పింఛన్లను సత్వరమే పంపిణీ చేయండి
అధికారులకు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ఆదేశం
న్యూఢిల్లీ: లబ్ధిదారులకు సత్వరమే పింఛన్లు అందేవిధంగా చూడాలని సామాజిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ఆదేశించారు. అధికారిక నివాసం రాజ్‌నివాస్‌లో మంగళవారం వివిధ శాఖల అధికారులతో సమావేశమైన జంగ్ వారితో సమీక్షలు నిర్వహించారు. సమాజంలో అనేక ఇబ్బందులకు గురయ్యేది వారేనని, అందువల్ల పింఛన్లు త్వరగా అందేవిధంగా చూడాలన్నారు.
అంతకుముందు సామాజిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ పింఛన్ లబ్ధిదారుల సంఖ్య పెరిగిందన్నారు. ఇప్పటికే 3.90 లక్షలమంది ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 40 వేలమంది ఈ జాబితాలోకి చేరారన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి వచ్చే నెల నుంచి పింఛన్లను అందజేస్తామన్నారు. ఇందుకు లెఫ్టినెంట్ గవర్నర్ స్పందిస్తూ పింఛన్లకు సంబంధించిన ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సిందిగా సూచించారు.
చాందినీచౌక్ పునరాభివృద్ధి పనులపై సమీక్ష
చాందినీచౌక్ పునరాభివృద్ధి పనులపైనా సంబంధిత అధికారులతో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సమీక్ష నిర్వహించారు. ప్రజాపనుల శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్న సంగతి విదితమే. ఆ తర్వాత ప్రజాపనుల శాఖ, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) తాము చుపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ప్రత్యేక ప్రజెంటేషన్లు ఇచ్చాయి. చాందినీచౌక్‌లో ట్రామ్‌ల నిర్వహణ సాధ్యాసాధ్యాలకు సంబంధించి కూడా డీఎంఆర్‌సీ... తన నివేదికను ఈ సందర్భంగా ఎల్జీకి అందజేసింది. దీంతోపాటు ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలపైనా నివేదించింది. కాగా చాందినీచౌక్ ప్రాంతంలో 4.5 కిలోమీటర్ల పొడవున ట్రామ్ మార్గాన్ని నిర్మించాలని డీఎంఆర్‌సీ యోచిస్తోంది. ఈ అంశంపైనా ఎల్జీ... సంబంధిత అధికారులతో సమీక్షించారు.