నేటినుంచి లేఖర్ల నిరసన
నరసాపురం (రాయపేట), న్యూస్‌లైన్ : ఆస్తి లావాదేవీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను మీసేవ కేంద్రాలకు అనుసంధానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం నుంచి లేఖర్లు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో బుధవారం లేఖర్లు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. లేఖర్ల సంఘం అధ్యక్షుడు కోయ రంగారావు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్లను మీసేవ కేంద్రాలకు అనుసంధానం చేయడం వలన రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది లేఖర్లు రోడ్డున పడే ప్రమాదముందని అన్నారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఈనెల 26 నుంచి 28 వరకు స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి రిజిస్ట్రేషన్లను అడ్డుకుంటామని చెప్పారు.
అప్పటికీ ప్రభుత్వ వైఖరి మారకుంటే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సంఘ కార్యదర్శి నడింపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ బ్రిటీష్ కాలం నుంచి ప్రజల ఆస్తుల పరిరక్షణకు పకడ్బందీగా ఉన్న వ్యవస్థను ప్రభుత్వం చిన్నాభిన్నం చేస్తోందన్నారు. రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ దిశగా మార్పులు చేపట్టడం దారుణమన్నారు. సీనీయర్ లేఖరి పుసులూరి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఇప్పటికే ఈసీ, పబ్లిక్ నఖలు కాఫీలును మీ సేవ కేంద్రాలద్వారా పొందడానికి లబ్ధిదారులు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. సకాలంలో పత్రాలు మంజూరు కావడంలేదని, పత్రాలు అర్ధ రహితంగా ఉంటున్నాయని, రూ.వందతో అయ్యేది రూ.500ల వరకు ఖర్చు అవుతుందని లబ్ధిదారులు వాపోతున్నారని పేర్కొన్నారు.
మూడురోజులపాటు నాన్ జుడీషియల్ స్టాంపు పేపర్ల విక్రయాలు నిలిపివేయాలని, ఆస్తి లావాదేవీలకు సంబంధించి విక్రయ ఒప్పందాలు తయారుచేయుట, కొలతలు వేయుట తదితర కార్యక్రమాలను నిలిపివేయాలని తీర్మానం చేశారు. సంఘ కోశాధికారి కెల్లా సతీష్, లేఖర్లు నాగేంధ్ర త్రినాథ్, జి.రవిరామారావు, శ్రీనివాస్, పులపర్తి వెంకటేశ్వరరావు, తెలగంశెట్టి సత్యనారాయణ, కె.రామచంద్రరావు, దిడ్ల నాగరాజు, సుభాకర్, కొప్పాడి శ్రీనివాస్, స్టాంపు వెండర్లు గోటేటి నాగేశ్వరరావు, వెంకటరమణ పాల్గొన్నారు.