letter to the Centre
-
కరువు మండలాల్లో అదనపు ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: కరువు మండలాల్లో కూలీల కుటుంబాలకు అదనపు పనులు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కో కుటుంబానికి అదనంగా 50 పనిదినాల పాటు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించనుంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 103 కరువు మండలాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో పూర్తిగా నగర ప్రాంతంలో ఉండే కర్నూలు మినహాయించి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మిగిలిన 102 మండలాల్లో అదనపు పనులు కల్పిస్తారు. ఈ మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు కావాలని కోరే ఒక్కో కుటుంబం ఏడాదికి గరిష్టంగా 150 పనిదినాల పాటు పనులు పొందే వీలుంటుంది. దీంతో 2.42 లక్షల కుటుంబాలకు మేలు చేకూరుతుంది. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ.13,660 వరకు అదనపు లబ్ధి కలుగుతుంది. ఈ మేరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సోమవారం కేంద్రానికి లేఖ రాశారు. కరువు మండలాల్లో అదనపు పని దినాలు.. సాధారణంగా ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతంలో ఒక్కో కుటుంబానికి ఏడాదికి వంద పనిదినాల కల్పనకు అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల్లో మాత్రం ఈ ఏడాది ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 150 పనిదినాల పాటు పనులు కల్పిస్తారు. 102 మండలాల పరిధిలో 5.68 లక్షల కుటుంబాలకు చెందిన దాదాపు 10 లక్షల మంది కూలీలు ఉన్నారు. వీరు ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకుంటుంటారు. 5.68 లక్షల కుటుంబాల్లో దాదాపు లక్ష కుటుంబాలు ఇప్పటికే వంద పనిదినాల గరిష్ట లక్ష్యాన్ని పూర్తి చేసుకుని ఉండడం లేదా గరిష్ట లక్ష్యానికి అతి దగ్గరగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ కుటుంబాలతోపాటు దాదాపు మరో లక్షన్నర కుటుంబాలు వచ్చే ఐదు నెలల్లో అదనపు పనులు కోరేందుకు అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 102 మండలాల పరిధిలో కనీసం 2,42,282 కూలీల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. -
అదనపు ‘ఉపాధి’కోసం కేంద్రానికి మంత్రి జూపల్లి లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. ఈ ఆర్ధిక సంవత్సరానికి గాను మరో ఆరు కోట్ల పనిదినాలు మంజూరు నిమిత్తం కేంద్రాన్ని కోరుతూ లేఖ రాయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ఆదివారం మంత్రి జూపల్లి అధికారులతో సమీక్షించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో 10కోట్ల పనిదినాలు మంజూరు చేయగా, ఇప్పటికే లక్ష్యాన్ని మించి పనులు జరుగుతున్నాయని, సుమారు 1,330కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. మంత్రి జూపల్లి స్పందిస్తూ.. అదనపు పనిదినాల కోసం ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి కూలీలకు పెండింగ్లో ఉన్న వేతనాలను, మెటీరియల్ ఖర్చులను వెంటనే చెల్లించాలని, కూలీలకు వేతనం చెల్లింపులో జరుగుతున్న జాప్యం నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇతర అంశాలనూ సమీక్షించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ డెరైక్టర్ అనితా రాంచంద్రన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.