'ఇళ్లకు 7 కోట్ల ఎల్ఈడీ బల్బులు పంచుతాం'
విద్యుత్తును ఆదా చేయడంలో భాగంగా గృహ వినియోగదారులకు 7 కోట్ల ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో బల్బు ధరను వంద రూపాయలుగా నిర్ణయించారు. మహాడిస్కం, రిలయన్స్ ఎనర్జీ, టాటా పవర్, బెస్ట్ సంస్థల ద్వారా వీటిని పంపిణీ చేస్తారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వాధీన్ క్షత్రియ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎల్ఈడీ బల్బుల ఖరీదు చాలా ఎక్కువగా ఉంది. వినియోగదారులు ఎక్కువైతే ఎల్ఈడీ బల్బుల ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుతుందని అధికారులు అంటున్నారు.
ఎల్ఈడీ బల్బుల పంపిణీ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవను ప్రధాని నరేంద్రమోదీ కూడా ప్రశంసించారని తాత్కాలిక సీఎస్గా వ్యవహరిస్తున్న పి.ఎస్. మీనా తెలిపారు. ఎల్ఈడీ బల్బుల విషయంలో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉండగా, రెండో స్థానంలో మహారాష్ట్ర ఉందని ప్రధాని చెప్పారు. గృహ విద్యుత్ వినియోగాన్ని 35 నుంచి 50 శాతం వరకు తగ్గించాలన్నది ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వ సచివాలయం రూపురేఖలు మార్చిన తర్వాత అందులో అన్నీ ఎల్ఈడీ బల్బులే బిగించారు. దీనివల్ల ఏడాదికి విద్యుత్ బిల్లులో రూ. 31 లక్షలు ఆదా అవుతోందని మీనా చెప్పారు.