ఈడ్చుకెళ్లి చంపిన సముద్ర జంతువు
బీజింగ్: పార్క్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఓ వ్యాపార వేత్త జీవితం విషాదంగా మారింది. వాల్రస్తో ఫొటో దిగాలనుకున్న అతడి ఆలోచన ప్రాణం తీసింది. ఫొటో దిగేందుకు ప్రయత్నిస్తున్న అతడిని వాల్రస్ అమాంతం నీటిలోకి ఈడ్చుకెళ్లి చంపేసింది. ఆ సమయంలో అతడిని కాపాడేందుకు వెళ్లిన జూకీపర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటన చైనాలోని లియానింగ్ ప్రావిన్స్‌లోగల జిజియాకౌ జంతుప్రదర్శన శాలలో చోటుచేసుకుంది. పార్క్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. జియా లిజున్ అనే వ్యాపార వేత్త జూలోకి వెళ్లాడు. ఒంటరిగానే వెళ్లిన అతడు సామాజిక మాధ్యమాల్లో పెట్టి ముచ్చటపడాలన్న ఉద్దేశంతో జూలో పలుచోట్ల తిరుగుతూ ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉన్నాడు. అదే సమయంలో వాల్రస్ ఒడ్డుకు వచ్చి కనిపించడంతో దాని దగ్గరకు వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో దాదాపు టన్నున్నర బరువున్న వాల్రస్ అతడిని అనూహ్యంగా వెనుక నుంచి ఈడ్చుకుంటూ నీటిలోపలికి తీసుకెళ్లి చంపేసింది.