leonel messi
-
మెస్సీ మ్యాజిక్కా.. అదృష్టమా.. ఎంబాపె అల్లాడించాడు
మొత్తానికి మెస్సీ అభిమానుల ఆశ ఫలించింది. అర్జెంటీనా మేటి ఆటగాడు లియోనల్ మెస్సీ చిరకాల వాంఛ నెరవేరింది. మెస్సీ ఫ్యాన్స్‌కు అర్జెంటీనా ‘ఖతర్’నాక్ విజయం అమితానందాన్ని కలిగించింది. ఫిఫా ప్రపంచకప్ 2022 విజేతగా అర్జెంటీనా నిలవడంతో అభిమానుల సంబరాలు ఆకాశన్నంటాయి. అర్జెంటీనా గెలిచినప్పటికీ ఫ్రాన్స్ పోరాటస్ఫూర్తిని కూడా పలువురు అభినందిస్తున్నారు. ఆట మొత్తంగా చూస్తే అర్జెంటీనా కంటే ఫ్రాన్స్ మెరుగ్గా ఆడిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా దీనిపై చర్చించుకుంటున్నారు. ఆట మొదటి అర్ధభాగంలో వెనుకబడినప్పటికీ పుంజుకుని పెనాల్టీ షూటౌట్ వరకు తీసుకెళ్లడం ఫ్రాన్స్ పోరాట పటిమకు నిదర్శమని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అర్జెంటీనా తప్పిదం వల్ల మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ వరకు వెళ్లిందన్న వాదనలు విన్పిస్తున్నాయి. కైలియన్ ఎంబాపె అయితే అదరగొట్టాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఫస్ట్ హాఫ్ అంతా అర్జెంటీనా దే గేమ్. అర్జెంటీనా డిఫెన్స్‌ను ఫ్రాన్స్ ఛేదించలేకపోయింది. ఫస్ట్ హాఫ్‌లో ఫ్రాన్స్ గోల్ చేసే అవకాశం కూడా రాలేదు. కానీ అర్జెంటీనాకు చాలా అవకాశాలు వచ్చాయి. తేలిగ్గా గెలవాల్సిన మ్యాచ్‌ను అర్జెంటీనా పెనాల్టీ షూట్ అవుట్ వరకు తెచ్చుకుంది. అలా గెలవాలని కోరుకోరు కూడా. ఏదేమైనా గెలుపు గెలుపే. కంగ్రాట్స్ టు అర్జెంటీనా’ అంటూ నెటిజన్ ఒకరు వ్యాఖ్యానించారు. ‘మొదట దెబ్బలు తిని తర్వాత కౌంటర్ అటాక్ చేసేవారిపై సానుభూతి చూపడం మానవ సహజం. అయితే మొదటి నుంచే సమర్థవంతంగా ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడులు ద్వారా అర్జెంటీనాయే ఒకట్రెండు శాతం ఎక్కువ పైచేయి సాధించింద’ని మరొకరు అభిప్రాయపడ్డారు. ‘అర్జెంటీనా ఆఖరి 12 నిమిషాలు అజాగ్రత్తగా ఆడింది. ఆట మొదటి 65 నిమిషాల వరకు ఫ్రాన్స్‌కు ఎటువంటి ఛాన్స్ ఇవ్వని మెస్సీ టీమ్ చివరలో మాత్రం కాస్త తడబడింది. ఏమైనా మ్యాచ్ మాత్రం సూపర్’ అంటూ ఇంకొరు పేర్కొన్నారు. ‘ఆట మొదటి అర్ధభాగం మొత్తంలో ఫ్రాన్స్ ప్రత్యర్థి గోల్ మీద ఒక షాట్ కూడా కొట్టలేదు. బాల్ 31% సమయం మాత్రమే ఫ్రాన్స్ అధీనంలో ఉంది. అర్జెంటీనా పూర్తిగా డామినేట్ చేసింది. కీలక సమయంలో పెనాల్టీలు ఫ్రాన్స్‌కు కలిసివచ్చాయి. వ్యక్తిగత గోల్స్ మాత్రం మెస్సీ మ్యాజిక్. ఎంబాపె అల్లాడించాడు. చివరలో అర్జెంటీనా గోల్ కీపర్ జట్టును సేవ్ చేశాడ’ని పలువురు వ్యాఖ్యానించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా మ్యాచ్ మాత్రం తమను ఎంతగానో అలరించిందని క్రీడాభిమానులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఫుట్‌బాట్ ప్రపంచకప్ ఫైనల్ ఊహించిన దానికన్నా తమను ఉత్కంఠకు గురిచేసిందని హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్ చేయండి: మెస్సీ సాధించాడు.. ఘనంగా ‘ముగింపు’!) -
సగం జీతం కట్! మరో ఐదేళ్లకు ఒప్పందం?
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫుట్‌బాలర్‌గా పేరున్న లియోనెల్ మెస్సీ.. రాజీకి సిద్ధపడినట్లు తెలుస్తోంది. స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ బార్సిలోనాతో మెస్సీ కాంట్రాక్ట్ ఇటీవలె ముగిసిందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని భవితవ్యం ఏంటన్న దానిపై చర్చ మొదలైంది. అయితే ఊహాగానాలకు తెరదించుతూ మెస్సీ మరోసారి బార్సిలోనా కాంట్రాక్ట్‌కే మొగ్గుచూపించినట్లు తెలుస్తోంది. మరో ఐదేళ్లపాటు బార్సిలోనా క్లబ్‌తో ఒప్పందం చేసుకోబోతున్న మెస్సీ.. 50 శాతం జీతం కట్టింగ్‌కు సైతం సిద్ధపడినట్లు గోల్.కామ్ బుధవారం ఒక కథనం ప్రచురించింది. రీ-సైన్ నేపథ్యంలో వార్షికాదాయంలో ఈ కట్టింగ్లు పోతాయని, దీనిపై క్లబ్ త్వరలోనే అధికార ప్రకటన చేయనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా బార్సిలోనా క్లబ్ నష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు లాక్డౌన్ ప్రభావంతో ఆటగాళ్లకు పూర్తిస్థాయిలో రెమ్యునరేషన్లు ఇవ్వలేకపోతోంది కూడా. ఈ నేపథ్యంలో క్లబ్‌కు ఊరట ఇచ్చేలా మెస్సీ తన జీతంలో త్యాగానికి సిద్ధపడినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ విషయంలో మెస్సీ మాస్టర్ ప్లాన్ అమలుచేస్తున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే మెస్సీకి బార్సిలోనా కంటే ఎక్కువ జీతం ఆఫర్ చేస్తున్నాయి కొన్ని క్లబ్‌లు. అయితే పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్న మెస్సీ.. వాటి ద్వారా గణనీయమైన ఆదాయం వెనకేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే మెస్సీ వేరే క్లబ్‌లకు వెళ్తే గనుక.. విశ్వసనీయత దెబ్బతిని ఆ ఆదాయానికి గండి పడే అవకాశం ఉందని భావిస్తున్నాడు. అందుకే బార్సిలోనా ఆఫర్‌కు తలొగ్గడం లాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోగలిగాడని విశ్లేషకుల అభిప్రాయం. ఇదిలా ఉంటే ఈ అర్జెంటీనా ఫుట్‌బాల్ మాంత్రికుడు 2004 నుంచి బార్సిలోనాతో కొనసాగుతున్నాడు. Messi in call with his fam after he got his champion’s medal  😍🔟📱🥇#Argentina #LeoMessi #LionelMessi #MessiTHEGOAT #ArgentinavsBrazil #CopaAmerica2021 #CopaAmerica #ARGBRA #ArgentinaBrazil #Messi #MessiCampeon pic.twitter.com/ChZeNPbyZZ — Leo Messi (@xlionelmessix) July 11, 2021 గత ఐదేళ్ల కాంట్రాక్ట్ కోసం 550 మిలియన్ల యూరోస్తో మెస్సీ ఒప్పందం చేసుకుని.. ప్రపంచంలోనే కాస్ట్లీ ప్లేయర్‌గా రికార్డ్ సృష్టించాడు. తాజాగా కాంట్రాక్ట్ ముగిశాక ‘పారిస్ సెయింట్ జెర్మాయిన్, మాంచెస్టర్ సిటీ, ఇంటర్ మిలన్లు మెస్సీకు బంపరాఫర్లు ప్రకటించాయి కూడా. ప్రస్తుత కథనాలు నిజమైతే 2026 వరకు మెస్సీ బార్సిలోనాతోనే కొనసాగుతాడు. -
రికార్డుల బ్రాండ్ బాబు.. సంపాదనెంతో తెలుసా?
సెలబ్రిటీలను ఆరాధించడానికి.. అభిమానించడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉండనక్కర్లేదు. నచ్చితే.. బ్లయిండ్‌గా ఫాలో అయిపోవడమే. ఫుట్‌బాల్ ఆటతోనే కాదు.. తన మేనరిజంతో కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు పోర్చుగల్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో. అత్యధిక గోల్స్ రికార్డుకు అడుగు దూరంలో ఉన్న రొనాల్డో.. సోషల్ మీడియాలోనూ రికార్డుల బ్రేకర్ కూడా. వెబ్‌డెస్క్: సాకర్ వీరుడు రొనాల్డోకు ట్విటర్ ఫాలోవర్ల సంఖ్య 92.4 మిలియన్లు. ఫేస్బుక్లో 148 మిలియన్ల ఫాలోవర్లు. ఇక ఈమధ్యే ఇన్‌స్టాలో 30 కోట్ల మిలియన్ ఫాలోవర్స్ రికార్డు దక్కించుకున్నాడు. కేవలం ఇన్‌స్టా అకౌంట్ ద్వారానే దాదాపు 2 మిలియన్ల పౌండ్ల ఆదాయం వెనకేసుకుంటున్నాడు. అతను వేసే ఒక్కో పోస్టుకి ఆరున్నర కోట్ల రూపాయలు తీసుకుంటాడని తెలుస్తోంది(మోడల్ కైలీ జెన్నర్ పోస్ట్‌కి ఎనిమిది కోట్లకుపైనే). ఫుట్‌బాల్ ఆటగాళ్లలో అత్యధికంగా సంపాదిస్తున్న రెండో ఆటగాడు ఇతనే. మరో విశేషం ఏంటంటే.. లాక్డౌన్ టైంలోనూ అత్యధికంగా సంపాదించిన అథ్లెట్‌గా ఫోర్బ్స్ జాబితాలో నిలిచాడు. కాస్ట్లీ యవ్వారం ఈ జువెంటస్ ఫుట్‌బాల్ క్లబ్ ఆటగాడి.. విలాసాలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. ఎప్పుడూ ఒకే తరహా డైట్‌ను ఫాలో అయ్యే 36 ఏళ్ల రొనాల్డో.. ఫిట్నెస్ విషయంలో అభిమానులకు ఆరాధ్యుడే. దుబాయ్ గ్లోబ్ సాకర్ అవార్డుల కార్యక్రమానికి రొనాల్డో ఒక రోలెక్స్ వాచీతో హాజరయ్యాడు. ఇక అభిమానులు ఊరుకుంటారా? దానిని స్కాన్ చేసి ధరెంతో కనుక్కునే ప్రయత్నం చేశాడు. రీసెంట్గా ఆ వాచీ కంపెనీ ‘స్విస్’.. దాని ధరెంతో ప్రకటించింది. 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో తయారుచేసిన వాచీ అది. అందులో 30 క్యారెట్ల వైట్ డైమండ్లు పొదిగిన ఆ వాచీ ఖరీదు 3,71,000 పౌండ్లు (మన కరెన్సీలో 3 కోట్ల 82 లక్షలపైనే) విలువ ఉందని ప్రకటించింది. పైగా ఇలాంటి పీస్ ఇప్పటివరకు ఈ ఫుట్‌బాల్ స్టార్ దగ్గర మాత్రమే ఉందని వెల్లడించింది. బ్రాండ్ బాబు రొనాల్డ్ బ్రాండ్ అంబాసిడరింగ్ వాల్యూ ఏటా దాదాపు 105 మిలియనల డాలర్లు అంటే ఆశ్చర్యం కలగకమానదు. అందులో నైక్ నుంచే 45 మిలియన్ల డాలర్లు సంపాదిస్తున్నాడు. ఇక సొంతంగా సీఆర్7 బ్రాండ్ ఉంది. ఓవరాల్ ఆటగాళ్ల ఆదాయం జాబితాలో మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్ కనోర్ మెక్‌గ్రెగోర్(180 మిలియన్ల డాలర్లు), లియోనెల్ మెస్సీ(130 మిలియన్ల డాలర్లు).. ఉండగా మూడో ప్లేస్‌లో రొనాల్డో 120 మిలియన్ల డాలర్లతో నిలిచాడు. చిరకాల ప్రత్యర్థి మెస్సీ కంటే టోటల్ ఆదాయంలో వెనుకంజలో ఉన్నప్పటికీ.. బ్రాండ్ ఆదాయంలో ఓ అడుగు ముందే ఉన్నాడు రొనాల్డో. ఫిబ్రవరి 5, 1985 సాంటో అంటోనియోలో పుట్టాడు రొనాల్డో. స్కూల్ ఎడ్యుకేషన్‌లో పెద్దగా చదువుకోని రొనాల్డో.. 17వ ఏట స్పోర్ట్స్ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నాడు. ది సుల్తాన్ ఆఫ్ ది స్టెప్ఓవర్ బిరుదు అందుకున్నాడు. మెర్చ్ రొమిరో, గెమ్మా అటిక్సన్, ఇరినా షాయ్క్లతో డేటింగ్ చేసి.. మోడల్ జార్జినా రోడ్రిగుజ్ను పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు నలుగురు పిల్లలు. చదవండి: రొనాల్డో వల్లే కోకా కోలా 29వేల కోట్లు నష్టపోయిందా?.. అందులో నిజమెంత? -
మెస్సీ ‘రికార్డు’ షో
► సెమీఫైనల్లోకి అర్జెంటీనా ► వెనిజులాపై 4-1తో విజయం ► కోపా అమెరికా కప్ ఫాక్స్‌బరో (అమెరికా): కోపా అమెరికా కప్‌లో సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. టోర్నీలో నాలుగో గోల్ సాధించడంతో పాటు అర్జెంటీనా తరఫున అత్యధిక గోల్స్ (54) చేసిన ఆటగాడిగానూ నిలిచాడు. ఆదివారం వెనిజులాతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌ను మెస్సీ అంతా తానై శాసించడంతో అర్జెంటీనా 4-1తో నెగ్గి సెమీస్‌కు చేరింది. 60వ నిమిషంలో చేసిన గోల్‌తో మెస్సీ ఇప్పటిదాకా గాబ్రియల్ బటిస్టుటా పేరిట ఉన్న అత్యధిక గోల్స్ రికార్డును సమం చేశాడు. అలాగే జట్టు సాధించిన మరో రెండు గోల్స్‌లోనూ తన పాత్ర ఉండడం విశేషం. గోంజలో హిగువాన్ (8వ, 28వ నిమిషాల్లో), లమేలా (71వ నిమిషంలో) మిగతా గోల్స్ చేశారు. వెనిజులా నుంచి రోండన్ (70వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. బుధవారం జరిగే సెమీఫైనల్లో అర్జెంటీనా జట్టు అమెరికాతో తలపడుతుంది. అంతకుముందు ప్రథమార్ధం నుంచే మెస్సీ తన మేజిక్‌ను చూపాడు. దీంతో 8వ నిమిషంలోనే జట్టు ఆధిక్యం సాధించింది. టచ్‌లైన్ నుంచి పెనాల్టీ ఏరియాలోకి మెస్సీ ఇచ్చిన అద్భుత పాస్‌ను అందుకున్న హిగువాన్ ఏమాత్రం అలక్ష్యం చేయకుండా గోల్ చేశాడు. ఆ తర్వాత కూడా వెనిజులా గోల్‌పోస్టుపై అర్జెంటీనా దాడులను కొనసాగించింది. అయితే 27వ నిమిషంలో ప్రత్యర్థి ఆటగాడు గోంజలెజ్ను అడ్డుకున్నందుకు నికోలస్ గైటాన్ ఎల్లో కార్డుకు గురయ్యాడు. దీంతో తను అమెరికాతో సెమీస్‌కు దూరం కానున్నాడు. వర్గాస్ నాలుగు గోల్స్... సాంటా క్లారా (అమెరికా): వరుస విజయాలతో దూసుకెళుతున్న మెక్సికో జట్టుకు డిఫెండింగ్ చాంపియన్ చిలీ బ్రేక్ వేసింది. ఫార్వర్ట్ ఆటగాడు ఎడ్వర్డో వర్గాస్ (44, 52, 57, 74వ నిమిషాల్లో) ఏకంగా నాలుగు గోల్స్‌తో అదరగొట్టడంతో పాటు పేలవమైన ఆటతీరుతో మెక్సికో మూల్యం చెల్లించుకుంది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో చిలీ 7-0తో మెక్సికోను చిత్తుగా ఓడించింది. ఓ మేజర్ టోర్నీలో ఈ జట్టు ఇంత ఘోరంగా ఓడడం ఇదే తొలిసారి. గతంలో 1978 ప్రపంచకప్‌లో మెక్సికో 0-6తో పశ్చిమ జర్మనీ చేతిలో ఓడింది. 70 వేలకు పైగా ఉన్న మెక్సికో మద్దతుదారుల మధ్య చిలీ ఈ మ్యాచ్‌లో అసమాన ప్రతిభను చూపింది. 13 నిమిషాల వ్యవధిలోనే వర్గాస్ హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. ఎడ్సన్ పూచ్ (16వ, 87వ ని.లో) రెండు గోల్స్, అలెక్సిస్ సాంచెజ్ (49వ ని.లో) ఓ గోల్ చేశాడు. -
జొకోవిచ్, సెరెనాలకు లారెస్ స్పోర్ట్స్ అవార్డులు
బెర్లిన్: ప్రపంచ టెన్నిస్ నంబర్ వన్ ఆటగాడు నొవాన్ జొకోవిచ్‌కు ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు దక్కింది. ‘స్టోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’ విభాగంలో తను వరుసగా రెండో ఏడాది ఈ అవార్డు దక్కించుకోగా ఓవరాల్‌గా మూడోది. గతేడాది తను ఆస్ట్రేలియన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్లను సాధించడంతో పాటు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనలిస్ట్‌గా నిలిచాడు. ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఐదోసారి నామినేట్ అయినా అవార్డు దక్కించుకోలేకపోయాడు. ఇక మహిళల విభాగంలో ‘స్పోర్ట్స్‌వుమెన్ ఆఫ్ ద ఇయర్’గా సెరెనా విలియమ్స్ నిలిచింది. 2015లో తను మూడు గ్రాండ్‌స్లామ్స్ నెగ్గింది. తనకు కూడా ఇది మూడో అవార్డు. అయితే ఈ కార్యక్రమానికి సెరెనా హాజరుకాలేదు. వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్‌గా ఆల్ బ్లాక్స్ (కివీస్ రగ్బీ జట్టు) అవార్డు దక్కించుకోగా... జీవిత సాఫల్య పురస్కారాన్ని మూడుసార్లు ఎఫ్1 చాంపియన్‌గా నిలిచిన నికీ లాడా అందుకున్నారు. -
మెస్సీకి గోల్డెన్ బాల్, రోడ్రిగ్జ్‌కు గోల్డెన్ బూటు
అర్జెంటీనా ఫైనల్లో ఓడిపోయినా.. గోల్డెన్ బాల్ మాత్రం ఏస్ క్రీడాకారుడు, ఆ టీమ్ కెప్టెన్ లియోనెల్ మెస్సీకే దక్కింది. 2014 ఫిఫా వరల్డ్ కప్‌కు గాను గోల్డెన్ బూట్ అవార్డును జేమ్స్ రోడ్రిగ్జ్ గెలుచుకున్నాడు. మార్కానా స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జర్మనీ చేతుల్లో ఎక్స్ట్రా టైమ్‌లో అర్జెంటీనా 0-1 తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో మెస్సీ ఒక్క గోల్ కూడా చేయలేకపోయినా.. టోర్నమెంటు మొత్తమ్మీద అతడే మంచి ప్లేయర్ అని ఓటర్లంతా భావించారు. దాంతో గోల్డెన్ బాల్ అతడికే దక్కింది. జట్టు ఆడిన మొత్తం ఏడు మ్యాచ్‌లలోనూ పాల్గొన్న మెస్సీ (27) నాలుగు గోల్స్ కొట్టాడు. ఈ అవార్డుకు పోటీపడినవారిలో అర్జెన్ రాబెన్ (నెదర్లాండ్స్), నెయ్మార్ (బ్రెజిల్), జేమ్స్ రోడ్రిగ్జ్ (కొలంబియా), థామస్ ముల్లర్ (జర్మనీ) ఉన్నారు. ఇక కొలంబియా జట్టుకు ఆరు గోల్స్ అందించిన రోడ్రిగ్జ్ గోల్డెన్ బూట్ గెలుచుకున్నాడు. ఇక ఐదు గోల్స్ చేసిన థామస్ ముల్లర్ వెండి బూటు గెలుచుకున్నాడు. టోర్నమెంటు మొత్తమ్మీద కేవలం నాలుగంటే నాలుగేసార్లు గోల్స్ ఇచ్చిన జర్మన్ గోల్ కీపర్ మాన్యుయెల్ నూయెర్ గోల్డెన్ గ్లోవ్ దక్కించుకున్నాడు. అవార్డుల జాబితా ఇలా ఉంది.. గోల్డెన్ బాల్: లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా), సిల్వర్ బాల్: థామస్ ముల్లర్ (జర్మనీ), బ్రాంజ్ బాల్: అర్జెన్ రాబెన్ (నెదర్లాండ్స్) గోల్డెన్ బూటు: జేమ్స్ రోడ్రిగ్జ్ (కొలంబియా), సిల్వర్ బూటు: థామస్ ముల్లర్ (జర్మనీ), బ్రాంజ్ బూటుష్ట్ర నెయ్మార్ (బ్రెజిల్) గోల్డెన్ గ్లోవ్: మాన్యుయెల్ నూయెర్ (జర్మనీ) యంగ్ ప్లేయర్ అవార్డు: పాల్ పోగ్బా (ఫ్రాన్స్) ఫిఫా ఫెయిర్ ప్లే ట్రోఫీ: కొలంబియా