నాయిని, నాయక్ ప్రమాణం
చిత్తశుద్ధికిదే నిదర్శనం : ఆర్థికమంత్రి ఈటెల
హైదరాబాద్: హోంమంత్రి నాయిని నరసింహా రెడ్డి, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు రాములు నాయక్‌లు ఆదివారం తెలంగాణ శాసనమండలి సభ్యులుగా ప్రమాణం చేశారు. గవర్నర్ కోటాలో వీరు ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన సంగతి తెలిసిందే. శాసనమండలి చైర్మన్ నేతి విద్యాసాగర్ వీరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఆర్థికమంత్రి ఈటెల రాజేం దర్, విద్యాశాఖామంత్రి జి.జగదీశ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ, తెలంగాణ కోసం రాజీలేని విధంగా పోరాడి, ఉద్యమాల్లో అనేక త్యా గాలకు నాయిని సిద్ధపడ్డారని అన్నారు.
టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుండి ఇప్పటిదాకా ఉన్న నాయిని వంటివారికి మంత్రి పదవిని, ఎమ్మెల్సీ పదవులను ఇవ్వడం ద్వారా ఉద్యమంలో ఉన్నవారికి గౌరవం దక్కుతుందనే చిత్తశుద్ధిని, నిబద్ధతను పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిరూపించారని తెలిపారు. నాయిని మాట్లాడుతూ, తెలంగాణ సాధనకోసం అధికార పార్టీలోని పదవులను వదిలిపెట్టి ఉద్యమించిన కేసీఆర్‌తో 2001 నుండి వెంట నడిచానని చెప్పారు. తన లాంటి వారికి ఊహించలేని స్థాయిని కల్పించిన కేసీఆర్‌కు, తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. త్యాగాలు చేసిన వారికి గుర్తింపు ఉంటుందని మరోసారి రుజువైందన్నారు. ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ గిరిజనుడైన తనకు పదవి ఇవ్వడంతో తెలంగాణలోని అట్టడుగు సామాజికవర్గాలన్నీ సంతోషంగా ఉన్నాయని వెల్లడించారు.