సమస్యలపై పోరాడేది ఐఎన్‌టీయూసీనే
యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రావు
రుద్రంపూర్: సింగరేణిలో కార్మికుల సమస్యలపై పోరాటాలు చేసేది సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్టీయూసీ) మాత్రమేనని ఆ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్సీ బి.వెంకట్రావు అన్నారు. ఆదివారం స్థానిక ఐఎన్టీయూసీ కార్పొరేట్ బ్రాంచి ఆధ్వర్యంలో వైస్ ప్రెసిడెంట్ సోమిరెడ్డి అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్యూన్ డిజిగ్నేషన్ మార్చి ఆఫీస్ సబార్డినేట్ ఇప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గత నెల చివరివారంలో అన్ని జాతీయ కార్మిక సంఘాలతో కలిసి సీఎంను కలిసి సకలజనుల సమ్మె కాలపు వేతనం, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అమలుపై విజ్ఞప్తి చేశామన్నారు. కొత్త బావులు ఏర్పడిన తరువాత డిపెండెంట్ ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం చెప్పారని, ప్రస్తుతం కొత్త గనులు వచ్చినందున వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. లేకపోతే జాతీయ కార్మిక సంఘాలను కలుపుకుని సమ్మె చేస్తామన్నారు. ఇన్‌కంటాక్స్ శ్లాబ్‌ను పెంచే విధంగా కృషి చేస్తామన్నారు. ఎస్అండ్పీసీ క్యాడర్ స్కీం కోసం యాజమాన్యంతో మాట్లాడతామని, 5 గనులను ప్రైవేటుపరం చేయాలనే యాజమాన్య ప్రయత్నాన్ని అడ్డుకుంటామని తెలిపారు. బ్రాంచి సెక్రటరీ సలస కుమార్, ఆర్.రాజేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ కృష్ణారెడ్డి, బండి కృష్ణ, జె.శ్రీనివాస్, కె.రామలక్ష్మారెడ్డి, పి.శ్రీనివాస్, సలీం, మొగల్ సాహెబ్, బాబూరావు, జగన్నాధం, జావెద్, బండ కోటి, సాధిక్‌పాషా తదితరులు పాల్గొన్నారు.