పరువు... ప్రాణం
అమానుషం
బేటీ బచావో... బేటీ పడావో.. నినాదం కులం పరువుకు బలవుతోంది! ఇది అంటువ్యాధికన్నా బలంగా ప్రబలుతోంది! అందుకే మొన్నటి వరకు హర్యాణా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకే పరిమితమైన పరువు హత్యలు తమ దుష్ర్పభావాన్ని అత్యంత వేగంగా దక్షిణ భారతానికీ వ్యాప్తిచేస్తున్నాయి. ఆ పీడ తెలంగాణకూ పట్టుకుంది. ఓ ఆడబిడ్డను పొట్టన పెట్టుకుంది.
కీడు జరిగింది వారం కిందట...
ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండలో!
చౌహాన్ లక్ష్మణ్‌సింగ్, చంద్రకళకు ఐదుగురు సంతానం. ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. వాళ్లలో అఖిల అందరికన్నా పెద్దది. పదిహేడేళ్లు. ఇంటర్ సెకండియర్‌లో ఉంది. లక్ష్మణ్‌సింగ్ తనకున్న మూడెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ.. ఆసుపత్రులు లేని మారుమూల గ్రామాల్లో ప్రాథమిక వైద్యం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అఖిల తల్లి చంద్రకళ ఇంటి పనులతోపాటు, వ్యవసాయ పనులూ చూసుకుంటోంది.
ఉన్నతస్థానంలో చూడాలనుకొని...
కూతురును బాగా చదివించి, ఉన్నతస్థానంలో చూడాలనుకున్న లక్ష్మణ్‌సింగ్ అఖిలను ఇచ్చోడలోని ఓ ప్రైవేటు కళాశాలలో చేర్పించాడు. నిత్యం వైద్యం చేసేందుకు ఇచ్చోడకు వెళ్లే ఆయన దారిలోనే కూతురు కాలేజీ ఉండడంతో అఖిలను కూడా వెంట తీసుకునివెళ్లి కాలేజీలో వదిలేస్తూండేవాడు. సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు మళ్లీ కూతురుని వెంటబెట్టుకుని వచ్చేవాడు.
ప్రేమే ప్రాణం తీసింది
లక్ష్మణ్ ఇంటి సమీపంలోనే మండల తహశీల్దార్ కార్యాలయం ఉంటుంది. అందులో పనిచేస్తున్న మహేందర్‌తో అఖిలకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఈ క్రమంలో 24 వతేదీ (శుక్రవారం) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మహేందర్ అఖిల ఇంటికి వచ్చాడు. ఆవేళలో యువకుడు తన ఇంటికి రావడం లక్ష్మణ్‌కు కోపాన్ని తెప్పించింది. అంతే! వాళ్లింటి దగ్గర్లో ఉండే కానిస్టేబుల్‌కు ఫోన్‌చేసి సమాచారం ఇచ్చాడు.
కానిస్టేబుల్ వచ్చి మహేందర్‌ను పట్టుకుని ప్రశ్నించాడు. తామిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు మహేందర్, అఖిల కానిస్టేబుల్‌కు చెప్పారు. ఆ విషయం తెలిసిన లక్ష్మణ్ వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమిస్తే తన పరువేం కావాలని కోపోద్రిక్తుడయ్యాడు. కన్నబిడ్డ అని కూడా చూడకుండా చున్నీతో అఖిలకు ఉరివేసి హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు లక్ష్మణ్‌ను విచారిస్తే.. తనకు మరో ఇద్దరు ఆడపిల్లలున్నారని, వేరే కులానికి చెందిన అబ్బాయితో పెద్ద కూతురి ప్రేమవ్యవహారం తక్కిన ఇద్దరమ్మాయిల పెళ్లికి చేటు తెస్తుందనే అభద్రతాభావంతో ఈ దారుణానికి ఒడిగట్టానని ఒప్పుకున్నాడు లక్ష్మణ్‌సింగ్.
‘పరువు’ అనే భావనకు కూతురు ప్రాణాలను బలిచ్చిన లక్ష్మణ్‌సింగ్, అతని భార్య చంద్రకళను 25వతేదీ(శనివారం)న పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపించారు. అమ్మానాన్నలిద్దరూ జైలుకి వెళ్లడంతో ఆ కుటుంబంలోని మిగిలిన నలుగురి పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. వాళ్ల ఆలనాపాలనా బాధ్యత దాదాపు 70 ఏళ్ల వయసున్న వారి నానమ్మ సంపావతిభాయిపై పడింది. వారి బాగోగులు చూడడంలో ఆ వృద్ధురాలు పడుతున్న కష్టం అందరిచేత కంటనీరు పెట్టిస్తోంది.
- పాత బాలప్రసాద్
సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్
దీనికి బాధ్యులెవరు?
స్త్రీల రక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరణలో మాత్రం విఫలమవుతున్నాయి. ప్రాణం కంటే కులమే గొప్పదనే భావనలో ఆ కులం కోసం, ఆ పరువు కోసం కన్నబిడ్డలనే చంపుకునే దుస్థితితో తల్లిదండ్రుల ఆలోచనలు ఉండడం దారుణం. దీనికి బాధ్యులెవరు?ఇలాంటి ఆలోచనలను నాశనం చేసేలా విద్యాబోధన జరగాలి. ఈ బాధ్యత ప్రభుత్వాలకు ఉందని ఎంతో కాలంగా మహిళ సంఘాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు స్పందించక పోవడంతో జరిగే దారుణాలు జరిగి పోతున్నాయి.
- సి.కమలకుమారి, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి