ప్రజల సుఖశాంతులేమా లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండేలా చూడడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకు పోలీసుశాఖ పరంగా అన్ని చర్యలు తీసుకుంటాం. మహిళలపై అత్యాచారాలు అరికట్టడానికి ప్రథమ ప్రాధాన్యమిస్తామని, మతసామరస్యానికి విఘాతం కలిగించే వారు ఎంతటి వారైనా వారిపై కఠినచర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేసేదిలేదని రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి స్పష్టం చేశారు. ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన అనేక అంశాలను ప్రస్తావించారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడే సంఘవిద్రోహ శక్తుల కదకలపై నిరంతరం నిఘా కోసం ఆ విభాగాన్ని మరింతగా పటిష్ట పరుస్తామని ఆయన చెప్పారు. పోలీసుస్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, ఆ విషయంలో పోలీసులు భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో మావోయిస్టుల సమస్యపై ప్రస్తుతం మాట్లాడదలుచుకోలేదని మంత్రి స్పష్టం చేశారు.
ప్రజలకు పోలీసులకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజలందరూ సుఖశాంతులతో బతకాలనేది తమ నాయకుడు కేసీఆర్ లక్ష్యమని దానికి అనుగుణంగానే పోలీసుశాఖలో విప్లవాత్మకమార్పులకు శ్రీకారం చుడుతున్నామని వెల్లడించారు. పోలీసుశాఖలో కిందిస్థాయి సిబ్బందిని విధినిర్వహణలో మరింతగా మమేకం చేయడానికి ఏక పోలీసు విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నామని మంత్రి తెలిపారు. వివిధ రాష్ట్రాలలో పర్యటించి అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా మన రాష్ట్రానికి, పోలీసులకు ఏది మంచిదో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు.
మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలను నిరోధించడానికి ప్రథమ ప్రాధాన్యమిస్తామన్నారు. అత్యాచారాలను అరికట్టేందుకు శాంతిభద్రతల పోలీసులు, ఇతర విభాగాల పోలీసులు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులకు ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఎక్కువ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అరాచక శక్తులపై నిఘా పెంచుతున్నామని ఆయన వివరించారు. సీఐడీలోని సైబర్‌క్రైమ్, వైట్‌కాలర్ విభాగాలను మరింత పటిష్టం చేస్తామన్నారు. సిబ్బందికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుతామని తెలిపారు. పోలీసుల సంక్షేమం పట్ల ప్రత్యేకశ్రద్ధ వహిస్తామని, వారి నుంచి వచ్చే సూచనలు, సలహాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో 1,650 నూతన ఇన్నోవా వాహనాలను, 1,500 ద్విచక్ర వాహనాలను సమకూరుస్తున్నామని తెలిపారు. వీటికి జీపీఎస్, 4జీ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొందరు పోలీసు అధికారుల అవినీతి గురించి ఆయన స్పందిస్తూ తగిన ఆధారాలు లభిస్తే వారిపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసుశాఖను ఆధునీకరిస్తే అవినీతి తగ్గుతుందన్నారు.