LED street lights
-
గ్రామ సచివాలయాలకు వీధి దీపాల బాధ్యత
సాక్షి, అమరావతి: పల్లెల్లోని ఎల్ఈడీ వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను గ్రామ సచివాలయాలకు అప్పగించబోతున్నారు. ఈ నెల 31న అధికారికంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ వెల్లడించింది. ప్రభుత్వ సేవలను ‘జగనన్న పల్లె వెలుగు’ పేరుతో ప్రజల ముంగిటకే తెస్తున్న సర్కారు.. రాత్రి వేళ ప్రతీ వీధి దీపం వెలగాలన్న లక్ష్యంతోనే కీలక అడుగువేసిందని రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈఓ ఎ. చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వీధి దీపాల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిర్వహణ లోపాలతో.. కేంద్ర ఇంధన పొదుపు సంస్థ అయిన ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) 10,382 గ్రామ పంచాయతీల్లో 23.29 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటుచేసింది. ఈ పథకం కిందలేని 2,303 గ్రామ పంచాయతీల్లోనూ అదనంగా 4 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలు అమర్చాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. ఇప్పటివరకూ వీధి దీపాల నిర్వహణ బాధ్యత ఈఈఎస్ఎల్ నియమించిన కాంట్రాక్టు సంస్థ పరిధిలో ఉండేది. కానీ, దీనివల్ల అనేక సమస్యలొస్తున్నాయి. వెలగని, కాలిపోయిన వీధి దీపాలను మార్చడంలేదన్న విమర్శలొస్తున్నాయి. ఫలితంగా పల్లెల్లో కారుచీకట్లు నెలకొంటున్నాయని ఫిర్యాదులొస్తున్నాయి. వీటిపై ఇటీవల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షించారు. గ్రామ సచివాలయాల్లో 7 వేల మంది ఎనర్జీ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవస్థకు వీధి దీపాల నిర్వహణ బాధ్యత అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 48 గంటల్లోనే రిపేర్ వీధి దీపాల నిర్వహణకు అధికారులు ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వెలగని వీధి దీపంపై ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. గ్రామ సచివాలయాలకు వీధి దీపాల పోర్టల్ లింక్ అయి ఉంటుంది. వీటిద్వారా వచ్చిన ఫిర్యాదులను ఎనర్జీ అసిస్టెంట్లు, గ్రామ వలంటీర్లు పరిశీలించి తక్షణమే స్పందిస్తారు. ఫిర్యాదు అందిన 48 గంటల్లో దానిని రిపేర్ చేయాల్సి ఉంటుందని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఎనర్జీ అసిస్టెంట్లకు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు ఇంధన శాఖ వెల్లడించింది. ఇక కాలిపోయిన, చెడిపోయిన లైట్లను మార్చుకునేలా ప్రతీ పంచాయతీ పరిధిలో కొన్ని లైట్లు అందుబాటులో ఉంచనున్నారు. -
గ్రామ సచివాలయాలకు వీధి దీపాల బాధ్యత
సాక్షి, అమరావతి: గ్రామాల్లో ఎల్ఈడీ వీధి దీపాలను మరింత సమర్థంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వీధి దీపాల నిర్వహణ బాధ్యతను గ్రామ సచివాలయాల చేతుల్లో పెట్టాలని యోచిస్తోంది. ఫిర్యాదు వచ్చిన 48 గంటల్లోనే వెలిగేలా క్షేత్రస్థాయి సిబ్బందిని సమాయత్తం చేస్తోంది. సచివాలయ కార్యదర్శిని పర్యవేక్షకుడిగా నియమించనుంది. ఈ దిశగా విధివిధానాలను రూపొందించాలని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. వివరాలను ఇంధన పొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ► పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ భాగస్వామ్యంతో ఎల్ఈడీ వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. ► ఫిర్యాదుల పరిష్కారంలో ఎనర్జీ అసిస్టెంట్ల తోడ్పాటు కూడా తీసుకుంటారు. ఒకవేళ ఎనర్జీ అసిస్టెంట్లు అందుబాటులో లేకపోతే పంచాయతీ కార్యదర్శి ప్రత్యేకంగా సాంకేతిక నిపుణులను నియమించుకోవచ్చు. ► కొత్త వ్యవస్థలో భాగంగా డెస్‌్కటాప్, మొబైల్ ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేయడంతో పాటు టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ► గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ వీధి లైట్లు అమర్చడం వల్ల దీర్ఘకాలికంగా రూ.156 కోట్ల విలువైన విద్యుత్ ఆదా చేయవచ్చు. -
ఇక గ్రామ సచివాలయాలకు వీధి దీపాల నిర్వహణ
సాక్షి, అమరావతి: రాత్రిపూట మీ ఇంటి వద్ద ఉన్న కరెంట్ స్తంభానికి లైట్ వెలగడం లేదా?, పగలు, రాత్రి నిరంతరం వెలుగుతూనే ఉందా?.. అయితే ఇలాంటి సమస్యలకు ఇక తెరపడినట్టే. ప్రస్తుతం ప్రైవేట్ కాంట్రాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న గ్రామాల్లోని వీధి దీపాల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను గ్రామ సచివాలయాలకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. ఇక వీధి దీపాలకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా ప్రజలు స్థానిక గ్రామ సచివాలయాల్లో ఫిర్యాదు చేయొచ్చు లేదా వలంటీర్ ద్వారా ఫిర్యాదు చేయించవచ్చు. ప్రతి గ్రామ సచివాలయానికి ఒకరు చొప్పున ప్రభుత్వం కొత్తగా నియమించిన ఎనర్జీ అసిస్టెంట్ తక్షణమే ఆ సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో దాదాపు 200 కరెంటు స్తంభాలు ఉంటాయని, వలంటీర్ల సహాయంతో ఎనర్జీ అసిస్టెంట్ వాటిని సమర్థవంతంగా పర్యవేక్షిస్తారని అధికారులు చెబుతున్నారు. డబ్బు ఆదాతోపాటు ఆధునిక పరికరాల కొనుగోలుకూ.. ► వీధి దీపాల నిర్వహణ, పర్యవేక్షణను గ్రామ సచివాలయాలకు అప్పగించడం ద్వారా గ్రామ పంచాయతీలు ఏడాదికి చెల్లించే రూ.29.03 కోట్లు ఆదా అవుతాయి. ► ఈ మొత్తాన్ని ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగుల జీతభత్యాలకు వినియోగించడంతోపాటు అవసరమైతే వీధి దీపాల నిర్వహణకు ఆధునిక పరికరాల కొనుగోలు చేయొచ్చని అధికారులు తెలిపారు. ► ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9 వేల మంది ఎనర్జీ అసిస్టెంట్లు కరెంట్ స్తంభాలు ఎక్కడంతోపాటు గ్రామాల్లో వీధి దీపాల పర్యవేక్షణను చేయగలరని చెప్పారు. అస్తవ్యస్తం చేసిన గత టీడీపీ ప్రభుత్వం ► గత టీడీపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించి గ్రామాల్లో ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు పేరుతో వాటిని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించింది. ► ఇందుకుగాను ఏడాదికి రూ.29.03 కోట్లు గ్రామ పంచాయతీలు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. ► ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఇప్పటిదాకా ప్రతి నాలుగు వేల వీధి దీపాలకు ఒకరు చొప్పున నియమించారు. ► దీంతో పూర్తి స్థాయి పర్యవేక్షణ కొరవడి గ్రామీణ ప్రాంతాల్లోని 24.19 లక్షల వీధి దీపాల్లో 60 వేలకు పైగా ఎక్కడో చోట వెలగడం లేదు. మరో లక్ష వరకు రాత్రి, పగలు వెలుగుతున్నాయని అధికారుల పరిశీలనలో వెల్లడైంది. -
పల్లె పల్లెకూ ఎల్ఈడీ వెలుగులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఎల్ఈడీ వీధి లైట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. విద్యుత్, పంచాయతీరాజ్, ఇతర శాఖల అధికారులతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్ఈడీ వీధి దీపాలు బిగించడమే కాకుండా.. నిర్వహణపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు మంత్రి సూచించారు. వెలగని వీధి దీపాల సమాచారాన్ని తెలుసుకునేందుకు గ్రామ వలంటీర్ల సహకారం తీసుకోవాలన్నారు. ఈ వివరాలను ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఇవీ ప్రతిపాదనలు ► రాష్ట్రంలో ఇప్పటివరకూ 10,382 గ్రామ పంచాయతీలలో 23. 29 లక్షల ఎల్ఈడీ వీధి లైట్లను బిగించారు. ► తాజాగా ప్రజాప్రతినిధుల నుంచి ఎల్ఈడీ వీధి దీపాల కోసం విజ్ఞప్తులొస్తున్నాయి. ఇలాంటి 2,303 గ్రామాలను గుర్తించి.. అన్నిచోట్లా ఎల్ఈడీ లైట్లను అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ► ఎల్ఈడీ వీధి దీపాలు బిగించడం వల్ల ఏడాదికి 260 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చని, తద్వారా ఏటా రూ.156 కోట్ల విద్యుత్ బిల్లులు ఆదా అవుతాయని ఇంధన శాఖ అధికారులు మంత్రికి తెలిపారు. ► రాష్ట్రంలో మరోసారి భారీ ఎత్తున చేపట్టనున్న ఎల్ఈడీ వీధి లైట్ల కార్యక్రమానికి ఇంధన శాఖ పూర్తి స్థాయి లో సహకారం అందిస్తుందని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి తెలిపారు. ► వీధిలైట్ల ఏర్పాటుకు అనుమతి వస్తే జూన్ నెలలో అయినా పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ సంబంధిత అధికారులకు సూచించారు. ► టెలీకాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పాల్గొన్నారు. -
వీధి దీపం వెలగలేదా?
సాక్షి, అమరావతి: ఎల్ఈడీ వీధి దీపాలు వెలగలేదని ఫిర్యాదు అందిన 72 గంటల్లో సమస్యను పరిష్కరించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. వేగవంతమైన స్పందన యంత్రాంగాన్ని (రాపిడ్ రెస్పాన్స్ మెకానిజం–ఆర్ఆర్ఎం) ఏర్పాటు చేయాలని సూచించారు. వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన వెరిఫికేషన్ కమిటీతో మంత్రి సోమవారం భేటీ అవుతారు. ఇందుకు సంబంధించి ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. ఈ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. గ్రామాల్లో నూరు శాతం వీధిదీపాలు వెలగాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎల్ఈడీ వీధిదీపాల ఫిర్యాదులపై తక్షణం స్పందించాలంటే క్షేత్రస్థాయిలో పటిష్టమైన, విస్తృతస్థాయి నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. ప్రజల ఫిర్యాదులపై అధికారులు స్పందించి 72 గంటల్లో పరిష్కరించాలన్నారు. ఎల్ఈడీ వీధి దీపాలపై ఫిర్యాదుల పరిష్కారానికి ఇప్పటికే ఒక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేశామని అధికారులు మంత్రికి వివరించారు. గ్రామ వలంటీర్ల ద్వారా వచ్చిన ఫిర్యాదులను పంచాయతీ కార్యదర్శి సదరు పోర్టల్‌లో నమోదు చేస్తే ఈఈఎస్ఎల్ తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామాల్లో దాదాపు 25.04 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలు అమర్చామని, వీటిలో 1.5 లక్షల వీధి దీపాలు నెడ్‌క్యాప్ చేయగా, 23.54 లక్షల వీధి దీపాలను ఈఈఎస్ఎల్ ఏర్పాటు చేసిందని, దీనివల్ల ఏడాదికి 260 మిలియన్ యూనిట్ల విద్యుత్, రూ.156 కోట్ల నిధులు ఆదా అవుతాయని అంచనా వేసినట్టు తెలిపారు. కొత్తగా ఏర్పాటైన కాలనీల్లో మరో 35 లక్షల వీధి దీపాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని వివరించారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ ఎల్ఈడీ కార్యక్రమం అమలుతీరుపై వెరిఫికేషన్ కమిటీ క్షేత్రస్థాయిలో అధ్యయనం నిర్వహిస్తుందని, దీన్ని పటిష్టంగా అమలు చేసేందుకు, ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకు అనువైన సిఫారసులను చేస్తుందని వివరించారు. -
పల్లెల్లో ఎల్ఈడీ వెలుగులు!
సాక్షి, హైదరాబాద్: కరెంటు బిల్లుల భారం తగ్గించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే పట్టణాల్లో ఎల్ఈడీ లైట్లను ప్రవేశపెట్టిన ప్రభుత్వం..పల్లెల్లోనూ ఈ దీపాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మామూలు వీధి దీపాలను వినియోగిస్తున్న గ్రామ పంచాయతీలు.. ఇకపై తక్కువ విద్యుత్, ఎక్కువ కాంతులు వెదజల్లే ఎల్ఈడీ లైట్లతో వెలిగిపోనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ ఆదాలో మంచి గుర్తింపు ఉన్న ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈ ఎస్ఎల్)తో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 12,753 గ్రామ పంచాయతీల్లో ఏడేళ్లపాటు వీధి దీపాల సరఫరా, ఏర్పాటు, నిర్వహణ వ్యవహారాలను ఈ సంస్థ చూడనుంది. ఈఈఎస్ఎల్తో త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాలని భావించిన పంచాయతీరాజ్‌శాఖ.. ఈ అగ్రిమెంట్లో జిల్లా పంచాయ తీ అధికారి, గ్రామ పంచాయతీ, ఈఈఎస్ఎల్లకు భాగస్వామ్యం కల్పిస్తోంది. నిధుల్లేకుంటే డీపీవోల ద్వారా సర్దుబాటు గ్రామాల్లో ఉపయోగిస్తున్న వీధి దీపాలతో కరెంట్ బిల్లులు భారీగా రావడమేగాకుండా.. నిర్వహణ కూడా కష్టసాధ్యమవుతోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ పొదుపు, నిర్వహణ వ్యయం తగ్గేలా దీపాల వ్యవస్థను అమలు చేస్తామని ఈఈఎస్ఎల్ సంస్థ ముందుకు రావడంతో పంచాయతీరాజ్‌శాఖ అటువైపు మొగ్గు చూపింది. ఒప్పందకాలంలో ఎల్ఈడీ లైట్ల నిర్వహణ బాధ్యత పూర్తిగా సంస్థదే. దీపాల బిగింపు, నిర్వహణ, ఇంధన పొదుపు సాంకేతికతలో భాగంగా టైమర్ల ఏర్పాటు వ్యవస్థను కూడా సంస్థనే చూసుకోవాల్సి ఉంటోంది. నెలవారీ విద్యుత్ బిల్లులను స్థానిక పంచాయతీ చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ నిధుల కటకటతో చెల్లించలేని పరిస్థితుల్లో జీపీ ఉంటే జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) బిల్లులను సర్దుబాటు చేయాలని పీఆర్ శాఖ నిర్దేశించింది. టెండర్లతో సంబంధం లేకుండా.. సంస్థతో అగ్రి మెంటు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈఈ ఎస్ఎల్ సంస్థ పనితీరును మదింపు చేయాలని జీపీలను ఆదేశించింది. నేషనల్ లైట్స్ కోడ్ ప్రమాణాలకు అనుగుణంగా దీపాలను ఏర్పా టు చేశారా? లేదా పరిశీలించాలని నిర్దేశించింది. ఇదిలావుండగా, రాష్ట్రవ్యాప్తంగా అన్నిగ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ పరిశీలనకు పంచాయతీరాజ్ కమిషనరేట్‌లో కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. త్రైపాక్షిక ఒప్పంద పత్రా ల నమూనాను జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్ కమిషనర్ ఎం.రఘునందన్‌రావు పంపారు. -
పురపాలికలకు ‘కొత్త’ కళ
► మార్చిలోగా మునిసిపాలిటీలు బహిరంగ మల, మూత్ర రహితం ► ఉగాదిలోగా అంతటా ఎల్ఈడీ వీధి దీపాలు: మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరాన్ని పురస్కరించు కొని పురపాలక శాఖ కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జల మండలి, హైదరాబాద్ మెట్రో రైలు, పురపాలక శాఖ డైరెక్టరేట్(సీడీఎంఏ), టౌన్ ప్లానింగ్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగాల అధిపతుల తో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ఇక్కడ సమీక్ష నిర్వహించారు. వచ్చే మే నెలలోగా రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత ప్రాంతాలుగా ప్రకటించడమే లక్ష్యంగా పని చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఉగాదిలోగా అన్ని మునిసిపాలిటీల్లో ఎల్ఈడీ వీధి దీపాలను అమర్చాలని అన్నారు. కొత్త సంవత్సరంలో చేపట్టా ల్సిన కార్యక్రమాలకు నిర్ణీత కాల వ్యవధిని నిర్ణయించుకుని అమలు చేయా లని సూచించారు. దీర్ఘకా లిక, మధ్యంతర, స్వల్పకాలిక కార్య క్రమాల అమలు కోసం నిర్ణీత కాలవ్యవధితో ప్రణాళి కలను రూపొందించి 15 రోజు ల్లోగా సమర్పించాలని కోరారు. రెండు న్నరేళ్లలో పురపాలనకు సంబంధించి అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామని మంత్రి కేటీఆర్ సం తృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ ఉద్యో గుల ఏకీకృత సర్వీసుల బిల్లు, బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు బిల్లును ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో తీసుకొచ్చామని, ప్రతిపక్ష పార్టీలు సైతం అభినందించాయ న్నారు. గత ఏడాది తాగునీరు, పారిశుద్ధ్య రంగాల్లో అనేక కార్యక్రమాలను చేపట్టి ప్రజల ఇబ్బందులను దూరం చేశామని వివరించారు. మరింత అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. -
కొత్త వెలుగు!
* ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు.. * సిద్దిపేట, గజ్వేల్ ఎంపిక * పెలైట్ ప్రాజెక్టుగా భారత్‌నగర్‌లో అమలు * విద్యుత్ వినియోగంలో ఆదాకు ప్రయోగం * నేడు రాజధానిలో త్రిసభ్య సమావేశం సిద్దిపేట జోన్: జిల్లాలోని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్దిపేట, నగర పంచాయితీ గజ్వేల్-ప్రజ్ఞాపూర్ ఇకపై ఎల్ఈడీ వెలుగులు విరజిమ్మనున్నాయి. రెండు ప్రాంతాల్లో ఎల్ఈడీ వీధి దీపాల వ్యవస్థను అమలు చేసే నిమిత్తం నేడు కీలక ఒప్పందం కుదరనుంది. విధానం అమలులో భాగంగా సిద్దిపేటలోని భారత్‌నగర్ పెలైట్ ప్రాజెక్టుగా ఎంపికైంది. సాధారణ విద్యుత్ వినియోగం భారంగా మారిన క్రమంలో దీనికి ఎల్ఈడీ ద్వారా చెక్ పెట్టాలని భావిస్తున్నారు. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా గుర్తింపు పొందిన సిద్దిపేటలో ఏటా మున్సిపల్‌కు విద్యుత్ చార్జీల చెల్లింపు భారంగా మారుతోంది. పట్టణంలోని 6352 వీధి దీపాల ద్వారా ప్రతి నెలా సగటున రూ. 19 లక్షల మేర విద్యుత్ చార్జీలు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం రాష్ట్రంలోని 12 పట్టణాల్లో ఎల్ఈడీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సంకల్పించి.. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, రామగుండం కార్పొరేషన్లతో పాటు సిరిసిల్ల, మహబూబ్‌నగ ర్, మంచిర్యాల, నల్లగొండ, తాండూర్, సిద్దిపే ట మున్సిపాలిటీలు, గజ్వేల్ నగర పంచాయితీ ని గుర్తించింది. సిద్దిపేట పట్టణంలోని భారత్‌నగర్ ప్రాంతంలో పెలైట్ ప్రాజెక్ట్‌గా ఎల్ఈడీ వి ధానం అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈఈ ఎస్ఎల్తో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిర్వహించేం దుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. నేడే అధికారిక ఒప్పందం.. ఎల్ఈడీ విధానం అమలులో భాగంగా గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ సమక్షంలో జరిగే త్రిసభ్య సమావేశానికి సిద్దిపేట, గజ్వేల మున్సిపల్ కమిషనర్లకు ఆహ్వానం అందింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈఈఎస్ఎల్ (ఎన ర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్), మున్సిపల్ కమిషనర్ల నేతృత్వంలో అధికారిక ఒప్పందం కుదరనుంది. సిద్దిపేట పట్టణ సమగ్ర నివేదిక తో మున్సిపల్ కమిషనర్ రమణాచారి హైదరాబాద్‌లో జరిగే సమావేశానికి వెళ్లనున్నారు. ఒ ప్పందం అనంతరం కేంద్ర ప్రభుత్వ రంగ సం స్థ ఈఈఎస్ఎల్ సిద్దిపేటలో ఎదురయ్యే సత్ఫలితాలకు అనుగుణంగా పట్టణమంతా ఎల్ఈడీ వీధి దీపాల వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. సిద్దిపేటలో ఒకే ప్రాంతం.. సుమారు లక్షన్నర జనభా గల సిద్దిపేట పట్టణంలో 6352 వీధి దీపాలను ఏర్పాటు చేశారు. విద్యుత్ బిల్లులు భారీగా వస్తున్న క్రమంలో భారాన్ని తగ్గించుకునేందుకు పట్టణాన్ని 5 ప్రాంతాలుగా మున్సిపల్ అధికారులు విభజించారు. ఈ ప్రాంతాల్లో ఎల్ఈడీ వ్యవస్థ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. ప్రయోగాత్మకంగా భారత్‌నగర్‌లోని 16,17,18,21 వార్డుల పరిధిలో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు రూపకల్పన చేశారు. 204 ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తారని సమాచారం. ప్రస్తుతం ఇదే ప్రాంతంలో 150, 69, 40 ఓల్ట్లతో కూడిన 135 వీధి దీపాలపై ప్రభుత్వం సగటున రూ.1.40 లక్షలను విద్యుత్ బిల్లుల రూపంలో చెల్లిస్తోంది. ఎల్ఈడీ లైట్ల బిగింపు వల్ల 60 శాతం విద్యుత్ ఆదాతో పాటు బిల్లుల భారం తగ్గే అవకాశముంది. -
‘కాంతి’ పథకంలో చీకటి కోణం
సాక్షి, రాజమండ్రి : మల్లెపువ్వుల్లాంటి కాంతులను వెదజల్లే ఆ వీధిదీపాలు అమర్చడం సంస్కరణల్లో భాగం అన్నారు. రాష్ట్రంలోనే ఆ ఘనత రాజమండ్రికి దక్కుతోందన్నారు. కరెంటు బిల్లు కూడా గణనీయంగా తగ్గిపోతుందని.. పొదుపు ప్రవచనాలు పలికారు. తీరా చూస్తే ఆ పథకం వెనుక చిక్కటి చీకటికోణం దాగి ఉందనడానికి సాక్ష్యమిచ్చే పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజమండ్రిలో ఆర్భాటంగా అమర్చిన లైట్ ఎమిటింగ్ డయోడ్ (ఎల్ఈడీ) వీధిదీపాల్లో అనేకం కొడిగట్టాయి. రూ.ఏడు కోట్లు వ్యయమయ్యే ఈ పథకాన్ని కాంట్రాకు తీసుకున్న సంస్థ నిర్వహణను గాలికి వదిలేసింది. పాడైన లైట్లను తొలగించి కొత్తవి అమర్చకుండా నగరవీధులకు వెలుగుకు బదులు కారుచీకటిని కానుకగా ఇస్తోంది. ‘కాంతి’ పేరుతో అమలైన ఈ పథకంలో అవినీతి అంధకారం అలముకుందని, అందుకే అధికారులు కాంట్రాక్టు సంస్థపై కొరడా ఝుళిపించకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నోటీసులతో సరిపుచ్చారు.. లైట్లు కొడిగట్టనారంభించిన నాటి నుంచీ కార్పొరేషన్ అధికారులు హైపీరియన్ సంస్థ నోటీసులు ఇస్తూనే ఉన్నా వెలగని దీపాలకు మినహాయించి మిగిలిన వాటి నిర్వహణ ఖర్చులను ఆ సంస్థ పేరిట ఐడీబీఐ బ్యాంకులో జమ చేస్తూ వచ్చారు. అంతే తప్ప ఖాతాను నిలుపుచేసి సంస్థ ప్రతినిధులను రప్పించి, నిలదీసే ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలో హైపీరియన్ సంస్థ ఐడీబీఐలో ఉంచిన బ్యాంకు గ్యారంటీ మొత్తాన్ని కూడా డ్రా చేసుకుంది. ఈ విషయాన్ని అధికారులే కౌన్సిల్లో ప్రకటించడం వారి ఉదాసీనతకు తార్కాణం. ఇక ఆర్భాటంగా ప్రారంభించిన కొత్త విధానాన్ని విజయవంతం చేయలేని అధికారులు.. బాధ్యత వహించాల్సిన హైపీరియన్‌పై చర్యలు పక్కన బెట్టి పాడైన ఎల్ఈడీ లై ట్లు తొలగించి వాటిస్థానం మామూలు ట్యూబులైట్లు, ఫ్లోరోసెంట్ బల్బులు అమర్చడానికి సన్నద్ధమయ్యారు. మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సలహా మేరకు ఈ నెల 14న హైపీరియన్ సంస్థకు మరమ్మతుల కోసం మళ్లీ లేఖ రాశామని, వారంలో రాకపోతే వాటిని తామే మరమ్మతు చేయించి, ఆ ఖర్చును హైపీరియన్‌కు ఇచ్చే నిర్వహణా వ్యయం నుంచి రికవరీ చేస్తామని కమిషనర్ రవీంద్రబాబు చెబుతున్నారు. అంటే.. నాసిలైట్లు బిగించినా, నిర్వహణను నిర్లక్ష్యం చేసినా ఆ సంస్థకు నిర్వహణా ఖర్చులను చెల్లిస్తూనే ఉన్న వాస్తవం రూఢి అయింది. బిగిస్తున్నప్పుడే నాసివని తేలింది.. నగర పాలక సంస్థ అధికారులు ఎలాంటి థర్డ్ పార్టీ చెకింగ్ లేకుండా హైపీరియన్ సంస్థకు ఎల్ఈడీ లైట్ల బాధ్యతను అప్పగించేయడంతో సగం పైగా నాసిరకం లైట్లు బిగించారు. వాటిని సెంట్రల్ పవర్ రీసెర్చి ఇన్స్టిట్యూట్కు పంపగా కొన్ని నాణ్యతా ప్రమాణాలతో సరి పోలడం లేదని నివేదిక ఇచ్చారని అధికారులే అంగీకరిస్తున్నారు. ఇంత జరిగినా కూడా హైపీరియన్‌పై చర్యలకు ఉపక్రమించకుండా ఉత్తర ప్రత్యుత్తరాలతో కాలక్షేపం చేయడానికి ఒప్పందం వెనుక పెద్ద మొత్తం చేతులు మారడమే కారణమని తెలుస్తోంది. నగరపాలక సంస్థ అప్పటి ఉన్నతాధికారులు హైపీరియన్ నుంచి కమీషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. దానికి తోడు హైపీరియన్‌కు పెద్ద స్థాయిలో పలుకుబడి ఉండడంతో చర్యలకు వెనకాడుతున్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా టీడీపీ కౌన్సిల్ ఉండడం, ఇప్పుడు అదేపార్టీ అధికారంలోకి రావడంతో నేతలు కూడా కిమ్మన్నట్టు వ్యవహరిస్తున్నారు. అంతేకాక కాంట్రాక్టు వ్యవధిలో ఇప్పటికే ఐదేళ్లు గడిచినందున, మరో రెండేళ్లు ఊరుకునేలా ఒత్తిడులు తెస్తున్నట్టు సమాచారం. ఈలోగా ప్రజల నుంచి విమర్శలు రాకుండానే మామూలు లైట్లు అమర్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.