Legislative Chairman
-
నిలదీస్తామనే భయంతోనే మాపై వేటు
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి చైర్మన్‌పై దాడి చేశారనే అబద్ధాన్ని అడ్డంపెట్టుకొని తమ పార్టీ ఎమ్మెల్యేలందరినీ టీఆర్ఎస్ ప్రభుత్వం శాసనసభ నుంచి గెంటేయడం దుర్మార్గమైన చర్య అని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామనే భయంతోనే ముఖ్యమంత్రి కుట్రపూరితంగా ఈ చర్యలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. శాసన సభ్యత్వాలు రద్దయిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్. సంపత్‌లతోపాటు అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డి, టీపీసీసీ వర్కిం గ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ తదితరులు గాంధీ భవన్లో బుధవారం రెండోరోజు కొన సాగిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలనుద్దేశించి ఉత్తమ్ ప్రసంగించారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్ కన్నుకు గాయమైందని ప్రభుత్వం ఆరోపణలు చేయడాన్ని డ్రామాగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటనను ఆసరాగా చేసుకుని విచారణ లేకుండానే కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాన్ని ఎలా రద్దు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇది రాజ్యాంగాన్ని అవమానించడమేనని విమర్శించారు. కేసీఆర్‌కు ఇది చివరి బడ్జెట్ అని, అసెంబ్లీలో ప్రజాసమస్యలపై తాము గట్టిగా నిలదీస్తే జవాబు చెప్పే ధైర్యం లేకనే ఈ సస్పెన్షన్ల పర్వానికి సీఎం తెరలేపారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక, చట్ట వ్యతిరేక విధానాలపై న్యాయ పోరాటం చేస్తామని, రాష్ట్రపతిని కలసి ఫిర్యాదు చేస్తామని ఉత్తమ్ చెప్పారు. రాష్ట్రంలో నిర్బంధకాండ: షబ్బీర్ రాష్ట్రంలో నిర్బంధకాండ కొనసాగుతోందని మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. పోలీసులు తన ఇంటిని కూడా ముట్టడించారని, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేత మంద కృష్ణ మాదిగ, జేఏసీ నేత కోదండరామ్‌లను కూడా అక్రమంగా నిర్బంధించి నియంతృత్వాన్ని చాటుకున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ చాలా అహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిని అంతం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని, తన వద్ద పక్కా సమాచారం ఉందన్నారు. దీక్షా శిబిరానికి ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డి.కె. అరుణ, గీతారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, దొంతి మాదవరెడ్డి, పద్మావతిరెడ్డి, చిన్ నారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్, మాజీ మంత్రులు దానం నాగేందర్, ముకేశ్‌గౌడ్, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు సంఘీభావం ప్రకటించారు. అలాగే ఉస్మానియా యూనివర్శిటీ నుంచి విద్యార్థులు, తెలంగాణవ్యాప్తంగా ఉన్న లంబాడి మహిళలు పెద్ద ఎత్తున దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. మరోవైపు సంఘీభావం తెలిపేందుకు రాకుండా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది కార్యకర్తలు, నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీ మండల, నియోజకవర్గ నేతల్లో చాలా మందిని మంగళవారం అర్ధరాత్రే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. -
ముగిసిన చక్రపాణి పదవీకాలం
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనమండలి చైర్మన్ చక్రపాణి ఎమ్మెల్సీ పదవీకాలం శనివారంతో ముగిసింది. 2011లో గవర్నర్ కోటాలో ఎంపికై రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన వారిలో చక్రపాణి, చిత్తూరు జిల్లాకు చెందిన రెడ్డెప్పరెడ్డి ఉన్నారు. ఈ ఇద్దరి పదవీ కాలం శనివారంతో ముగిసింది. దీంతో వీరి స్థానంలో కొత్తగా ఇద్దరు ఎమ్మెల్సీలు గవర్నర్ కోటాలో నియమితులు కావాల్సి ఉంది. అలాగే మండలి చైర్మన్ స్థానానికి ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. -
మండలి పీఠంపై నేతి
నల్లగొండ/నకిరేకల్, న్యూస్‌లైన్ : శాసనమండలి చైర్మన్ పీఠంపై జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ కూర్చోనున్నారు. ఇప్పటి వరకు ఆయన డిప్యూటీ చైర్మన్‌గా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో మండలి రెండుగా విడిపోయింది. దీంతో తెలంగాణ నుంచి ఆయనకు చైర్మన్ పదవి దక్కింది. సోమవారం ఆయన శాసనమండలిలో చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. విద్యాసాగర్ మొదటిసారిగా 2007 మార్చిలో స్థానిక సంస్థల ద్వారా ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అప్పుడు ఆయన పదవీ కాలం రెండేళ్లే. తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల నుంచే గెలిచారు. అప్పటి నుంచి ఆయన శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన అదే పదవిలో కొనసాగారు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో మండలి కూడా విడిపోయింది. దీంతో తెలంగాణ ప్రాంతం నుంచి డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న విద్యాసాగర్ చైర్మన్‌గా కొనసాగనున్నారు. విద్యాసాగర్ పదవీ కాలం 2015 మార్చి ఒకటితో ముగుస్తుంది. నేతి విద్యాసాగర్ స్వగ్రా మం కేతేపల్లి మండలం చెరుకుపల్లి. ఆయన విద్యార్థి దశలో కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘంలో పనిచేశారు. అనంత రం నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన శాసనమండలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. -
దేశ్‌ముఖ్‌కే పట్టం!
- మండలి చైర్మన్ ఎన్నికల బరిలో దిగని మహాకూటమి - దీంతో ఏకగ్రీవంగా ఎన్నిక కానున్న శివాజీరావ్ - ఎన్నికల నేపథ్యంలో నేడు సమావేశం కానున్న మండలి - చైర్మన్ ఎన్నికపై అధికారికంగా వెలువడనున్న ప్రకటన సాక్షి, ముంబై: విధానమండలి చైర్మన్ పదవి మరోసారి కాంగ్రెస్ అభ్యర్థి శివాజీరావ్ దేశ్‌ముఖ్‌నే వరించనుందా? ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారా? బుధవారం దాఖలైన నామినేషన్ల తీరు చూస్తే దాదాపు అవుననే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మండలి చైర్మన్ పదవి కోసం శివాజీరావ్ మినహా మరెవరూ నామినేషన్ వేయలేదు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు దాదాపుగా ఖరారైందని చెప్పవచ్చు. మండలి చైర్మన్ ఎన్నిక కోసం నేడు ఒకరోజుపాటు విధాన మండలి సమావేశం కానుంది. అనంతరం శివాజీరావ్‌ను చైర్మన్‌గా ప్రకటిస్తూ అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. శివసేన, బీజేపీ, ఆర్పీఐల మహాకూటమి తమ అభ్యర్థిని మండలి చైర్మన్ పదవి కోసం బరిలోకి దింపనుందనే వార్తల నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. చివరకు మహాకూటమి తరఫున ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో శివాజీరావ్ ఎన్నిక దాదాపుగా ఖరారైంది. కాంగ్రెస్, ఎన్సీపీ నేతల సమక్షంలో దేశ్‌ముఖ్ నామినేషన్ వేశారు. ఆయన వెంట ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తోపాటు ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే తదితరులు ఉన్నారు. ఈ పదవికి మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో దాదాపుగా ఆయన ఎన్నికైనట్లు భావించిన కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు శివాజీరావ్ దేశ్‌ముఖ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పట్టునిలుపుకున్న ముఖ్యమంత్రి... విధానమండలి చైర్మన్ ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తనపట్టును నిలుపుకున్నారు. శివాజీరావ్ దేశ్‌ముఖ్‌కే మరోసారి చైర్మన్ పదవిని కట్టబెట్టేందుకు చవాన్ తీవ్రంగా ప్రయత్నించారు. మరోవైపు ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్‌ఠాక్రే, మహారాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ మోహన్ ప్రకాష్లిద్దరు దళిత నేత, ఎమ్మెల్యే శరద్ రణ్పిసేను విధానమండలి చైర్మన్‌గా చేయాలని ప్రయత్నించారు. ఇలా పృథ్వీరాజ్ చవాన్ వర్గం, మాణిక్‌రావ్ ఠాక్రే వర్గంవారు తమదైన పద్దతుల్లో తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఎట్టకేలకు మళ్లీ శివాజీరావ్ దేశ్ముఖ్వైపే అధిష్టానం మొగ్గుచూపింది. దీంతో మాణిక్‌రావ్ వర్గం కొంత వెనక్కు తగ్గింది. దేశ్‌ముఖ్‌ను చైర్మన్ చేసేందుకు బీజేపీ విధానమండలి ప్రతిపక్ష నాయకుడైన వినోద్ తావ్డేతోపాటు శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే పీఏ మిలింద్ నార్వేకర్లతో చవాన్ సమావేశమయ్యారని, మహాకూటమి అభ్యర్థిని బరిలోకి దింపకుండా వారితో మాట్లాడారని సమాచారం. ఎలాంటి విభేదాలు లేవు... మాణిక్‌రావ్ ఠాక్రే విధాన మండలి చైర్మన్ ఎన్నికల విషయంలో ఎలాంటి విభేదాలు లేవని ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్‌ఠాక్రే పేర్కొన్నారు. విధాన మండలి చెర్మైన్ ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి, ఎంపీసీసీ అధ్యక్షుల మధ్య అంతర్గత విభేదాలున్నాయంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. చైర్మన్ పదవికి శివాజీరావ్ పేరును ముందుగా తానే సిఫారసు చేశానని చెప్పారు. చవాన్ కూడా ఆయనకే మద్దతు పలికారని, శరద్ రణ్పిసే పేరును తాను ప్రతిపాదించలేదని, అదంతా మీడియా సృష్టేనన్నారు. దేశ్‌ముఖ్‌కు అభినందనలు... విధాన మండలి చైర్మన్‌గా శివాజీరావ్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం దాదాపు ఖరారైన సందర్భాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్‌తోపాటు ఎన్సీపీ నాయకులు ఆయనను అభినందనలతో ముంచెత్తారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రే, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎన్సీపీ నాయకులు వసంత్ డావ్కరేతోపాటు పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
విధానమండలి ఎన్నికలు : చైర్మన్ ఎవరో
సాక్షి ముంబైః విధానమండలి చైర్మన్ పదవి ఎవరికి దక్కనుందనే విషయంపై ఉత్కంఠత కొనసాగుతోంది. ఓ వైపు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు మరో పది రోజుల సమయం ఉంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రంలోని రాజకీయ పక్షాలన్నీ సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విధానమండలి చైర్మన్ పదవికి గురువారం జరగబోయే ఎన్నికల బరిలో మహాకూటమి కూడా బరిలోకి దిగనున్నట్టు సమాచారం. దీంతో ఈసారి చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారనుందని తెలుస్తోంది. అధికారపక్షం కాంగ్రెస్‌లోనూ విధానమండలి చైర్మన్ పదవి కోసం పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుత విధానమండలి చైర్మన్ శివాజీరావ్ దేశ్‌ముఖ్‌తోపాటు ఎమ్మెల్యే శరద్ రణపిసే ఆసక్తి కనబరుస్తుండడంతో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహాకూటమి కూడా చైర్మన్ పదవి కోసం అభ్యర్థిని బరిలోకి దింపాలనే యోచనలో ఉంది. మండలి బడ్జెట్ సమావేశాలు జూన్ రెండో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అయినా చైర్మన్ ఎన్నికల కోసం ప్రభుత్వం ఈ నెల ఎనిమిదిన ప్రత్యేకంగా విధానమండలి సమావేశ పరుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు మండలిలో తొమ్మిది స్థానాల కోసం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అందరు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. వీరిలో ప్రస్తుత విధానమండలి చైర్మన్ శివాజీరావ్ దేశ్‌ముఖ్ కూడా ఉన్నారు. అదేవిధంగా విధానమండలి ప్రతిపక్ష నాయకులు వినోద్ తావ్డే కూడా తిరిగి ఎంపికయ్యారు. ఇది ఇలా ఉండగా మండలి చైర్మన్ పదవిని మళ్లీ శివాజీరావ్ దేశ్‌ముఖ్‌కు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అందుకే జూన్‌లో బడ్జెట్ సమావేశాలు జరపాల్సి ఉండగా, ఎవరు ఊహించని విధంగా శివాజీరావ్ దేశ్‌ముఖ్‌కు మళ్లీ పట్టం కట్టేందుకే ముఖ్యమంత్రి గురువారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారని పేర్కొంటున్నారు. మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ఠాక్రే, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మోహన్ ప్రకాష్‌కు శివాజీరావ్ దేశ్‌ముఖ్‌కు మళ్లీ పదవి కట్టబెట్టడం ఇష్టం లేదని వినికిడి. దళితవర్గానికి చెందిన ఎమ్మెల్యే శరద్ రణపిసేను విధానమండలి చైర్మన్‌గా చేయాలని వీళ్లు ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు దళితవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు విధానమండలి చైర్మన్ పదవి కట్టబెడితే రాజకీయంగా ఎంతో ప్రయోజనం ఉంటుందని మాణిక్‌రావ్ ఠాక్రే వర్గం వాదిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి వర్గం మాత్రం దేశ్‌ముఖ్‌కు మద్దతు పలుకుతోంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఎవరివైపు మొగ్గుచూపనుందనేది వేచి చూడాల్సిందే. ముఖ్యమంత్రికి వ్యతిరేక వర్గానికి చెందిన అభ్యర్థికి అధిష్టానం మద్దతు పలికితే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రికి తలనొప్పులు మొదలైనట్టేనని భావించవచ్చని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారతాయని, అందుకే ఇంత త్వరగామండలి చైర్మన్ ఎన్నికలు జరుపుతున్నట్టు సమాచారం. మరోవైపు మహాకూటమి అభ్యర్థిని బరిలోకి దింపినట్టయితే, తమ అభ్యర్థి గెలుపు కోసం కాంగ్రెస్ తీవ్రంగా కృషి చేయాల్సి ఉండవచ్చని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు.