సాక్షి, రాజమండ్రి : మల్లెపువ్వుల్లాంటి కాంతులను వెదజల్లే ఆ వీధిదీపాలు అమర్చడం సంస్కరణల్లో భాగం అన్నారు. రాష్ట్రంలోనే ఆ ఘనత రాజమండ్రికి దక్కుతోందన్నారు. కరెంటు బిల్లు కూడా గణనీయంగా తగ్గిపోతుందని.. పొదుపు ప్రవచనాలు పలికారు. తీరా చూస్తే ఆ పథకం వెనుక చిక్కటి చీకటికోణం దాగి ఉందనడానికి సాక్ష్యమిచ్చే పరిణామాలు చోటు చేసుకున్నాయి.
రాజమండ్రిలో ఆర్భాటంగా అమర్చిన లైట్ ఎమిటింగ్ డయోడ్ (ఎల్‌ఈడీ) వీధిదీపాల్లో అనేకం కొడిగట్టాయి. రూ.ఏడు కోట్లు వ్యయమయ్యే ఈ పథకాన్ని కాంట్రాకు తీసుకున్న సంస్థ నిర్వహణను గాలికి వదిలేసింది. పాడైన లైట్లను తొలగించి కొత్తవి అమర్చకుండా నగరవీధులకు వెలుగుకు బదులు కారుచీకటిని కానుకగా ఇస్తోంది. ‘కాంతి’ పేరుతో అమలైన ఈ పథకంలో అవినీతి అంధకారం అలముకుందని, అందుకే అధికారులు కాంట్రాక్టు సంస్థపై కొరడా ఝుళిపించకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నోటీసులతో సరిపుచ్చారు..
లైట్లు కొడిగట్టనారంభించిన నాటి నుంచీ కార్పొరేషన్ అధికారులు హైపీరియన్ సంస్థ నోటీసులు ఇస్తూనే ఉన్నా వెలగని దీపాలకు మినహాయించి మిగిలిన వాటి నిర్వహణ ఖర్చులను ఆ సంస్థ పేరిట ఐడీబీఐ బ్యాంకులో జమ చేస్తూ వచ్చారు. అంతే తప్ప ఖాతాను నిలుపుచేసి సంస్థ ప్రతినిధులను రప్పించి, నిలదీసే ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలో హైపీరియన్ సంస్థ ఐడీబీఐలో ఉంచిన బ్యాంకు గ్యారంటీ మొత్తాన్ని కూడా డ్రా చేసుకుంది.
ఈ విషయాన్ని అధికారులే కౌన్సిల్‌లో ప్రకటించడం వారి ఉదాసీనతకు తార్కాణం. ఇక ఆర్భాటంగా ప్రారంభించిన కొత్త విధానాన్ని విజయవంతం చేయలేని అధికారులు.. బాధ్యత వహించాల్సిన హైపీరియన్‌పై చర్యలు పక్కన బెట్టి పాడైన ఎల్‌ఈడీ లై ట్లు తొలగించి వాటిస్థానం మామూలు ట్యూబులైట్లు, ఫ్లోరోసెంట్ బల్బులు అమర్చడానికి సన్నద్ధమయ్యారు.
మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సలహా మేరకు ఈ నెల 14న హైపీరియన్ సంస్థకు మరమ్మతుల కోసం మళ్లీ లేఖ రాశామని, వారంలో రాకపోతే వాటిని తామే మరమ్మతు చేయించి, ఆ ఖర్చును హైపీరియన్‌కు ఇచ్చే నిర్వహణా వ్యయం నుంచి రికవరీ చేస్తామని కమిషనర్ రవీంద్రబాబు చెబుతున్నారు. అంటే.. నాసిలైట్లు బిగించినా, నిర్వహణను నిర్లక్ష్యం చేసినా ఆ సంస్థకు నిర్వహణా ఖర్చులను చెల్లిస్తూనే ఉన్న వాస్తవం రూఢి అయింది.
బిగిస్తున్నప్పుడే నాసివని తేలింది..
నగర పాలక సంస్థ అధికారులు ఎలాంటి థర్డ్ పార్టీ చెకింగ్ లేకుండా హైపీరియన్ సంస్థకు ఎల్‌ఈడీ లైట్ల బాధ్యతను అప్పగించేయడంతో సగం పైగా నాసిరకం లైట్లు బిగించారు. వాటిని సెంట్రల్ పవర్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌కు పంపగా కొన్ని నాణ్యతా ప్రమాణాలతో సరి పోలడం లేదని నివేదిక ఇచ్చారని అధికారులే అంగీకరిస్తున్నారు. ఇంత జరిగినా కూడా హైపీరియన్‌పై చర్యలకు ఉపక్రమించకుండా ఉత్తర ప్రత్యుత్తరాలతో కాలక్షేపం చేయడానికి ఒప్పందం వెనుక పెద్ద మొత్తం చేతులు మారడమే కారణమని తెలుస్తోంది.
నగరపాలక సంస్థ అప్పటి ఉన్నతాధికారులు హైపీరియన్ నుంచి కమీషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. దానికి తోడు హైపీరియన్‌కు పెద్ద స్థాయిలో పలుకుబడి ఉండడంతో చర్యలకు వెనకాడుతున్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా టీడీపీ కౌన్సిల్ ఉండడం, ఇప్పుడు అదేపార్టీ అధికారంలోకి రావడంతో నేతలు కూడా కిమ్మన్నట్టు వ్యవహరిస్తున్నారు. అంతేకాక కాంట్రాక్టు వ్యవధిలో ఇప్పటికే ఐదేళ్లు గడిచినందున, మరో రెండేళ్లు ఊరుకునేలా ఒత్తిడులు తెస్తున్నట్టు సమాచారం. ఈలోగా ప్రజల నుంచి విమర్శలు రాకుండానే మామూలు లైట్లు అమర్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
‘కాంతి’ పథకంలో చీకటి కోణం
Published Sat, Jul 26 2014 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 10:52 AM
Advertisement
Advertisement