యువతకు కమలదళం గాలం
ఎన్నికల సమయంలో పైజామా, కుర్తా ధరించనున్న ఆ పార్టీ నేతలు
న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల సమయం ఆసన్నమవుతుండడంతో యువ ఓటర్లను తమవైపు తిప్పుకోవడంపై బీజేపీ దృష్టి సారించింది. ఇందులోభాగంగా ఎన్నికల ప్రచార సమయంలో పైజామా, కుర్తాలతో ఆ పార్టీ నాయకులు కనిపించనున్నారు. ఏ ఎన్నికలలోనైనా అత్యధిక ప్రభావం చూపేది యువతరమేనని, అందువల్ల వారిని ఆకట్టుకునేరీతిలో దుస్తులు ధరించాలని బీజేపీ అధిష్టానం... నాయకులు, కార్యకర్తలకు ఇప్పటికే సూచించింది. ఈ విషయమై పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ ‘యువకుల మాదిరిగా కనిపించడం కోసం ఎన్నికల ప్రచార సమయంలో మేమంతా పైజామా, కుర్తాలను ధరిస్తాం.
ఆవిధంగా వారి మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తాం’అని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వార్డ్రోబ్ను గమనించి ఆ తరహా దుస్తులను ధరించాలని అధిష్టానం తమకు సూచించిందన్నారు. ‘ఈ దుస్తులను ధరించి మేమంతా ఢిల్లీ పరిధిలోని వివిధ కళాశాలలు, కేఫ్‌లు, మాల్స్‌కు కచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది. ఆవిధంగా యువతరాన్ని మేము ఆకట్టుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు పార్టీలో చేరాలంటూ యువతరాన్ని కోరతాం’ అని అన్నారు. ఇదిలాఉండగా ఈ నెల 15వ తేదీవరకూ సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది.
కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, ఎల్జేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు.
ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికారిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.