సెలవు కోసం సలాం చెయ్యక్కర్లే!
సాక్షి, హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలీసింగ్ నినాదం తో పోలీసు సిబ్బంది పనితీరులో నిత్యం పార దర్శకతకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర పోలీసు విభాగం వారికి ఉన్న ‘హక్కుల్ని’ వినియోగించుకోవడంలోనూ ఇదే విధానం అవలంబించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే సర్వీస్ రికార్డుల్ని ఆన్లైన్ చేస్తోంది. దీంతోపాటు ‘ఈ–లీవ్’ విధానాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. త్వరలో అందుబాటులోకి రానుంది. దీని ప్రకారం సిబ్బంది సెలవు కోసం ‘టీఎస్ కాప్’యాప్ ద్వారానే ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. అధికారులు సైతం ఆన్లైన్లోనే మంజూరు, తిరస్కరణ చేయాల్సి ఉంటుంది. సెలవు ఇవ్వని పక్షంలో అందుకు కారణాన్నీ స్పష్టం చేయాలి.
పోలీసు విభాగంలో కింది స్థాయి సిబ్బందికి పైకి కనిపించని ఇబ్బందులు ఉంటున్నాయి. వీటిలో సెలవు పొందడం కూడా ఒకటి. ఎంతటి అత్యవసరమైనా ఉన్నతాధికారి దయతలిస్తేనే సెలవు లభించే పరిస్థితులున్నాయి. సెలవు మంజూరీలో కొందరు అధికారులు సిబ్బందిని వేధిస్తు న్నారనే ఆరోపణలున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు ‘ఈ–లీవ్’ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పోలీసులకూ సాధారణ సెలవుల నుంచి ఆర్జిత సెలవుల వరకు అన్ని ఉంటాయి. అయితే అత్యవసర సేవలు అందించే విభాగం కావడంతో ఎప్పుడంటే అప్పుడు సెలవు దొరకదు. రాష్ట్రంలోని పరిస్థితులు, బందోబస్తు నిర్వహించాల్సిన సందర్భాలు తదితరాలను పరిగణనలోకి తీసుకుని సెలవు పొందాల్సి ఉంటుంది.
సవాలక్ష అనుమతులు తప్పనిసరి...
ప్రస్తుత నిబంధనల ప్రకారం పోలీసు విభాగంలో కిందిస్థాయి సిబ్బంది సెలవు పొందా లంటే సవాలక్ష అనుమతులు ఉండాల్సిందే. ఇన్స్పెక్టర్ స్థాయి అధికారికి సెలవు కావాల్సి వస్తే... ఆయన లిఖితపూర్వకంగా సంబంధిత జోనల్ డీసీపీకి దరఖాస్తు చేసుకోవాలి. సదరు డీసీపీ... ఆ ఇన్స్పెక్టర్ పని చేసే ఠాణా ఏ డివిజన్లోకొస్తే ఆ ఏసీపీ అభిప్రాయం తీసుకుంటారు. అలాగే.. కానిస్టేబుల్‌కు సెలవు కావాలంటే ఇన్స్పెక్టర్కు, ఎస్సైకి సెలవు కావాలంటే ఏసీపీకి దరఖాస్తు చేసుకుంటారు. అక్కడా తతంగం పూర్తయిన తర్వాతే నిర్ణయం ఉంటుంది. కొన్నిసార్లు తీవ్రజాప్యం జరిగి సెలవు మంజూరైనా ప్రయోజనం ఉండదు. దీంతో అత్యవసరమైతే అనుమతి లభించ కుండానే సెలవుపై వెళ్లిన వారు శాఖాపరమైన చర్యలకు గురికావడం జరుగుతోంది. దీని ఆసరాగా కొందరు అధికారులు సిబ్బందిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి అంశాలకు ఆస్కారం లేకుండా చేయడానికే రాష్ట్ర పోలీసు విభాగం ‘ఈ–లీవ్’పేరుతో ప్రత్యేక విధానం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.
నిర్ణీత కాలంలో నిర్ణయం...
సిబ్బంది సెలవు కోరుతూ దరఖాస్తు కోసం అధికారిక, అంతర్గతమైన ‘టీఎస్ కాప్’యాప్‌లోని ‘పోలీస్ వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ సిస్టం’లో దరఖాస్తు చేసుకుంటారు. దీనిద్వారా సెలవు కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే ఆ సమాచారం తక్షణం సంక్షిప్త సందేశం రూపంలో దాన్ని మంజూరు చేయాల్సిన, పర్యవేక్షించాల్సిన అధికారులకు చేరుతుంది. ఈ దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవడానికీ కాలపరిమితి విధించారు. ప్రస్తుతానికి గరిష్టంగా 72 గంటల్లో నిర్ణయం తీసుకునేలా టార్గెట్ పెట్టాలని యోచిస్తున్నారు. ఈలోపు సెలవు విషయం తేల్చడంతో పాటు తిరస్కరిస్తే అందుకు గల కారణాన్నీ ఉన్నతాధికారులు, అధికారులు ఆన్లైన్లోనే వివరించాల్సి ఉంటుంది. ఓ దరఖాస్తుపై సంబంధిత అధికారి నిర్ణయం తీసుకునే వరకు సంక్షిప్త సందేశాల (ఎస్సెమ్మెస్) రూపంలో ఆయనకు రిమైండర్స్ వస్తూనే ఉంటాయి. సెలవు మంజూరైతే తక్షణం ఆ విషయం దరఖాస్తు చేసుకున్న సిబ్బందికి సంక్షిప్త సందేశం రూపంలో తెలుస్తుంది. పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ ఉన్నతాధికారులు ప్రవేశపెట్టనున్న ‘ఈ–లీవ్’ విధానం త్వరలో రాష్ట్ర స్థాయిలో అమలులోకి రానుంది.