పదునెక్కిన జూడాల పోరు
కర్నూలు హాస్పిటల్ : కర్నూలులో జూనియర్ డాక్టర్లు(జూడాలు) చేపట్టిన పోరు పదునెక్కింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు మూడ్రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పోరు ఉధృతమవుతోంది. ప్రభుత్వం దిగొచ్చేంత వరకు తాము పోరాటాన్ని ఆపేది లేదని వారు ప్రకటించారు. అవసరమైతే అత్యవసర సేవలనూ బహిష్కరించేందుకు వెనుకాడబోమని స్పష్టం చేయడంతో రోగులు వణికిపోతున్నారు.
విధులను బహిష్కరించి..
కర్నూలు పెద్దాస్పత్రిలోని జూనియర్ డాక్టర్లు సోమవారం విధులు బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆస్పత్రిలోని లెక్చర్ గ్యాలరీ నుంచి మొదలైన ర్యాలీ క్యాజువాలిటీ వరకు కొనసాగింది. అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే అత్యవసర సేవలను బహిష్కరిస్తామని జూడాల ప్రతినిధులు నిరంజన్, ప్రశాంత్, పవన్ హెచ్చరించారు.
గ్రామీణ ప్రజారోగ్యం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ వైద్యులపై అనవసరమైన నిందలు మోపడం తగదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జూడాల కొరతను బూచీగా చూపిస్తూ జీవో 107ను జారీ చేయడం నిరంకుశ పాలనకు నిదర్శనంగా అభివర్ణించారు. వాస్తవానికి పల్లెల్లో వైద్యుల కొరత లేదని ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తోందన్నారు. రాష్ట్రంలో 1,168 స్పెషలిస్టు డాక్టర్ల అవసరం ఉండగా, ప్రభుత్వం 668 పోస్టులను మాత్రమే మంజూరు చేసిందన్నారు.
వాటిలో 275 స్పెషలిస్టులను మాత్రమే నియమించిన ప్రభుత్వం, నేటికీ 893 స్పెషలిస్టుల అవసరం ఉన్నా ఖాళీలు భర్తీ చేయకుండా జూడాలపై దుష్ర్పచారం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మూడ్రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని నిందించారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే జరగబోవు పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
పెద్దాస్పత్రిలో అరకొర సేవలు
జూడాల సమ్మె ఫలితంగా కర్నూలు పెద్దాస్పత్రిలోని రోగులకు అరకొరగా సేవలే అందుతున్నాయి. పీజీ, వైద్య విద్యార్థులు, హౌస్ సర్జన్లు, రెసిడెంట్ స్పెషలిస్టులు సమ్మెలో భాగస్వాములు కావడంతో సమస్య జటిలంగా మారుతోంది. నాలుగైదు జిల్లాలకు పెద్దదిక్కుగా ఉన్న కర్నూలు ప్రభుత్వాస్పత్రిలోని రోగులకు ఎక్కువ శాతం పీజీ, వైద్య, హౌస్ సర్జన్ల సేవలే అందుతున్నాయి. మూడ్రోజులుగా వారు సమ్మెబాట పట్టడంతో సోమవారం ఓపీ విభాగాల్లో రోగులకు వైద్యసేవలు నామమాత్రంగా అందాయి. సుదూర ప్రాంతల నుంచి వస్తున్న రోగులపై జూనియర్ వైద్యుల సమ్మె ప్రభావం పడుతోంది.