో ఫుర్లాన్ (వరల్డ్ నంబర్ 26)లను పడగొట్టి పేస్ ముందుకు దూసుకుపోయాడు. నాలుగు విజయాల తర్వాత లియాండర్ దిగ్విజయంగా సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు. అక్కడ అతనికి మరో సూపర్ స్టార్, అప్పటి ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆండ్రీ అగస్సీ ఎదురయ్యాడు. అయితే అప్పటికే ఆత్మవిశ్వాసంతో ఉన్న పేస్ బెదరలేదు. తొలి సెట్‌ను టైబ్రేక్ వరకు తీసుకెళ్లగలిగాడు. అయితే చివరికు అగస్సీ ముందు 6–7 (5/7), 3–6తో తలవంచక తప్పలేదు.
అసలు సమరం...
సెమీస్ మ్యాచ్‌లోనే పేస్ కుడి మణికట్టుకు గాయమైంది. అది తగ్గకుండానే తర్వాతి రోజు కాంస్య పతకం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఆడాల్సి ఉంది. బ్రెజిల్‌కు చెందిన వరల్డ్ 93వ ర్యాంకర్ ఫెర్నాండో మెలిగినీ ప్రత్యర్థిగా నిలబడ్డాడు. ఇక అటో ఇటో తేల్చుకోవాల్సిన సమరంలో గాయాలను పట్టించుకునే స్థితిలో అతను లేడు. నొప్పిని భరిస్తూనే మైదానంలోకి దిగాడు. ఆ రోజు పేస్ తన కోసం కాకుండా దేశం కోసం ఆడినట్లు కనిపించాడు. భారత జాతి యావత్తూ కూడా అన్నీ ఆపేసి అతని విజయం కోసం ఎదురుచూసింది. గెలుపు దక్కాలని కోరుకుంది. కానీ తొలి సెట్‌ను పేస్ 3–6తో కోల్పోయాడు. కోర్టు మొత్తం నిశ్శబ్దం. అదే సమయంలో వాన రావడంతో ఆట ఆగిపోయింది. అయితే ఒక్కసారి వర్షం వెలిశాక పేస్ కొత్తగా కనిపించాడు.
రెండో సెట్లో 1–2తో వెనుకబడి 30–40తో మరో గేమ్ కోల్పోయే దశలో ఒక్కసారిగా ఎదురుదాడికి దిగాడు. అంతే... అతడిని ఆపడం మెలిగినీ వల్ల కాలేదు. వరుసగా రెండు సెట్లు పేస్ ఖాతాలో చేరాయి. చివరకు 3–6, 6–2, 6–4తో అద్భుత విజయం అందుకొని కన్నీళ్లపర్యంతమయ్యాడు. 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో రెజ్లర్ ఖాషాబా జాదవ్ తర్వాత వ్యక్తిగత విభాగంలో పతకం గెలిచిన రెండో భారతీయుడిగా పేస్ నిలిచాడు. కోట్లాది భారతీయులు ఈ విజయం తామే సాధించినంతగా సంబరపడ్డారు. పేస్ తండ్రి వీస్ పేస్ 1972 మ్యూనిక్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత హాకీ జట్టులో సభ్యుడు. దాంతో ఒకే కుటుంబంలో రెండు ఒలింపిక్ పతకాలు చేరడం విశేషం.