నీటి కోసం నిధులు
తనకు సీట్లు ఇవ్వకపోయినా జిల్లాను అభివృద్ధి చేస్తానని గత నెల 27న గండికోట పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. జులై నాటికి గండికోట, మైలవరం ప్రాజెక్టులకు నీరు తీసుకు వస్తానని చెప్పారు. నేటి (శనివారం) నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన నిధులు కేటాయించి బాబు తన హామీ నిలుపుకునేలా అసెంబ్లీలో గట్టిగా పోరాడతామని జిల్లాకు చెందిన శాసనసభ్యులు చెబుతున్నారు.
కడప సెవెన్ రోడ్స్ : జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు మందగమనంలో ఉన్నాయి. భూసేకరణ సమస్యలు, అటవీ అనుమతుల మంజూరులో జరుగుతున్న తీవ్ర జాప్యం ఇందుకు ప్రధాన కారణాలని అధికారులు పేర్కొంటున్నారు. వైఎస్ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు సాగునీటి ప్రాజెక్టుల పట్ల శ్రద్ధ వహించక పోవడం శాపంగా మారింది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెబుతోంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ జిల్లాలో పర్యటించి వెళ్లింది. దాదాపు పూర్తి కావచ్చిన ప్రాజెక్టుల పనులకు తొలి ప్రాధాన్యత ఇచ్చి త్వరగా పూర్తి చేస్తే రైతులకు సాగునీరు అందించడానికి వీలుంటుందని హైపవర్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆ మేరకు గాలేరు-నగరి మొదటి దశను ప్రియారిటీ లిస్టులో చేర్చారు.
జూన్‌కు టన్నెల్ నిర్మాణం పూర్తి
కర్నూలు జిల్లా అవుకు నుంచి గండికోటకు నీరు తీసుకు వచ్చే ప్రధాన కాలువకు సంబంధించిన 49వ ప్యాకేజీ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. 47వ ప్యాకేజీలో 97 శాతం, 48 ప్యాకేజీలో 92 శాతం పనులు పూర్తయ్యాయి. 31వ ప్యాకేజీలోని టన్నెల్ నిర్మాణం పనులు కూడా 92 శాతం మేర పూర్తయ్యాయి. ఇక మిగిలిన పనులను జూన్ నాటికి పూర్తి చేస్తామని ఇంజనీర్లు చెబుతున్నారు. నిర్ణీత వ్యవధిలో అవుకు-గండికోట మధ్య పనులు జరిగినప్పటికీ గండికోటకు పూర్తి స్థాయిలో నీరందడం ఇప్పట్లో సాధ్యం కాదని నిపుణులంటున్నారు. అవుకు నుంచి 20 వేల క్యూసెక్కుల మేర వరద సమయాయంలో నీరు తీసుకు రావాల్సి ఉంటుంది. అయితే పోతిరెడ్డిపాడు నుంచి అవుకు రిజర్వాయర్‌కు నీటిని తీసుకొచ్చే ప్రధాన కాలువ పనులు చాలాచోట్ల పూర్తి కాలేదని తెలుస్తోంది.
ప్రధానంగా భూ సేకరణ, అటవీ అనుమతులు, ఏజెన్సీల నిర్వాకమే ఇందుకు కారణమని చెబుతున్నారు. అవకాశం ఉన్న మేరకు గండికోటకు నీరు తీసుకు రావాలంటే పనుల వేగవంతానికి ప్రభుత్వం అవసరమైన నిధులను మంజూరు చేయాల్సి ఉంటుంది. ఫ్లడ్‌ఫ్లో కెనాల్‌కు రూ. 50 కోట్లు, ప్యాకేజీ-1, 2లకు రూ. 170 కోట్లు అవసరముందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మొదటి దశ కింద 2600 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉంది. ఇందుకు రూ.50 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదించారు.
గండికోట-సీబీఆర్ పనులకు 1350 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా, ఇందుకు రూ.35 కోట్లు అవసరం కానుంది. నిర్మాణ పనులకు సంబంధించి రూ. 277 కోట్లు అవసరమని ప్రాజెక్టు అధికారులు నివేదికలు పంపారు. జీఎన్ఎస్ఎస్ రెండవ దశ నిర్మాణానికిగాను 2400 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది.
ఇందు కోసం వంద కోట్ల రూపాయలు కావాలని కోరారు. ఇందులోని ఏడు ప్యాకేజీల పనులు చేపట్టేందుకు తక్షణమే రూ.850 కోట్లు అవసరమవుతుందని అంచనాలు పంపారు. రెండవ దశ కింద 1580 హెక్టార్ల అటవీ భూమిని సేకరించాల్సి ఉంది. ఇందుకు రూ.300 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వాన్ని కోరారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఆధునీకరణ కోసం రూ.75 కోట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించారు.
ఎన్టీఆర్ టీజీపీ
ఈ ప్రాజెక్టును చేపట్టి 30 ఏళ్లు పైబడినా ఇంకా పలు సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం వంద ఎకరాల భూసేకరణ పెండింగ్‌లో ఉంది. ఇందుకు రూ.3 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనులు పూర్తి కావడానికి కలిపి మొత్తం 68 కోట్ల రూపాయలకు బడ్జెట్ ప్రతిపాదనలు పంపారు. వెలుగోడు రిజర్వాయర్ నుంచి వచ్చే నీరు 98.26 కిలో మీటర్ వద్ద జిల్లాలో ప్రవేశిస్తుంది. 108వ కిలోమీటరు వద్ద సబ్సిడరీ రిజర్వాయర్-1 ఉంది. వీటి మధ్యలో ఉన్న ప్రధాన కాలువకు లీకేజీలు అధికంగా ఉన్నాయి. ఇందువల్ల రావాల్సినంత నీరు డ్రా చేసుకోలేక పోతున్నామని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా బ్రహ్మంసాగర్ కుడి, ఎడమ ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీ నిర్మాణాల్లో రైతుల నుంచి పలు అవరోధాలు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. తమకు కాలువలపై అదనంగా బ్రిడ్జిలు ఏర్పాటు చేసేంత వరకు పనులు సాగనివ్వబోమని అడ్డుకుంటున్నారని పేర్కొంటున్నారు.
అటవీ అనుమతుల్లో జాప్యం
అటవీ అనుమతులు లభించాలంటే కాంపెన్సేటరీ ఆఫారిస్ట్రేషన్ కింద అంతే భూమిని అటవీ శాఖకు అప్పగించాల్సి ఉంటుంది. ప్రాజెక్టుల కోసం తీసుకునే అటవీ భూమి ఎలాంటిదైనప్పటికీ అందుకు ప్రత్యామ్నాయంగా వారికి అప్పగించే భూమి మాత్రం ఎత్తుపల్లాలు లేని చదునైన భూమి కావాలంటున్నారు. జిల్లాలో అలాంటి ప్రభుత్వ భూములు అందుబాటులో లేవని అధికారులు చెబుతున్నారు.
రూ. 1991 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు
జిల్లాలోని ప్రాజెక్టుల నిర్మాణం కోసం 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 1991 కోట్లతో ప్రభుత్వానికి ప్రాజెక్టు అధికారులు బడ్జెట్ప్రతిపాదనలు సమర్పించారు. గండికోట మొదటి, రెండవ దశలు, తెలుగుగంగ, గండికోట-సీబీఆర్, లిఫ్ట్, పీబీసీ ఆధునీకరణ పనుల కోసం రూ.8530 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇందుకు రూ.501 కోట్లు కావాలని ప్రతిపాదించారు. పెండింగ్‌లోఉన్న నిర్మాణ పనుల కోసం రూ. 1490 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదించారు.
గళమెత్తనున్న ఎమ్మెల్యేలు
జిల్లాలో పేరుకుపోయిన సమస్యలపై అసెంబ్లీలో జిల్లా ఎమ్మెల్యేలు గళమెత్తనున్నారు. ఇటీవలే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి గండికోటకు చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. సర్వరాయసాగర్‌కు నీరందించేందుకు అవసరమైన పనులు చేపట్టాలంటూ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఐదు రోజుల పాటు నిరవధిక దీక్ష కూడా చేపట్టారు. ప్రాజెక్టులకు సంబంధించి ఎన్ని నిధులు అవసరమవుతాయన్న విషయమై స్పష్టమైన ప్రణాళికతో సిద్ధమై వెళ్లారు. బడ్జెట్లో జిల్లాకు భారీగా నిధులు రాబట్టేందుకు అసెంబ్లీలో గట్టిగా పట్టుబడతామని ఇప్పటికే స్పష్టం చేశారు.