మండలి పీఠంపై నేతి
నల్లగొండ/నకిరేకల్, న్యూస్‌లైన్ : శాసనమండలి చైర్మన్ పీఠంపై జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ కూర్చోనున్నారు. ఇప్పటి వరకు ఆయన డిప్యూటీ చైర్మన్‌గా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో మండలి రెండుగా విడిపోయింది. దీంతో తెలంగాణ నుంచి ఆయనకు చైర్మన్ పదవి దక్కింది. సోమవారం ఆయన శాసనమండలిలో చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. విద్యాసాగర్ మొదటిసారిగా 2007 మార్చిలో స్థానిక సంస్థల ద్వారా ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అప్పుడు ఆయన పదవీ కాలం రెండేళ్లే. తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల నుంచే గెలిచారు. అప్పటి నుంచి ఆయన శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన అదే పదవిలో కొనసాగారు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో మండలి కూడా విడిపోయింది. దీంతో తెలంగాణ ప్రాంతం నుంచి డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న విద్యాసాగర్ చైర్మన్‌గా కొనసాగనున్నారు. విద్యాసాగర్ పదవీ కాలం 2015 మార్చి ఒకటితో ముగుస్తుంది. నేతి విద్యాసాగర్ స్వగ్రా మం కేతేపల్లి మండలం చెరుకుపల్లి. ఆయన విద్యార్థి దశలో కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘంలో పనిచేశారు. అనంత రం నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన శాసనమండలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు.