ప్రతి ఇంటికీ 4 ఎల్‌ఈడీ బల్బులు | 4 LED bulbs per house in AP | Sakshi
Sakshi News home page

ప్రతి ఇంటికీ 4 ఎల్‌ఈడీ బల్బులు

Published Mon, Jan 18 2021 5:10 AM | Last Updated on Mon, Jan 18 2021 8:00 AM

4 LED bulbs per house in AP - Sakshi

సాక్షి, అమరావతి: ఒక్కో బల్బు రూ.10 చొప్పున అత్యధిక సామర్థ్యం గల నాలుగు ఎల్‌ఈడీ బల్బులను విద్యుత్‌ శాఖ ప్రతి ఇంటికి అందించనుందని రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ చంద్రశేఖర్‌ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ఇంధన పొదుపు సంస్థ ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) ‘గ్రామ ఉజాలా’ పథకాన్ని అందుబాటులోకి తెస్తోందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థతో కలిసి చేపట్టే ఈ పథకాన్ని దేశంలో ఐదు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ పథకానికి ఈఈఎస్‌ఎల్‌ రూ.450 కోట్ల పెట్టుబడి పెడుతుందన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

► తొలి విడత వారణాసి (ఉత్తరప్రదేశ్‌), వాద్‌నగర్‌ (గుజరాత్‌), నాగపూర్‌ (మహారాష్ట్ర), ఆరా (బీహార్‌), కృష్ణా (ఆంధ్రప్రదేశ్‌) జిల్లాలను ఎంపిక చేశారు. 

► ఇంధన పొదుపులో భాగంగా గతంలో 9 ఓల్టుల ఎల్‌ఈడీ బల్బులు అందించారు. ఇప్పుడు 12 ఓల్టుల ఎల్‌ఈడీ బల్బులు అందిస్తారు. సాధారణ బల్బుతో పోలిస్తే 12 ఓల్టుల ఎల్‌ఈడీ బల్బుల వల్ల 75 శాతం కరెంట్‌ ఆదా అవుతుంది. 25 శాతం మన్నిక ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతను గణనీయంగా తగ్గించే సామర్థ్యం ఈ బల్బుకు ఉంది. 

►ఏపీలో తొలి దశలో కృష్ణా జిల్లాలోని గుణదల, గుడివాడ, మచిలీపట్నం, నూజివీడు, విజయవాడ టౌన్, రూరల్‌లో ప్రతి ఇంటికి 12 ఓల్టుల ఎల్‌ఈడీ బల్బులు నాలుగు ఇస్తారు. వీటిని తీసుకునే ముందు సాధారణ బల్బులను (40, 60, 100 వాల్టుల బల్బులు ఏదైనా) విద్యుత్‌ అధికారులకు అందజేయాలి. ఈ జిల్లాలో 8.83 లక్షల ఇళ్లకు ఇంటికి నాలుగు బల్బుల చొప్పున పంపిణీ చేయనున్నారు. 

► గృహ విద్యుత్‌ కనెక్షన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ బల్బులు తీసుకోవచ్చు. ఈఈఎస్‌ఎల్‌ నేతృత్వంలో స్థానిక విద్యుత్‌ అధికారుల సమన్వయంతో పంపిణీ జరుగుతుంది. ఇందుకోసం విద్యుత్‌ కనెక్షన్ల ఆధారంగా డేటా రూపొందిస్తున్నాం. ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియ పూర్తయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement