నాగాలాండ్ కొత్త సీఎంగా లీజిత్సు
22న ప్రమాణ స్వీకారం
కోహిమా: నాగాలాండ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్ పీఎఫ్) అధ్యక్షుడు షురోజీలి లీజిత్సు (81) ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సోమవారం జరిగిన డెమొక్రటిక్ అలయెన్స్ ఆఫ్ నాగాలాండ్ (డీఏఎన్) శాసనసభాపక్ష సమావేశంలో లీజిత్సును రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఎంఎల్ఏలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా లీజిత్సును గవర్నర్ పీబీ ఆచార్య ఆహ్వానించారు. పాత ముఖ్యమంత్రి జెలియాంగ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు బాధ్యత వహిస్తూ రెండు రోజుల క్రితం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని జెలియాంగ్ ప్రభుత్వం నిర్ణయిచగా, దానిపై అక్కడి గిరిజన జాతుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. దీనిపై ప్రజలు నిరసన ఉద్యమాలు చేపడుతుండగా జనవరి 31న నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఉద్యమం మరింత తీవ్రమైంది. సీఎం తన పదవి నుంచి తప్పుకోవడంతోపాటు కాల్పులకు బాధ్యులను సస్పెండ్ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. దీంతో జెలియాంగ్ రాజీనామా చేయక తప్పలేదు.
నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం
నాగాలాండ్ తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న లీజిత్సు రాజకీయ ప్రస్థానం సుమారు నాలుగు దశాబ్దాల క్రితం మొదలైంది. 1969లో కోహిమా జిల్లాలోని ఉత్తర అన్గమి–1 నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన లీజిత్సు నాగాలాండ్ తొలి ప్రాంతీయ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో విద్య, ప్రణాళిక వంటి ఎనిమిది మంత్రిత్వ శాఖలను ఆయన విజయవంతంగా నిర్వహించారు. 2013 వరకూ ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన లీజిత్సు అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరించారు.