ఏ వయసు వారికైనా.. ఆరోగ్య బీమా! 65 ఏళ్ల పరిమితి లేదిక..
వైద్య ఖర్చులు గణనీయంగా పెరిగిపోయిన నేటి రోజుల్లో ఆరోగ్య బీమా ఎన్నో కుటుంబాలకు మెరుగైన రక్షణ కలి్పస్తుందనడంలో సందేహం లేదు. కానీ, మన దేశంలో సగం మంది ఇప్పటికీ ఆరోగ్య బీమా రక్షణ పరిధిలో లేరన్నది వాస్తవం. 2047 నాటికి అందరికీ బీమాను చేరువ చేయాలన్న లక్ష్యంలో భాగంగా బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలే నిబంధనల్లో కొన్ని కీలక మార్పులు తీసుకొచ్చింది. హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో పాలసీదారులకు ప్రయోజనం కలిగించే మార్పులకు శ్రీకారం చుట్టింది. హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ‘65 ఏళ్ల’ పరిమితిని తొలగించింది. ముందస్తు వ్యాధుల కవరేజీకి వేచి ఉండాల్సిన కాలాన్ని తగ్గించింది. క్లెయిమ్ తిరస్కరణ నిబంధనలను మరింత అనుకూలంగా మార్చింది. వీటివల్ల పాలసీదారులకు ఒరిగే ప్రయోజనం, ప్రీమియం భారం గురించి తెలుసుకుందాంహెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు సమయంలో తమ ఆరోగ్య సమస్యలు, ఆరోగ్య చరిత్ర గురించి ప్రతి ఒక్కరూ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటికే ఏదైనా అనారోగ్యం బారిన పడ్డారా?, ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అని బీమా సంస్థ పాలసీ దరఖాస్తులో అడుగుతుంది. అప్పటికే ఏవైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే, అవి ముందస్తు వ్యాధుల కిందకు వస్తే (పీఈడీ) నిర్ణీత కాలం పాటు ఆయా వ్యాధుల కవరేజీ కోసం వేచి ఉండాలి.ఈ వెయిటింగ్ పీరియడ్ ముగిసే వరకు వాటికి సంబంధించిన క్లెయిమ్‌లకు బీమా సంస్థ చెల్లింపులు చేయదు. పాలసీదారులు సొంతంగా చెల్లించుకోవాలి. ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది గరిష్టంగా 48 నెలలు (నాలుగేళ్లు) ఉండగా, దీనిని ఐఆర్డీఏఐ తాజాగా 36 నెలలకు (మూడేళ్లు) తగ్గించింది. కాకపోతే ఒక్కో బీమా సంస్థలో ఈ కాలం ఒక్కో మాదిరిగా ఉండొచ్చు. అదనపు ప్రీమియం చెల్లిస్తే ఈ వెయిటింగ్ కాలాన్ని కొన్ని బీమా సంస్థలు తగ్గిస్తున్నాయి కూడా. మరి అదనపు ప్రీమియం భరించలేని వారికి తాజా నిబంధన సంతోషాన్నిచ్చేదే.తాజా పరిణామంతో బీమా సంస్థలు ముందు నుంచి ఉన్న వ్యాధులకు మూడేళ్లకు మించి కొర్రీలు పెట్టడం కుదరదు. ఇది బీమా వ్యాప్తిని పెంచుతుందని పాలసీబజార్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగం బిజినెస్ హెడ్ సిద్థార్థ్ సింఘాల్ అభిప్రాయపడ్డారు. ‘‘ముందస్తు వ్యాధులకు మూడేళ్లకంటే తక్కువ వెయిటింగ్ పీరియడ్‌తో పాలసీలను కొన్ని సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. కానీ, తక్కువ వెయిటింగ్ పీరియడ్ పాలసీని ఎంపిక చేసుకోవడం పాలసీదారుల అవసరం, అవగాహనపైనే ఆధారపడి ఉంటోంది.తక్కువ వెయిటింగ్ పీరియడ్ పాలసీదారులకు అనుకూలం’’అని నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు, క్లెయిమ్‌లు, అండర్‌రైటింగ్ డైరెక్టర్ బసుతోష్ మిశ్రా చెప్పారు. ఒక ఏడాది తగ్గించడం వల్ల ముందస్తు వ్యాధుల పేరుతో బీమా సంస్థల నుంచి క్లెయిమ్ తిరస్కరణలు తగ్గిపోతాయని నిపుణుల విశ్లేషణ.మొదటి రోజు నుంచే..అదనపు ప్రీమియం చెల్లిస్తే మొదటి రోజు నుంచే ముందస్తు వ్యాధులకు కవరేజీ ఇచ్చే పాలసీలు కూడా ఉన్నాయి. ‘‘మధుమేహం, రక్తపోటు, ఉబ్బసం, కొలె్రస్టాల్ తదితర ముందు నుంచి ఉన్న వ్యాధులకు పాలసీదారులు మొదటి రోజు నుంచే కవరేజీ పొందొచ్చు. కాకపోతే ఇందు కోసం 10–15 శాతం అదనపు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది’’అని పాలసీబజార్ హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్ సిద్ధార్థ్ సింఘాల్ తెలిపారు.ముందు నుంచి అంటే ఎంత కాలం..?పాలసీ తీసుకునే తేదీ నాటి నుంచి దానికి ముందు 36 నెలల కాలంలో డాక్టర్ ఏదైనా సమస్యని నిర్ధారించడం.. అందుకు గాను చికిత్స లేదా ఔషధాలు సూచించినా అది పీఈడీ కిందకు వస్తుందిన నిజానికి ఇప్పటి వరకు ఇది 48 నెలలుగా ఉండేది. అంటే పాలసీ తీసుకునే నాటికి ముందు నాలుగేళ్ల కాలంలో ఏదైనా ప్రత్యేక ఆరోగ్య సమస్య ఎదుర్కొంటే దాన్ని పీఈడీగా పరిగణించే వారు. ఇప్పుడు మూడేళ్లకు ఐఆర్డీఏఐ తగ్గించింది. దశాబ్దం క్రితం ఐదారేళ్ల పాటు వెయిటింగ్ పీరియడ్ ఉండేది. బీమా రంగంలో పోటీ పెరగడం, పాలసీ కొనుగోలుదారులు విస్తరించడంతో గణనీయంగా తగ్గుతూ వస్తోంది. భవిష్యత్తులోనూ మరింత తగ్గే అవకాశాలు లేకపోలేదు. ఈ తప్పు చేయొద్దు..పాలసీ కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ పీఈడీల గురించి వెల్లడించాల్సిందే. ఉదాహరణకు ఒక వ్యక్తి చిన్న డోస్‌తో రక్తపోటును నియంత్రించుకోవచ్చు. ఇవి పరీక్షల్లో బయటపడేవి కావని చెప్పి చాలా మంది తమకు ఈ సమస్యలు ఉన్నట్టు పాలసీ దరఖాస్తులో వెల్లడించరు. కానీ, ఇది పెద్ద తప్పు. తాము ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నదీ, వాటికి ఏవేవి మందులు వాడుతున్నది తప్పకుండా వెల్లడించాలి. దీనివల్ల పాలసీ డాక్యుమెంట్లో మీ ఆరోగ్య సమస్యలు నమోదు అవుతాయి. దీనివల్ల ఆ తర్వాతి కాలంలో క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు చెల్లింపుల పరంగా వివాదాలు తగ్గిపోతాయి.కానీ, ఆరోగ్య సమస్యలను బయట పెడితే కంపెనీలు పాలసీ జారీకి నిరాకరిస్తారయన్న భయంతో కొందరు వెల్లడించరు. కానీ, థైరాయిడ్, కొలె్రస్టాల్, అధిక రక్తపోటు, గుండె జబ్బులకు సైతం అండర్‌రైటింగ్ విషయంలో (పాలసీ జారీ) బీమా సంస్థలు సౌకర్యంగానే ఉంటాయి. కనుక నిజాయితీగా వెల్లడించడమే మంచిదని నిపుణుల వ్యాఖ్య.వ్యాధుల వారీగా వెయిటింగ్..కొన్ని ఆనారోగ్యాలకు చికిత్స కవరేజీని బీమా సంస్థలు మొదటి రోజు నుంచే ఆఫర్ చేయవు. వీటి కోసం ‘ప్రత్యేకమైన వెయిటింగ్ పీరియడ్’ను అమలు చేస్తుంటాయి. నిబంధల ప్రకారం ఈ కాలాన్ని గరిష్టంగా 4 సంవత్సరాలకు మించి అమలు చేయకూడదు. ఇప్పుడు ఈ కాలాన్ని మూడేళ్లకు ఐఆర్డీఏఐ తగ్గించింది. నిజానికి కొన్ని బీమా సంస్థలు రెండేళ్లకే ఈ వెయిటింగ్ పీరియడ్‌ను అమలు చేస్తున్నాయి.పాలసీ వర్డింగ్స్ డాక్యుమెంట్లో ఈ వ్యాధుల వివరాలు పూర్తిగా ఉంటాయి. నిరీ్ణత వెయిటింగ్ కాలం ముగిసిన తర్వాతే వీటికి సంబంధించిన క్లెయిమ్‌కు అర్హత లభిస్తుంది. క్యాటరాక్ట్, సైనసైటిస్, అడినాయిడ్స్, టాన్సిలైటిస్ చికిత్సలు, కిడ్నీలో రాళ్ల తొలగింపు, కీళ్ల మార్పిడి చికిత్సలకు సాధారణంగా వెయిటింగ్ పీరియడ్ అమలవుతుంటుంది. ఈ వెయిటింగ్ పీరియడ్ తగ్గింపు కొత్త వారికే కాకుండా పాత పాలసీదారులకూ వర్తిస్తుంది. ఐదేళ్లు పూర్తయితే చాలు!మారటోరియం పీరియడ్‌ను 8 సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలకు తగ్గించడం మరో ముఖ్యమైన నిర్ణయం. పాలసీ తీసుకుని, క్రమం తప్పకుండా ఐదేళ్ల పాటు ప్రీమియం చెల్లిస్తే.. ఆ తర్వాతి కాలంలో ఎలాంటి కారణం చూపుతూ బీమా సంస్థ క్లెయిమ్ తిరస్కరించడం కుదరదు. పాలసీదారు మోసం చేసినట్టు నిరూపిస్తే తప్పించి క్లెయిమ్‌ను ఆమోదించాల్సిందే. ఒకేసారి 8 ఏళ్ల నుంచి 5ఏళ్లకు తగ్గించడం వల్ల పాలసీదారులకు ఎంతో వెసులుబాటు లభించినట్టయింది.దరఖాస్తులో ఆరోగ్య సమాచారం పూర్తిగా వెల్లడించలేదనో, తప్పుడు సమాచారం ఇచ్చారనే పేరుతో బీమా సంస్థలు కొన్ని సందర్భాల్లో క్లెయిమ్‌లకు చెల్లింపులు చేయకుండా నిరాకరిస్తుంటాయి. ఉదాహరణకు మధుమేహం, ఆస్తమా తదితర వ్యాధులు ముందు నుంచి ఉన్నా కానీ వెల్లడించలేదంటూ క్లెయిమ్‌లు తిరస్కరించిన కేసులు ఎన్నో ఉన్నాయి. కానీ, పాలసీదారు మోసపూరితంగా సమాచారం వెల్లడించిన సందర్భాల్లోనే ఐదేళ్లు ముగిసిన తర్వాత కూడా క్లెయిమ్ తిరస్కరించడానికి ఇక మీదట కూడా బీమా సంస్థలకు అధికారం ఉంటుంది.ఈ ఐదేళ్లు అన్నది సదరు వ్యక్తి ఆ పాలసీ మొదటి సంవత్సరం నుంచి వర్తిస్తుంది. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి పోర్టబులిటీ ద్వారా మారినప్పటికీ, అంతకుముందు సంస్థల్లోని కాలం కూడా కలుస్తుంది. అలాగే, ఈ మారటోరియం అన్నది మొదట తీసుకున్న బీమా కవవరేజీకే ఐదేళ్లు వర్తిస్తుంది. ఇది ఎలా అంటే ఉదాహరణకు ఆరంభంలో రూ.5 లక్షలకు తీసుకున్నారని అనుకుందాం. ఐదేళ్ల తర్వాత రూ.10 లక్షలకు పెంచుకున్నారని అనుకుందాం.అప్పుడు ఐదేళ్లు ముగిసిన మొదటి రూ.5 లక్షల కవరేజీకి మారటోరియం తొలగిపోతుంది. పెంచుకున్న కవరేజీ అప్పటి నుంచి ఐదేళ్లు ముగిసిన తర్వాతే మారటోరియం పరిధిలోకి వస్తుంది. ‘‘ఇది పాలసీదారుల అనుకూల నిర్ణయం. ఎనిమిదేళ్లు మారటోరియం అన్నది చాలా సుదీర్ఘమైనది. పాలసీ తీసుకునే ముందే ఏవైనా వ్యాధులు ఉంటే అవి బయట పడేందుకు ఐదేళ్లు సరిపోతుంది. ఏదైనా మోసం ఉంటే దాన్ని నిరూపించాల్సిన బాధ్యత బీమా సంస్థపైనే ఉంటుంది’’అని ఇన్సూరెన్స్ సమాధాన్ సంస్థ సీఈవో శిల్పా అరోరా పేర్కొన్నారు. ప్రీమియం భారం..వృద్ధులకూ ఆరోగ్య బీమా కవరేజీని విస్తతం చేయడమే ఐఆర్డీఏఐ తాజా చర్య వెనుక ఉద్దేశ్యం. దీంతో బీమా సంస్థలు ఇప్పుడు ఏ వయసు వారికైనా బీమా పాలసీలను ఆఫర్ చేయాల్సి ఉంటుంది. మార్కెట్లో పోటీ ఎలానూ ఉంటుంది. కనుక ఇక మీదట వృద్ధుల కోసం బీమా సంస్థలు మరిన్ని నూతన ఉత్పత్తులను తీసుకురానున్నాయి. అదే సమయంలో వీటి ప్రీమియం 10–15 శాతం వరకు పెరగొచ్చని నిపుణులు భావిస్తున్నారు.అంతేకాదు, ఇతర పాలసీదారులపైనా ప్రీమియం భారం పడనుంది. వెయిటింగ్ పీరియడ్ తగ్గించడం వల్ల బీమా సంస్థలకు క్లెయిమ్‌లు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా అన్ని పాలసీల ప్రీమియంను బీమా సంస్థలు సవరించొచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం సామాన్య, మధ్యతరగతి వాసులకు భరించలేని స్థాయికి చేరగా, ఇప్పుడు మరో విడత పెంపుతో ఈ భారం మరింత అధికం కానుంది. 65 ఏళ్ల పరిమితి లేదిక.. 2016 నాటి ఆరోగ్య బీమా మార్గదర్శకాల ప్రకారం బీమా సంస్థలు 65 ఏళ్లలోపు వారికి తప్పనిసరిగా హెల్త్ కవరేజ్ ఆఫర్ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక కారణాలు ఉంటే తప్పించి ఈ వయసులోపు వారికి కవరేజీని తిరస్కరించరాదన్నది నిబంధనల్లోని ఉద్దేశ్యం. 65 ఏళ్లు దాటిన వారికి హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఇవ్వడం, ఇవ్వకపోడం బీమా కంపెనీల అభీష్టంపైనే ఆధారపడి ఉండేది. అంతేకానీ, 65 ఏళ్లు నిండిన వారికి సైతం ఆరోగ్య బీమా కవరేజీ ఇవ్వాలని బీమా సంస్థలపై ఇప్పటి వరకు ఎలాంటి ఒత్తిడి లేదు.తాజా నిబంధనల్లో 65 ఏళ్లను ఐఆర్డీఏఐ ప్రస్తావించలేదు. అంటే వృద్ధుల విషయంలో బీమా కంపెనీలకు మరింత స్వేచ్ఛనిచి్చనట్టు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. వివిధ వయసుల వారి అవసరాలకు తగ్గట్టు ప్రత్యేకమైన ఫీచర్లతో పాలసీలను బీమా సంస్థలు తీసుకురావచ్చంటున్నారు. 65 ఏళ్లకు మించిన వారికి సైతం హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు ఐఆర్డీఏఐ అనుమతించిందన్న వార్తలు వాస్తవం కాదు. నిబంధనల్లో 65 ఏళ్ల పరిమితిని తొలగించింది అంతే.ఈ ఏడాది మార్చి వరకు అమల్లో ఉన్న మార్గదర్శకాల ప్రకారం కూడా 65 ఏళ్లు దాటిన వారికి ఆరోగ్య బీమా ఆఫర్ చేయడంపై ఎలాంటి నిషేధం లేదు. అందుకే 65 ఏళ్లు దాటిన వారికి సైతం కొన్ని బీమా సంస్థలు ప్రత్యేక ఆరోగ్య బీమా పాలసీలను ఇప్పటికే మార్కెట్లో విక్రయిస్తున్నాయి. ‘‘ఇప్పటి వరకు ఉన్న 65 ఏళ్ల పరిమితిని ఆసరాగా తీసుకుని.. అంతకుమించిన వయసు వారికి ఆరోగ్య బీమా కవరేజీ ప్రతిపాదనలను కొన్ని బీమా సంస్థలు నిరాకరించేవి.ఇప్పుడు దీన్ని తొలగించడం వల్ల ఇక మీదట అలా చేయడం కుదరదు. వివిధ వయసుల వారికి అనుగుణమైన బీమా ఉత్పత్తులను రూపొందించి, ప్రీమియం నిర్ణయించాల్సిందే’’అని రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సనూరెన్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ నిఖిల్ ఆప్టే పేర్కొన్నారు. సాధారణంగా వృద్ధులకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇతరులతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వయసులో అనారోగ్యాల ముప్పు ఎక్కువగా ఉండడం ఇందుకు కారణం.