పారతో తల్లిపై దాడి
అక్కంపేట(జంగారెడ్డిగూడెం రూరల్) : పారతో తల్లిపై దాడి చేసిన ఓ కొడుకు ఉదంతమిది. ఈ ఘటన జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేటలో శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అక్కంపేటకు చెందిన పులపాకుల వెంకటలక్ష్మికి గ్రామంలో ఎకరం పొలం ఉంది. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం వెంకటలక్ష్మి మండలంలోని వేగవరంలో ఉంటున్న కూతురు దుర్గ వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో వెంకటలక్ష్మి తన ఎకరం పొలాన్ని కొడుకు రామకృష్ణకు కౌలుకు ఇచ్చింది. ఆ పొలంలో రామకృష్ణ మొక్కజొన్న పంట సాగు చేస్తున్నాడు. దీంతో కౌలు సొమ్ము కోసమని శుక్రవారం వెంకటలక్ష్మి వేగవరం నుంచి అక్కంపేటలోని పొలం వద్దకు వచ్చింది. కొడుకును కౌలు సొమ్ము అడగడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన రామకృష్ణ పొలం పనుల కోసం ఉపయోగించే పారతో తల్లి వెంకలక్ష్మిపై దాడి చేశాడు. ఫలితంగా వెంకటలక్ష్మి తీవ్రంగా గాయపడి అక్కడే కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను స్థానికులు జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు. ఇదిలా ఉంటే వెంకటలక్ష్మి పొలం ప్రస్తుతం చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ పరిధిలోకి వెళ్లింది. దీంతో ఈ పొలానికి ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం విషయంలో తల్లీకొడుకుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్టు గ్రామస్తులు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎం.కేశవరావు తెలిపారు.