ఓపెన్ సేల్ పై సోషల్ మీడియాలో ఆగ్రహం
న్యూఢిల్లీ: ఎల్ఈటీవీ 'ఓపెన్ సేల్' స్మార్ట్ ఫోన్ ప్రియులకు నిరాశ కలిగించింది. లె 1ఎస్ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ లో గురువారం ఓపెన్ సేల్ కు పెట్టింది. హైఎండ్ ఫీచర్లతో అందుబాటు ధరలో లభ్యమవుతున్న ఈ ఫోన్ దక్కించుకునేందుకు ప్రయత్నించిన వినియోగదారులకు ఆశాభంగం ఎదురైంది. అమ్మకానికి పెట్టిన కొద్ది నిమిషాల్లోనే ఫోన్లు అన్నీ అమ్ముడయ్యాయన్న మెసేజ్ దర్శనమివ్వడంతో స్మార్ట్ ఫోన్ అభిమానులు అవాక్కయ్యారు.
'సోల్డ్ అవుట్' సందేశంపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఫోన్లు అమ్ముతామో చెప్పకుండా తమను పూల్స్ చేసిందని వాపోయారు. మొదటి ఫ్లాష్ అమ్మకాల్లో 2.2 లక్షల ఫోన్లు విక్రయించడంతో ఓపెన్ సేల్ లో కనీసం 2 లక్షల ఫోన్లు అమ్మకానికి పెడుతుందని భావించారు. స్టాక్ లేనప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం ఎందుకు చేశారని ఓ వినియోగదారుడు ప్రశ్నించాడు. ఎల్ఈటీవీ తమను డిసప్పాయింట్ చేసిందని పేర్కొన్నారు. ఫ్లిప్ కార్ట్ లో లె 1ఎస్ స్మార్ట్ ఫోన్ బుక్ చేశాను కానీ 20 నిమిషాల తర్వాత స్టాక్ అయిపోయినట్టు కనబడింది. ఏం జరుగుతోంది, సేల్స్ సక్రమంగా లేవని మరో అభిమాని వాపోయాడు. స్టాక్ అయిపోయిందంటున్నారు, ఓపెన్ సేల్ కు అర్థముందా అని మరొకరు ప్రశ్నించారు.
అయితే దీనిపై ఎల్ఈటీవీ నుంచి ఎటువంటి స్పందన లేదు. చైనా నుంచి స్టాక్ రావాలంటే కనీసం వారం రోజులు పడుతుంది. కాగా, 16 నిమిషాల్లో 25వేల ఫోన్లు అమ్మినట్టు ప్రచారం జరుగుతోంది. లె 1ఎస్ స్టాక్ అయిపోయినా, లె మ్యాక్స్(ధర. రూ.32,999) మాత్రం లభ్యమవుతోంది.