చవకగా బ్రెయిలీ ప్రింటర్
భారత సంతతికి చెందిన 12 ఏళ్ల విద్యార్థి రూపకల్పన
న్యూయార్క్: అంధులకు ఉపయోగపడేలా తక్కువ ధరలో బ్రెయిలీ ప్రింటర్ ను అమెరికాలో భారత సంతతికి చెంది న 12 ఏళ్ల శుభమ్ బెనర్జీ రూపొందిం చాడు. ఎలక్ట్రానిక్ ఆట వస్తువు ‘లెగో మైండ్‌స్టార్మ్ ఈవీ3’ తో దీనిని రూపొం దించడం గమనార్హం. పిల్లల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు.. చిన్న భాగాలను కలిపి వేర్వేరు ఆట బొమ్మల్ని తయారే చేసేందుకు తోడ్పడే ఎలక్ట్రానిక్ కిట్ ఈ ‘లెగో మైండ్‌స్టార్మ్ ఈవీ3’. దీనికి మరికొన్ని భాగాలను చేర్చి.. ‘బ్రెయిగో’ పేరుతో బ్రెయిలీ ప్రింటర్‌ను బెనర్జీ తయారు చేశాడు.
బ్రెయిలీ భాష లో ఏ నుంచి జెడ్ వరకూ అక్షరాలను, అంకెలను దీనితో కాగితంపై ప్రింట్ చేయవచ్చు. ఒక్కో అక్షరాన్ని ప్రింట్ చేయడానికి ఇది ఏడు సెకన్ల సమయం తీసుకుంటుంది. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని శాంటాక్లారాలో ఏడో తరగతి చదువుతున్న శుభమ్ బెనర్జీ... తాను రూపొందించిన ఈ డిజైన్‌ను, ప్రోగ్రామ్ సాఫ్ట్‌వేర్‌ను అందరికీ ఉచితంగా అందజేస్తానని చెబుతున్నాడు. దీనితో అక్షరాలను ప్రింట్ చేసే విధానాన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టాడు కూడా. సాధారణంగా బ్రెయిలీ ప్రింటర్ ధర రూ. లక్షన్నర వరకూ ఉండగా... ‘బ్రెయిగో’ను రూ. 20 వేలతో తయారు చేసుకోవచ్చు.