led bulbs distribution
-
గ్రామాలకు ఎల్ఈడీ వెలుగులు
సాక్షి, అమరావతి: గ్రామాలను ఎల్ఈడీల వెలుగులతో నింపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘గ్రామ ఉజాల’ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఇప్పటికే 4.36 లక్షల ఎల్ఈడీ బల్బులను కూడా పంపిణీ చేయగా, ఇకపై భారీగా పంపిణీ చేసేందుకు అధికారులు కార్యాచరణకు ఉపక్రమిస్తున్నారు. గ్రామ ఉజాల పథకానికి దేశంలో కేవలం ఐదు రాష్ట్రాలనే కేంద్రం ఎంపిక చేసింది. వాటిలో ఉత్తరప్రదేశ్, బిహార్, కర్ణాటక, తెలంగాణతో పాటు మన రాష్ట్రం కూడా ఉంది. ఈ పథకం ద్వారా ఏపీతో కలిపి ఐదు రాష్ట్రాల్లో కోటి ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేయాలని ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) అనుబంధ సంస్థ కన్వర్జన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్) నిర్ణయించింది. సహకరించాలని కోరిన సీఈఎస్ఎల్ దశలవారీగా గ్రామీణ గృహాలకు నాణ్యమైన లైటింగ్‌ను అందించడం గ్రామ ఉజాల పథకం లక్ష్యం. ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ ఎల్ఈడీ బల్బుల పంపిణీ వల్ల విద్యుత్ బిల్లులు కొంతమేర తగ్గుతాయి. విద్యుత్ సంస్థలకు గరిష్ట డిమాండ్‌ను గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి ఉజాల పథకం అమలుకు అవసరమైన సహకారాన్ని అందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇంధన శాఖను సీఈఎస్ఎల్ ఇటీవల కోరింది. ఈమేరకు ఎండీ మహువా ఆచార్య ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్‌కు లేఖ రాశారు. గ్రామీణ ప్రజలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ఖర్చుతో అందించాలనే తమ ప్రయత్నానికి తోడవుతున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఈఎస్‌ఎల్‌కు ఇంధన శాఖ కార్యదర్శి తిరిగి లేఖ పంపారు. మన్నిక ఎక్కువ ఆంధ్రప్రదేశ్‌తో సహా ఐదు రాష్ట్రాల్లో గతేడాది డిసెంబర్ 14న 10 లక్షల ఎల్ఈడీ బల్బులను సీఈఎస్ఎల్ అందించింది. మన రాష్ట్రంలోని అప్పటి వైఎస్సార్ కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో లక్షకు పైగా ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేసింది. వీటితో కలిపి మొత్తం 4.36 లక్షల ఎల్ఈడీ బల్బులు రాష్ట్రానికి చేరాయి.వినియోగదారుడు బల్బుకు రూ.10 చెల్లిస్తే చాలు.ఎల్ఈడీ బల్బుల పంపిణీకి అయ్యే మొత్తం ఖర్చును సీఈఎస్ఎల్ భరిస్తుంది. విద్యుత్ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదు. ఎల్ఈడీ బల్బుల సామర్థ్యం ఎక్కువ. నాణ్యతతో దీర్ఘకాలం మన్నుతాయి. సాధారణ బల్బులతో పోల్చినప్పుడు 88 శాతం తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి. 25 రెట్ల కాంతి ఎక్కువ ఉంటుంది. సీఎఫ్ఎల్ బల్బులతో పోలిస్తే ఎల్ఈడీలు తక్కువ వేడిని విడుదల చేస్తాయి. తద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుంది. -
ప్రతి ఇంటికీ 4 ఎల్ఈడీ బల్బులు
సాక్షి, అమరావతి: ఒక్కో బల్బు రూ.10 చొప్పున అత్యధిక సామర్థ్యం గల నాలుగు ఎల్ఈడీ బల్బులను విద్యుత్ శాఖ ప్రతి ఇంటికి అందించనుందని రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ఇంధన పొదుపు సంస్థ ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ‘గ్రామ ఉజాలా’ పథకాన్ని అందుబాటులోకి తెస్తోందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థతో కలిసి చేపట్టే ఈ పథకాన్ని దేశంలో ఐదు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ పథకానికి ఈఈఎస్ఎల్ రూ.450 కోట్ల పెట్టుబడి పెడుతుందన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► తొలి విడత వారణాసి (ఉత్తరప్రదేశ్), వాద్నగర్ (గుజరాత్), నాగపూర్ (మహారాష్ట్ర), ఆరా (బీహార్), కృష్ణా (ఆంధ్రప్రదేశ్) జిల్లాలను ఎంపిక చేశారు. ► ఇంధన పొదుపులో భాగంగా గతంలో 9 ఓల్టుల ఎల్ఈడీ బల్బులు అందించారు. ఇప్పుడు 12 ఓల్టుల ఎల్ఈడీ బల్బులు అందిస్తారు. సాధారణ బల్బుతో పోలిస్తే 12 ఓల్టుల ఎల్ఈడీ బల్బుల వల్ల 75 శాతం కరెంట్ ఆదా అవుతుంది. 25 శాతం మన్నిక ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతను గణనీయంగా తగ్గించే సామర్థ్యం ఈ బల్బుకు ఉంది. ►ఏపీలో తొలి దశలో కృష్ణా జిల్లాలోని గుణదల, గుడివాడ, మచిలీపట్నం, నూజివీడు, విజయవాడ టౌన్, రూరల్‌లో ప్రతి ఇంటికి 12 ఓల్టుల ఎల్ఈడీ బల్బులు నాలుగు ఇస్తారు. వీటిని తీసుకునే ముందు సాధారణ బల్బులను (40, 60, 100 వాల్టుల బల్బులు ఏదైనా) విద్యుత్ అధికారులకు అందజేయాలి. ఈ జిల్లాలో 8.83 లక్షల ఇళ్లకు ఇంటికి నాలుగు బల్బుల చొప్పున పంపిణీ చేయనున్నారు. ► గృహ విద్యుత్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ బల్బులు తీసుకోవచ్చు. ఈఈఎస్ఎల్ నేతృత్వంలో స్థానిక విద్యుత్ అధికారుల సమన్వయంతో పంపిణీ జరుగుతుంది. ఇందుకోసం విద్యుత్ కనెక్షన్ల ఆధారంగా డేటా రూపొందిస్తున్నాం. ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియ పూర్తయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాం. -
'ఇళ్లకు 7 కోట్ల ఎల్ఈడీ బల్బులు పంచుతాం'
విద్యుత్తును ఆదా చేయడంలో భాగంగా గృహ వినియోగదారులకు 7 కోట్ల ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో బల్బు ధరను వంద రూపాయలుగా నిర్ణయించారు. మహాడిస్కం, రిలయన్స్ ఎనర్జీ, టాటా పవర్, బెస్ట్ సంస్థల ద్వారా వీటిని పంపిణీ చేస్తారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వాధీన్ క్షత్రియ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎల్ఈడీ బల్బుల ఖరీదు చాలా ఎక్కువగా ఉంది. వినియోగదారులు ఎక్కువైతే ఎల్ఈడీ బల్బుల ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుతుందని అధికారులు అంటున్నారు. ఎల్ఈడీ బల్బుల పంపిణీ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవను ప్రధాని నరేంద్రమోదీ కూడా ప్రశంసించారని తాత్కాలిక సీఎస్‌గా వ్యవహరిస్తున్న పి.ఎస్. మీనా తెలిపారు. ఎల్ఈడీ బల్బుల విషయంలో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉండగా, రెండో స్థానంలో మహారాష్ట్ర ఉందని ప్రధాని చెప్పారు. గృహ విద్యుత్ వినియోగాన్ని 35 నుంచి 50 శాతం వరకు తగ్గించాలన్నది ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వ సచివాలయం రూపురేఖలు మార్చిన తర్వాత అందులో అన్నీ ఎల్ఈడీ బల్బులే బిగించారు. దీనివల్ల ఏడాదికి విద్యుత్ బిల్లులో రూ. 31 లక్షలు ఆదా అవుతోందని మీనా చెప్పారు.