బుధవారం గాంధీభవన్‌లో జరిగిన దీక్షలో కాంగ్రెస్ నేతలు వంశీచంద్, షబ్బీర్ అలీ, జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి, సంపత్, రాజగోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డి, గీతారెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి చైర్మన్‌పై దాడి చేశారనే అబద్ధాన్ని అడ్డంపెట్టుకొని తమ పార్టీ ఎమ్మెల్యేలందరినీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం శాసనసభ నుంచి గెంటేయడం దుర్మార్గమైన చర్య అని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామనే భయంతోనే ముఖ్యమంత్రి కుట్రపూరితంగా ఈ చర్యలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. శాసన సభ్యత్వాలు రద్దయిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్. సంపత్‌లతోపాటు అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డి, టీపీసీసీ వర్కిం గ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ తదితరులు గాంధీ భవన్‌లో బుధవారం రెండోరోజు కొన సాగిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలనుద్దేశించి ఉత్తమ్ ప్రసంగించారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్ కన్నుకు గాయమైందని ప్రభుత్వం ఆరోపణలు చేయడాన్ని డ్రామాగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటనను ఆసరాగా చేసుకుని విచారణ లేకుండానే కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాన్ని ఎలా రద్దు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇది రాజ్యాంగాన్ని అవమానించడమేనని విమర్శించారు. కేసీఆర్‌కు ఇది చివరి బడ్జెట్ అని, అసెంబ్లీలో ప్రజాసమస్యలపై తాము గట్టిగా నిలదీస్తే జవాబు చెప్పే ధైర్యం లేకనే ఈ సస్పెన్షన్ల పర్వానికి సీఎం తెరలేపారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక, చట్ట వ్యతిరేక విధానాలపై న్యాయ పోరాటం చేస్తామని, రాష్ట్రపతిని కలసి ఫిర్యాదు చేస్తామని ఉత్తమ్ చెప్పారు.
రాష్ట్రంలో నిర్బంధకాండ: షబ్బీర్
రాష్ట్రంలో నిర్బంధకాండ కొనసాగుతోందని మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. పోలీసులు తన ఇంటిని కూడా ముట్టడించారని, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేత మంద కృష్ణ మాదిగ, జేఏసీ నేత కోదండరామ్‌లను కూడా అక్రమంగా నిర్బంధించి నియంతృత్వాన్ని చాటుకున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ చాలా అహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిని అంతం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని, తన వద్ద పక్కా సమాచారం ఉందన్నారు.
దీక్షా శిబిరానికి ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డి.కె. అరుణ, గీతారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, దొంతి మాదవరెడ్డి, పద్మావతిరెడ్డి, చిన్ నారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్, మాజీ మంత్రులు దానం నాగేందర్, ముకేశ్‌గౌడ్, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు సంఘీభావం ప్రకటించారు. అలాగే ఉస్మానియా యూనివర్శిటీ నుంచి విద్యార్థులు, తెలంగాణవ్యాప్తంగా ఉన్న లంబాడి మహిళలు పెద్ద ఎత్తున దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. మరోవైపు సంఘీభావం తెలిపేందుకు రాకుండా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది కార్యకర్తలు, నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీ మండల, నియోజకవర్గ నేతల్లో చాలా మందిని మంగళవారం అర్ధరాత్రే పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment