కరాటే నేర్చుకుంటున్న నయన
అందాల తార నయనతార సినిమా సినిమాకీ పారితోషికం పెంచేస్తారనే టాక్ ఉంది. తన డిమాండ్‌ని ఏమాత్రం తగ్గించుకోవడానికి ఆమె ఇష్టపడరట. కానీ, పారితోషికం విషయంలో పట్టుదలగా ఉన్నట్లుగానే, పాత్ర పోషణ విషయంలో కూడా ఆమె పట్టుదలగానే ఉంటారు. పాత్ర ఎలా డిమాండ్ చేస్తే అలా ఒదిగిపోతుంటారు నయనతార.
అందుకో ఉదాహరణ ‘శ్రీరామరాజ్యం’. ఈ చిత్రంలో సున్నిత మనస్కురాలు సీతగా కనిపించిన నయనతార, ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలో అందుకు పూర్తి భిన్నంగా కనిపిం చబోతున్నారు. ‘జయం’రవి సరసన నయనతార నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో నయనతార సిన్సియర్ పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారు. హీరోకి దీటుగా ఈ పాత్ర ఉంటుంది. ఈ చిత్రంలో నయనతార ఫైట్స్ కూడా చేస్తారు. అందుకని ఆమె కరాటేలో శిక్షణ తీసుకుంటున్నారట. ఈ శిక్షణ కోసం రోజూ నాలుగు నుంచి ఐదు గంటలు కేటాయిస్తున్నారట. ‘జయం’ రాజా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
ఇది కాకుండా శింబు సరసన నయనతార కథానాయికగా నటిస్తున్న చిత్రం రెండు రోజుల క్రితం ప్రారంభమైంది. ఏడేళ్ల గ్యాప్ తర్వాత తన మాజీ ప్రియుడితో నయనతార నటిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం కోసం ఈ మలయాళ బ్యూటీ దాదాపు రెండు కోట్ల రూపాయలు వరకూ పారితోషికం డిమాండ్ చేశారట. చాలా విరామం తర్వాత శింబుతో కలిసి చేస్తున్న చిత్రం కాబట్టి, మంచి క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతోనే నయన అంత డిమాండ్ చేసి ఉంటారు.