మీ ఆరోగ్యానికి బీమా ఎంత..?
గడిచిన కొన్ని దశాబ్దాలుగా జనం ఆదాయాలు పెరుగుతూ వస్తున్నాయి. అలాగే వారు పెట్టే ఖర్చు కూడా పెరుగుతోంది. అభివృద్ధి చెందుతున్న ఏ దేశానికైనా ఇది గొప్ప విజయమే. అయితే జీవిత వేగం పెరుగుతున్న కొద్దీ ఒత్తిడి పెరుగుతోంది. పని గంటలూ పెరుగుతున్నాయి. దీంతో భారతీయుల్లో జీవన సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయి. వివిధ దేశీయ, అంతర్జాతీయ సంస్థల అంచనాల ప్రకారం... భారతీయులు ప్రతి నలుగురిలో ఒకరు డయాబెటిస్, గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులతో 70 ఏళ్లలోపు మరణిస్తున్నారు.
పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అంచనా ప్రకారం దేశంలో 6.2 కోట్ల మంది డయాబెటిస్తో బాధపడుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు 20 లక్షలు అధికం. వార్షిక ద్రవ్యోల్బణం 7 నుంచి 8 శాతం ఉంటోందనుకున్నా... ైవె ద్య ద్రవ్యోల్బణం మాత్రం 18 నుంచి 20 శాతం ఉంటోంది. కానీ వైద్య ఖర్చుల్లో బీమా ద్వారా చెల్లిస్తున్నవి కేవలం 5 శాతం. ఈ పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో ఇపుడు ఆసుపత్రిలో చేరటమంటే దాదాపు దివాలా తీసినట్టే. అందుకని చక్కని వైద్య బీమాను తీసుకోవటం అత్యుత్తమం. అయితే ఇది ఎలాంటి వైద్యపరమైన సంక్షోభంలోనైనా మనల్ని ఆదుకునేలా ఉండాలి.
ఆరోగ్య రిస్క్‌ను మేనేజ్ చేయటమెలా?
ఆరోగ్య సమస్యలను, జీవన విధానాన్ని విశ్లేషించటం ద్వారా ఎవరైనా రాబోయే వ్యాధుల గురించి కూడా తెలుసుకునే అవకాశముంటుంది. మీరు తీసుకునే పాలసీ.. భవిష్యత్తులో రావటానికి అవకాశమున్న వ్యాధులకూ కవరేజీ ఇచ్చేటట్లుండాలి. వివిధ బీమా కంపెనీలు మీకు, మీ కుటుంబానికి వివిధ రకాలైన ప్రత్యేక పాలసీలు, మీ అవసరాలకు తగ్గ పాలసీలు అందిస్తున్నాయి. అయితే పాలసీకి దరఖాస్తు చేసే ముందు వైద్య ద్రవ్యోల్బణాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకు మీరు 30 ఏళ్ల వయసులో మీ కోసం పాలసీ తీసుకుంటున్నారనుకుందాం. సాధారణంగా మీరు 20 ఏళ్లకో, ఆ తరవాతో క్లెయిమ్ చేసే అవకాశముంటుంది. అందుకని అప్పుడు ఆసుపత్రి ఖర్చులు ఎలా ఉంటాయనేది ముందే అంచనా వేసుకోండి. కనీసం 7 శాతం ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయటం మంచిది. పాలసీ తీసుకునే ముందు... దాన్లో ఏవేవి కవర్ అవుతాయి? మీరు కూడా ఏమైనా చెల్లించాల్సి ఉంటుందా? దేనికి వర్తించదు? వంటివన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ఇవన్నీ చూశాక పాలసీ తీసుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన అంశాలేమిటంటే...
మీరు పనిచేస్తున్న కంపెనీ ఆరోగ్య బీమా ఇస్తోంది కదా అని ఆ ఒక్కదానిపైనే ఆధారపడొద్దు. మీరు ఉద్యోగంలో ఉన్నంత వరకే అది ఉంటుంది. కాబట్టి మీరు సొంతగా పాలసీ తీసుకోవటం అత్యవసరం. పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా అయినా ఇది తప్పనిసరి.టాప్ అప్ ప్లాన్‌ను ఎంచుకోండి. మీకు ఎక్కువ కవరేజీ అవసరమని భావించి... దానికోసం ఎక్కువ డబ్బు పెట్టాలని లేకపోతే టాప్ అప్ తీసుకోవటం మంచిది. అనుకోనిది జరిగి మీకు అప్పటిదాకా ఉన్న కవరేజీ అయిపోయిన పక్షంలో టాప్ అప్ అనేది మీకు అదనపు కవరేజీగా పనికొస్తుంది. ఉదాహరణకు మీరు రూ.3 లక్షల పాలసీ తీసుకున్నారు. దానికి డిడక్టబుల్ పరిమితి రూ.2 లక్షలే ఉంది. మీ ఆసుపత్రి ఖర్చులు రూ.4 లక్షలయ్యాయనుకోండి. అప్పుడు రూ.5 లక్షల టాప్ అప్ తీసుకోండి. రెగ్యులర్‌గా రూ.5 లక్షల పాలసీకి అయ్యేదానికంటే దీనికి చాలా తక్కువ ప్రీమియం ఉంటుంది.
మంచి ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర బీమా తీసుకోండి. పాలసీ ప్రక్రియ, చక్కని క్లెయిమ్ సెటిల్మెంట్ రికార్డు ఉన్న కంపెనీనే నమ్మండి. క్లెయిమ్ గురించి బీమా కంపెనీకి త్వరగా తెలియజేస్తే అంత మంచిది.మీకు అప్పటికే ఏవైనా వ్యాధులుంటే... వాటికి వెయిటింగ్ పీరియడ్ సదరు బీమా కంపెనీ దగ్గర ఎంత ఉందో తెలుసుకోండి. ఎందుకంటే ముందే ఉన్న వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్ తరవాతే కవరేజీ వర్తిస్తుంది. సాధారణంగా అది 2 నుంచి 4 సంవత్సరాలుంటుంది. సబ్ లిమిట్స్ గురించి ముందే తెలుసుకోవాలి. అంటే మీ పాలసీకి గనక ఒక సబ్ లిమిట్ ఉంటే బీమా కంపెనీ అంతవరకే చెల్లిస్తుందన్న మాట. క్లెయిమ్‌లో మిగిలిన మొత్తాన్ని మీరే భరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఆసుపత్రి గది అద్దె సబ్ లిమిట్ 1 శాతం ఉందనుకోండి. మీ పాలసీ కవరేజీ మొత్తం రూ.5 లక్షలుంటే... గది అద్దెగా రోజుకు రూ.5,000 మాత్రమే చెల్లిస్తారు. అంతకన్నా ఎక్కువయితే మాత్రం మీరే చెల్లించాల్సి ఉంటుంది. ఆరోగ్య బీమా ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుంది. అయితే ఎంత బీమా ఉన్నా ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం రోజూ వ్యాయామం చెయ్యటం వంటివి తప్పనిసరి. వారానికి కనీసం 5 రోజులపాటు రోజుకు 30 నిమిషాల చొప్పున నడిచినా దీర్ఘకాలంలో ఎంతో లాభం.
సీఈఓ, ఎస్బీఐ
జనరల్ ఇన్సూరెన్స్