దేశ్‌ముఖ్‌కే పట్టం! | Shivajirao Deshmukh files nomination for Maharashtra Council | Sakshi
Sakshi News home page

దేశ్‌ముఖ్‌కే పట్టం!

Published Wed, May 7 2014 10:35 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

దేశ్‌ముఖ్‌కే పట్టం! - Sakshi

దేశ్‌ముఖ్‌కే పట్టం!

- మండలి చైర్మన్ ఎన్నికల బరిలో దిగని మహాకూటమి
- దీంతో ఏకగ్రీవంగా ఎన్నిక కానున్న శివాజీరావ్
- ఎన్నికల నేపథ్యంలో నేడు సమావేశం కానున్న మండలి
- చైర్మన్ ఎన్నికపై అధికారికంగా వెలువడనున్న ప్రకటన
 
సాక్షి, ముంబై: విధానమండలి చైర్మన్ పదవి మరోసారి కాంగ్రెస్ అభ్యర్థి శివాజీరావ్ దేశ్‌ముఖ్‌నే వరించనుందా? ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారా? బుధవారం దాఖలైన నామినేషన్ల తీరు చూస్తే దాదాపు అవుననే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మండలి చైర్మన్ పదవి కోసం శివాజీరావ్ మినహా మరెవరూ నామినేషన్ వేయలేదు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు దాదాపుగా ఖరారైందని చెప్పవచ్చు. మండలి చైర్మన్ ఎన్నిక కోసం నేడు ఒకరోజుపాటు విధాన మండలి సమావేశం కానుంది.

 అనంతరం శివాజీరావ్‌ను చైర్మన్‌గా ప్రకటిస్తూ అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. శివసేన, బీజేపీ, ఆర్పీఐల మహాకూటమి తమ అభ్యర్థిని మండలి చైర్మన్ పదవి కోసం బరిలోకి దింపనుందనే వార్తల నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. చివరకు మహాకూటమి తరఫున ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో శివాజీరావ్ ఎన్నిక దాదాపుగా ఖరారైంది.

కాంగ్రెస్, ఎన్సీపీ నేతల సమక్షంలో దేశ్‌ముఖ్ నామినేషన్ వేశారు. ఆయన వెంట ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తోపాటు ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే తదితరులు ఉన్నారు. ఈ పదవికి మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో దాదాపుగా ఆయన ఎన్నికైనట్లు భావించిన కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు శివాజీరావ్ దేశ్‌ముఖ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

పట్టునిలుపుకున్న ముఖ్యమంత్రి...

విధానమండలి చైర్మన్ ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తనపట్టును నిలుపుకున్నారు. శివాజీరావ్ దేశ్‌ముఖ్‌కే మరోసారి చైర్మన్ పదవిని కట్టబెట్టేందుకు చవాన్ తీవ్రంగా ప్రయత్నించారు. మరోవైపు  ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్‌ఠాక్రే, మహారాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ మోహన్ ప్రకాష్‌లిద్దరు దళిత నేత, ఎమ్మెల్యే శరద్ రణ్‌పిసేను విధానమండలి చైర్మన్‌గా చేయాలని ప్రయత్నించారు.

ఇలా పృథ్వీరాజ్ చవాన్ వర్గం, మాణిక్‌రావ్ ఠాక్రే వర్గంవారు తమదైన పద్దతుల్లో తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఎట్టకేలకు మళ్లీ శివాజీరావ్ దేశ్‌ముఖ్‌వైపే అధిష్టానం మొగ్గుచూపింది. దీంతో మాణిక్‌రావ్ వర్గం కొంత వెనక్కు తగ్గింది. దేశ్‌ముఖ్‌ను చైర్మన్ చేసేందుకు బీజేపీ విధానమండలి ప్రతిపక్ష నాయకుడైన వినోద్ తావ్డేతోపాటు శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే పీఏ మిలింద్ నార్వేకర్‌లతో చవాన్ సమావేశమయ్యారని, మహాకూటమి అభ్యర్థిని బరిలోకి దింపకుండా వారితో మాట్లాడారని సమాచారం.

ఎలాంటి విభేదాలు లేవు... మాణిక్‌రావ్ ఠాక్రే
విధాన మండలి చైర్మన్ ఎన్నికల విషయంలో ఎలాంటి విభేదాలు లేవని ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్‌ఠాక్రే పేర్కొన్నారు. విధాన మండలి చెర్మైన్ ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి, ఎంపీసీసీ అధ్యక్షుల మధ్య అంతర్గత విభేదాలున్నాయంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. చైర్మన్ పదవికి శివాజీరావ్ పేరును ముందుగా తానే సిఫారసు చేశానని చెప్పారు. చవాన్ కూడా ఆయనకే మద్దతు పలికారని, శరద్ రణ్‌పిసే పేరును తాను ప్రతిపాదించలేదని, అదంతా మీడియా సృష్టేనన్నారు.

దేశ్‌ముఖ్‌కు అభినందనలు...
విధాన మండలి చైర్మన్‌గా శివాజీరావ్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం దాదాపు ఖరారైన సందర్భాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్‌తోపాటు ఎన్సీపీ నాయకులు ఆయనను అభినందనలతో ముంచెత్తారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రే, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎన్సీపీ నాయకులు వసంత్ డావ్కరేతోపాటు పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement