నది నవ్వుతుంది చూడు!
లేలేత పొద్దుల్లో... దీపం, వల, పెద్దబుట్ట... మొదలైన సరంజామాతో జాలరులు చేపల వేటకు వెళ్లడం వెయ్యిసంవత్సరాల సంప్రదాయం. అయితే ఏది మరచినా తమ ఇంటి పెంపుడు పక్షిని మాత్రం మరువరు చైనా జాలరులు. నీటిపై మెరుపులా మెరిసి ఎగిరే చేపలను పట్టి యజమాని బుట్టలో వేయడంలో ఈ పక్షులు నేర్పరులు. సరే, వాటి నేర్పరితనానికేంగానీ, సూర్యకాంతి సోకని ఉదయవేళల్లో చేపల వేట ఎన్నో అద్భుతదృశ్యాలను ఆవిష్కరిస్తుంది. ఇక ఫొటోగ్రాఫర్లకైతే పండగే!
రష్యా నుంచి పనిగట్టుకొని చైనాలోని లి ఇన్ గులిన్ నది చెంతన వాలాడు ఫొటోగ్రాఫర్ రోగ్తెన్వ. చల్లని గాలుల మధ్య, కాపు కాసినట్లు కనబడుతున్న నల్లటి కొండల మధ్య చేపల వేటకు సంబంధించిన రకరకాల దృశ్యాలను తన కెమెరాలో బంధించాడు. చేపల సంగతి సరే, ఆ దృశ్యాల్లో మార్మికంగా వినిపించే నది నవ్వు.... మరో పెద్ద ఆకర్షణ!