అటవీ నిర్మూలనతో మలేరియా వ్యాప్తి!
న్యూయార్క్: అడవులను నాశనం చేయడం ద్వారా మలేరియా వ్యాప్తి అధికమయ్యే అవకాశాలున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ మేరకు 67 తక్కువ అభివృద్ధి చెందిన, మలేరియా ప్రభావిత దేశాలపై అమెరికాలోని లేహై విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించి తెలిపారు. అడవులను నాశనం చేయడంతో సూర్యకాంతి అధికంగా భూమిని చేరడంతోపాటు కొన్ని ప్రాంతాల్లో నీరు ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రవహించకుండాపోయి ఒకే ప్రదేశంలో తటస్థంగా నిల్వ ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఈ పరిస్థితులు మలేరియా వ్యాప్తికి ముఖ్య కారకాలైన ‘అనాఫిలెస్’ జాతికి చెందిన దోమలు పెరగటానికి దోహదపడతాయని చెప్పారు. తద్వారా మలేరియా కేసులు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని లేహై విశ్వవిద్యాలయానికి చెందిన కెల్లీ ఆస్టిన్ వివరించారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా 1990 నుంచి దాదాపు 130 మిలియన్ హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని నాశనం అయినట్లు ఐకరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ నివేదికలో వెల్లడించింది.