పోలీసులకు పది రోజులకో సెలవు
ఉత్తరప్రదేశ్‌లో పోలీసులకు శుభవార్త. ఇక మీదట వాళ్లకు ప్రతి పది రోజులకు ఒక సెలవు లభిస్తుంది. ఈ విధానాన్ని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆమోదించినట్లు డీజీపీ జావేద్ అహ్మద్ తెలిపారు. ఇది వచ్చే వారం నుంచి అమలవుతుంది. పోలీసు బలగాలపై తీవ్రంగా ఉన్న ఒత్తిడిని అధిగమించేందుకు సెలవులు ఇవ్వాలని చాలా కాలంగా డిమాండు ఉంది. ఇన్నాళ్లుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పోలీసులు పనిచేస్తున్నారు.
కృష్ణాష్టమి సందర్భంగా పోలీసు లైన్స్‌లో జరిగిన వేడుకల ముగింపు సందర్భంలో అహ్మద్ ఈ ప్రకటన చేశారు. కొన్నేళ్ల క్రితం లక్నోలోని ఒక పోలీసు స్టేషన్‌లో ఇలాంటి ప్రయోగం చేశారు గానీ, తగినంతగా సిబ్బంది లేకపోవడం, యూపీలో నేరాలు పెరగడంతో వెంటనే మానేశారు. గోరఖ్‌పూర్, వారణాసిలలో జరిగిన ప్రయోగాలు కూడా బెడిసికొట్టాయి. కానీ ఇప్పుడు మాత్రం యూపీ పోలీసు విభాగంలో కానిస్టేబుళ్ల నియామకం జరగడం, తగినంత మంది ఎస్ఐలు కూడా ఉండటంతో ఇప్పుడు సెలవులు ఇవ్వచ్చని భావిస్తున్నారు. దీంతో పోలీసు సిబ్బందికి పెద్ద ఊరట లభించినట్లవుతుంది.