విదేశాల్లో పనిచేసే భారతీయ కార్మికులకు ‘భద్రత’
దుబాయ్లో ఎంజీపీఎస్వై పథకాన్ని ప్రవేశపెట్టిన వాయలార్ రవి
దుబాయ్: విదేశాల్లో పనిచేసే ప్రవాస భారతీయులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ ప్రవాసి సురక్ష యోజన (ఎంజీపీఎస్వై) పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖ మంత్రి వాయలార్ రవి సోమవారం దుబాయ్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈసీఆర్ (ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్) దేశాల్లో పనిచేసే దాదాపు 50 లక్షల మంది కార్మికులు ఈ పథకం ద్వారా లబ్ధి పొంద నున్నారు.
ఎంజీపీఎస్వైలో చేరే కార్మికులు సంవత్సరానికి రూ.1,000 నుంచి రూ.12,000 చందా కట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం తన వాటాగా రూ.1,000 కడుతుంది. మహిళా కార్మికులు అయితే అదనంగా మరో రూ.1,000 చెల్లిస్తుంది. దీంతోపాటు కార్మికులు విదేశాల్లో పనిచేస్తున్నంతకాలం జీవిత బీమా సౌకర్యం కల్పిస్తుంది. పని పూర్తయ్యాక భారత్కు తిరిగి రాగానే వారికి సొమ్ము అందజేస్తుంది. గల్ఫ్ దేశాల్లో పనిచేసే కార్మికుల సంక్షేమం, భద్రతకు పెద్దపీట వేస్తున్నామని ఈ సందర్భంగా వాయలార్ రవి చెప్పారు.