LED TVs manufacture
-
తక్కువ ధరలో ఎల్ఈడీ టీవీలు:గూగుల్‌తో డిక్సన్ జోడీ
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ఉన్న డిక్సన్ టెక్నాలజీస్ తాజాగా అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా స్థానికంగా ఆండ్రాయిడ్, గూగుల్ టీవీ ప్లాట్‌ఫామ్స్‌పై ఎల్ఈడీ టీవీలను డిక్సన్ తయారు చేయనుంది. స్మార్ట్ టీవీల కోసం ఆన్‌డ్రాయిడ్, గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను గూగుల్ అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. తక్కువ ఖర్చుతో కూడిన స్మార్ట్ టీవీని అందించడంతోపాటు, ఎల్ఈడీ టీవీ విభాగంలో దాని మార్కెట్ లీడర్షిప్ను మరింత బలోపేతం చేసుకోవాడనాఇకి ఇది సహాయ పడుతుందని డిక్సన్ టెక్నాలజీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆండ్రాయిడ్, గూగుల్ టీవీలకై భారత్‌లో సబ్ లైసెన్సింగ్ హక్కులను పొందిన తొలి ఒప్పంద తయారీ కంపెనీ తామేనని డిక్సన్ ప్రకటించింది. ఎల్ఈడీ టీవీల తయారీలో దేశంలో అతిపెద్ద సంస్థ అయిన డిక్సన్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 60 లక్షల యూనిట్లు. ఈ భాగస్వామ్యం కారణంగా ఎల్ఈడీల ఉత్పత్తిలో కంపెనీ సామర్థ్యం మరింత బలపడుతుందని సంస్థ వివరించింది. వాషింగ్ మెషీన్లు, ఎల్ఈడీ బల్బులు, ఎల్ఈడీ బ్యాటెన్స్, మొబైల్ ఫోన్స్, సీసీటీవీల వంటి ఉత్పత్తులను సైతం ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. -
జనాలు ఈ 'టీవీ' బ్రాండ్‌నే ఎక్కువ ఇష్టపడుతున్నారు
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ఇష్టపడే టీవీ బ్రాండ్‌గా 2021 సంవత్సరానికిగాను ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఎల్జీ నిలిచింది. ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ ఈ మేరకు జాబితా విడుదల చేసింది. 2019తోపాటు 2020 సంవత్సరంలో అత్యంత నమ్మకమైన టీవీ బ్రాండ్‌గా కంపెనీ అవార్డు దక్కించుకుంది. వరుసగా మూడు సంవత్సరాలపాటు ఉన్నత గౌరవాన్ని పొందడం భారతీయ మార్కెట్ పట్ల సంస్థకు ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా హోం ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ హక్ హ్యున్ కిమ్ తెలిపారు. -
ఏప్రిల్ 1 విడుదల... ధర దడ
న్యూఢిల్లీ: ఎల్ఈడీ టీవీల ధరలు మరోసారి పెరగనున్నాయి. ఏప్రిల్ నుంచి ఈ వడ్డింపు ఉండనుంది. ఓపెన్–సెల్ ప్యానెళ్లు ఖరీదు కావడమే ఇందుకు కారణం. గత నెల రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ప్యానెళ్ల ధర 35 శాతం వరకు అధికమైందని కంపెనీలు అంటున్నాయి. వచ్చే నెల నుంచి టీవీల ధరలు పెంచాలని ప్యానాసోనిక్, హాయర్, థామ్సన్ భావిస్తున్నాయి. ఇప్పటికే ఎల్జీ ఈ ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తంగా 5–7 శాతం ధర పెరిగే చాన్స్ ఉంది. టీవీ స్క్రీన్ తయారీలో ఓపెన్–సెల్ ప్యానెల్ అత్యంత కీలక విడిభాగం. మొత్తం ధరలో దీని వాటాయే అధికంగా 60% వరకు ఉంటుంది. కంపెనీలు టెలివిజన్ ప్యానెళ్లను ఓపెన్–సెల్ స్థితిలో దిగుమతి చేసుకుంటాయి. చైనా సంస్థలే ఓపెన్–సెల్ తయారీ రంగాన్ని శాసిస్తున్నాయి. ఇక అప్లయెన్సెస్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌లో టీవీలదే అగ్రస్థానం. దేశంలో ప్రస్తుతం ఏటా 1.7 కోట్ల టీవీలు అమ్ముడవుతున్నాయి. వీటి విలువ రూ.25,000 కోట్లు. 2024–25 నాటికి మార్కెట్ 2.84 కోట్ల యూనిట్లకు చేరుతుందని సియామా, ఫ్రాస్ట్ అండ్ సల్లివాన్ అంచనా. మరో మార్గం లేకనే..: ప్యానెళ్లు ప్రియం అవుతూనే ఉన్నందున టీవీల ధర కూడా అధికం అవుతుందని ప్యానాసోనిక్ ఇండియా, సౌత్ ఆసియా ప్రెసిడెంట్ మనీష్ శర్మ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులనుబట్టి టీవీల ధర వచ్చే నెలకల్లా 5–7 శాతం అధికం కానుందని ఆయన వెల్లడించారు. ధరల సవరణ తప్ప తమకు మరో మార్గం లేదని హాయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా తెలిపారు. ఓపెన్–సెల్ ప్రైస్ గణనీయంగా పెరిగిందని, ట్రెండ్ ఇలాగే కొనసాగనుందని అన్నారు. ఓపెన్–సెల్‌కు అనుగుణంగా టీవీల ధరలను సవరించాల్సిందేనని స్పష్టం చేశా రు. తాము టీవీల ధరను పెంచడం లేదని ఎల్జీ వెల్లడించింది. జనవరి, ఫిబ్రవరిలో ధరలను సవరించామని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా హోం అప్లయెన్సెస్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ బాబు తెలిపారు. వాటికి కొరత ఉన్నందునే.. మార్కెట్లో ఓపెన్–సెల్ ప్యానెళ్లకు కొరత ఉందని సూపర్ ప్లాస్ట్రానిక్స్ తెలిపింది. గడిచిన ఎనిమిది నెలల్లో వీటి ధర మూడింతలైందని కంపెనీ సీఈవో అవనీత్ సింగ్ మార్వా తెలిపారు. అంతర్జాతీయంగా ప్యానెళ్ల మార్కెట్ మందగించిందని, అయినప్పటికీ నెల రోజుల్లో ధర 35% అధికమైందని చెప్పారు. ఏప్రిల్ నుంచి ఒక్కో టీవీ ధర కనీసం రూ.2–3 వేలు పెరగనుందన్నారు. ఫ్రాన్స్ కంపెనీ థామ్సన్, యూఎస్ సంస్థ కొడాక్ టీవీల లైసెన్స్‌ను భారత్‌లో సూపర్ ప్లాస్ట్రానిక్స్ కలిగి ఉంది. అత్యధికంగా అమ్ముడయ్యే 32 అంగుళాల టీవీల ధర రూ. 5–6 వేలు పెరగ వచ్చని వీడియోటెక్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అర్జున్ బజాజ్ చెప్పారు. -
టీవీల రేట్లకు రెక్కలు
న్యూఢిల్లీ: ఎల్ఈడీ టీవీలతో పాటు ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్ల వంటి ఉపకరణాల రేట్లకు రెక్కలు రానున్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి 10 శాతం దాకా పెరగనున్నాయి. రాగి, అల్యూమినియం, ఉక్కు వంటి ముడిపదార్థాల ధరలతో పాటు రవాణా చార్జీలు పెరగడమే ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ విక్రేతల నుంచి సరఫరా తగ్గిపోవడం వల్ల టీవీ ప్యానెళ్ల రేట్లు రెట్టింపయ్యాయని, అలాగే ముడి చమురు రేట్లు పెరగడంతో ప్లాస్టిక్ ధర సైతం పెరిగిందని తయారీ సంస్థలు వెల్లడించాయి. ధరల పెంపు అనివార్యమంటూ ఎల్జీ, ప్యానసోనిక్, థామ్సన్ వంటి సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. ‘కమోడిటీల రేట్లు పెరగడం వల్ల సమీప భవిష్యత్‌లో మా ఉత్పత్తుల ధరలపైనా ప్రభావం పడనుంది. జనవరిలో 6–7 శాతంతో మొదలుకుని ఆ తర్వాత 10–11 శాతం దాకా పెరగవచ్చు‘ అని ప్యానసోనిక్ ఇండియా ప్రెసిడెంట్ మనీష్ శర్మ తెలిపారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా కూడా జనవరి 1 నుంచి ఉపకరణాల రేట్లను కనీసం 7–8 శాతం మేర పెంచనుంది. కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (హోమ్ అప్లయెన్సెస్ విభాగం) విజయ్ బాబు చెప్పారు. ఆలోచనలో సోనీ.. మిగతా సంస్థలకు భిన్నంగా సోనీ ఇండియా మాత్రం ఇంకా పరిస్థితిని సమీక్షిస్తున్నామని, రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపింది. ‘రోజురోజుకు మారిపోతున్న సరఫరా వ్యవస్థను నిశితంగా పరిశీలిస్తున్నాం. దీనిపై ఇంకా స్పష్టత రాకపోవడంతో, పెంపు ఎంత మేర ఉండాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు‘ అని సంస్థ ఎండీ సునీల్ నయ్యర్ తెలిపారు. వర్క్ ఫ్రం హోమ్ విధానం నేథ్యంలో ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని, అయితే ఫ్యాక్టరీలు ఇంకా పూర్తి సామర్థ్యంతో పని చేయకపోతుండటంతో సరఫరా పరిమితంగానే ఉంటోందని ఆయన పేర్కొన్నారు. దీని వల్ల రేట్లకు రెక్కలు వస్తున్నాయని వివరించారు. టీవీ ఓపెన్‌సెల్ కొరత తీవ్రంగా ఉందని, దీంతో వాటి ధర 200 శాతం పైగా ఎగిసిందని భారత్‌లో థామ్సన్, కొడక్ ఉత్పత్తులను విక్రయించే సూపర్ ప్లాస్ట్రానిక్స్ సీఈవో అవ్నీత్ సింగ్ మార్వా చెప్పారు. భారత్‌లో ప్రత్యామ్నాయంగా ప్యానెళ్ల తయారీ లేకపోవడంతో అంతా చైనాపై ఆధారపడాల్సి వస్తోందని ఆయన తెలిపారు. జనవరి నుంచి థామ్సన్, కోడక్ తమ ఆండ్రాయిడ్ టీవీల రేట్లను 20% మేర పెంచే అవకాశం ఉందని వివరించారు. డిమాండ్‌కు దెబ్బ.. బ్రాండ్లు రేట్లను పెంచిన పక్షంలో వచ్చే త్రైమాసికంలో మొత్తం డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయన్సెస్ తయారీ సంస్థల సమాఖ్య సీఈఏఎంఏ ప్రెసిడెంట్ కమల్ నంది ఆందోళన వ్యక్తం చేశారు. ‘కమోడిటీల ధరలు 20–25 శాతం పెరగడం, కంటెయినర్ల కొరతతో సముద్ర.. విమాన రవాణా చార్జీలు 5–6 రెట్లు పెరిగిపోవడంతో ఉపకరణాల ముడి వస్తువుల వ్యయాలపై భారీగా ప్రతికూల ప్రభావం పడుతోంది. దీనితో సమీప భవిష్యత్‌లో బ్రాండ్లు తమ ఉత్పత్తుల రేట్లను 8–10 శాతం దాకా పెంచే అవకాశం ఉంది. దీనివల్ల వచ్చే త్రైమాసికంలో మొత్తం డిమాండ్ దెబ్బతినే ముప్పు ఉంది‘ అని పేర్కొన్నారు. అయితే, పేరుకుపోయిన డిమాండ్‌కి తగ్గట్లుగా కొనుగోళ్లు జరిగే అవకాశం ఉందని, ఫలితంగా పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చని పరిశ్రమ ఆశిస్తున్నట్లు ఆయన వివరించారు. సీఈఏఎంఏ, ఫ్రాస్ట్ అండ్ సలివాన్ సంయుక్త నివేదిక ప్రకారం 2018–19లో కన్జూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమ పరిమాణం రూ. 76,400 కోట్లుగా నమోదైంది. -
ఇక సెల్కాన్ ఎల్ఈడీ టీవీలు!
సెల్కాన్ సీఎండీ వై. గురు * సంక్రాంతికల్లా దేశీయ మార్కెట్లోకి తయారీకి రూ.100 కోట్లు వ్యయం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ రంగంలో ఉన్న సెల్కాన్ త్వరలో ఎల్ఈడీ టీవీల తయారీలోకి అడుగుపెడుతోంది. 14 అంగుళాల నుంచి 50 అంగుళాల సైజులో ఉండే టీవీలను రూపొందిస్తారు. దీనికోసం అంతర్జాతీయ బ్రాండ్లకు విడిభాగాలను సరఫరా చేస్తున్న చైనా, తైవాన్‌కు చెందిన రెండు ప్రముఖ కంపెనీలతో సెల్కాన్ చేతులు కలిపింది. హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్‌లో ఉన్న మొబై ల్స్ అసెంబ్లింగ్ ప్లాంటులోనే టీవీలను కూడా తయా రు చేస్తారు. ఈ విషయాన్ని ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సెల్కాన్ సీఎండీ వై. గురు ధ్రువీకరించారు. సంక్రాంతికల్లా దేశీయ మార్కెట్లోకి టీవీలను ప్రవేశపెడతామన్నారు. కంపెనీ భవిష్యత్ ప్రణాళికలను కూడా ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఇంటర్వ్యూ విశేషాలివీ.. టీవీల తయారీలోకి తెలుగు రాష్ట్రాల నుంచి తొలి కంపెనీగా రాబోతున్నారు. ఈ విభాగంలో మీ భవిష్యత్ వ్యూహమేంటి? అందుబాటు ధరలో ఆకర్షణీయ మోడళ్లను అందించడం ద్వారా మొబైల్స్ మార్కెట్లో సెల్కాన్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇదే ఊపుతో ఇప్పుడు ఎల్ఈడీ టీవీల రంగంలోకి ప్రవేశిస్తున్నాం. తద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ రంగంలోకి ప్రవేశించిన తొలి కంపెనీ మాదే అవుతుంది. టీవీ విడిభాగాల తయారీలో పేరున్న లిస్టెడ్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. సంక్రాంతికి సెల్కాన్ టీవీలు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. ముందుగా ఈ-కామర్స్ వేదికగా విక్రయిస్తాం. ఆ తర్వాత రిటైల్ దుకాణాల్లో లభ్యమవుతాయి. టీవీల తయారీ కోసం రూ.100 కోట్లు వెచ్చిస్తున్నాం. మరో రెండు మొబైల్స్ తయారీ ప్లాంట్ల ఏర్పాటు చేస్తున్నారు కదా! ఎక్కడివరకూ వచ్చింది? రేణిగుంట ప్లాంటుకు ఈ నెల 27న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తున్నారు. హైదరాబాద్ ఫ్యాబ్‌సిటీలో మరో ప్లాంటును నెలకొల్పుతున్నాం. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం 11.5 ఎకరాలను కేటాయించింది. ఈ రెండు ప్లాంట్లలో మార్చికల్లా తయారీని ప్రారంభించాలని కృతనిశ్చయంతో ఉన్నాం. మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలతోపాటు ఎల్ఈడీ టీవీలను సైతం వీటిల్లో ఉత్పత్తి చేస్తాం. ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్‌లను భవిష్యత్తులో రూపొందిస్తాం. నిధుల సమీకరణ సంగతో..? ముందుగా ప్లాంట్లలో ఉత్పత్తి పూర్తి స్థాయికి చేరుకోవాలి. ఆ తర్వాత విస్తరణకు పీఈ ఫండ్ల నుంచి నిధులు సేకరించాలనే ఆలోచన ఉంది. అయితే ఎంత మొత్తం సమీకరించేదీ ఇంకా నిర్ణయించలేదు. భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు, భాగస్వామ్యానికి ఈ రంగంలో ఉన్న విదేశీ కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా ప్రోత్సాథ హంతో సెల్కాన్లో విదేశీ కంపెనీలు పెట్టుబడికి ఉత్సాహం కనబరుస్తున్నాయి. జేవీకి సైతం ప్రతిపాదనలు చేస్తున్నాయి. ప్రస్తుతం మాకు బ్యాంకుల నుంచి పూర్తి స్థాయి మద్దతుంది. నిధులకు ఢోకా లేదు. 4జీ మార్కెట్లోకి ఎప్పుడు వస్తున్నారు? ట్యాబ్లెట్ పీసీల విపణిపై పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నాం. ప్రస్తుతం రెండు మోడళ్లున్నాయి. రెండు మూడు నెలల్లో అయిదు మోడళ్లు రానున్నాయి. ఇందులో 4జీ వేరియంట్ కూడా తెస్తున్నాం. ఇంటెల్ చిప్సెట్తో ఒక ట్యాబ్లెట్‌ను కొద్ది రోజుల్లో ఆవిష్కరిస్తాం. ఈ మోడల్‌ను ఆన్లైన్లో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తాం. ఇప్పటి వరకు 3జీ స్మార్ట్ఫోన్లకే పరిమితమయ్యాం. డిసెంబరులో 4జీ స్మార్ట్ఫోన్ల విభాగంలోకి ప్రవేశిస్తాం.