పేదల కళ్లలో సంతోషం కోసమే: నాయిని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పేదల కళ్లలో సంతోషం చూడాలని ప్రభుత్వం పాటుపడుతున్నదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. వివిధ జిల్లాల నుంచి సీపీఐ,సీపీఎం,కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో ఆదివారం చేరారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి, సంక్షేమం కోసం దసరా నుంచి కొత్త పథకాలు అమలవుతాయన్నారు. టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమని, రాజకీయాలకు అతీతంగా పునర్నిర్మాణం చేసుకోవడానికి చేతులు కలపాలని నాయిని కోరారు. టీడీపీలో ఉంటూ రేవంత్‌రెడ్డి సీఎం అవుతానంటూ పగటి కలలను కంటున్నాడని విమర్శించారు.
ఎంపీ, పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు మాట్లాడుతూ నవతెలంగాణ నిర్మాణానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు.పార్టీ నేత నోముల నర్సింహయ్య మాట్లాడుతూ చంద్రబాబునాయుడు చేతిలో కీచుపిట్టగా మారిన రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాల న్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రాములు నాయక్, బోడకుంటి వెంకటేశ్వర్లు మాట్లాడారు.