మ్యాగీ నూడుల్స్‌పై నిషేధం తొలగింపు
ముంబయి : సంచలనం రేపిన మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తుల నిషేధం కేసులో నెస్లే సంస్థకు బాంబే హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. మ్యాగీ నూడుల్స్‌పై కోర్టు నిషేధాన్ని తొలగించింది. ఆరు వారాల పాటు మ్యాగీపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు కోర్టు గురువారం వెల్లడించింది. అలాగే మ్యాగీ నూడుల్స్ ను మరోసారి తాజాగా పరీక్షలు చేయాలని కోర్టు ఆదేశించింది. మ్యాగీ నిషేధం విషయంలో సహజ న్యాయ సూత్రాలను ప్రభుత్వం పాటించలేదని కోర్టు అభిప్రాయపడింది. మ్యాగీలో లెడ్ ధాతువులు పరిమితికి మించి ఉన్నాయన్న ప్రభుత్వ వాదనలతో కోర్టు ఏకీభవించలేదు.
ఆరు వారాల్లో ప్రతి అయిదు శ్యాంపుల్స్ను ...మూడు ల్యాబ్‌ల్లో పరీక్షలకు పంపించాలని నెస్లే కంపెనీని బాంబే హైకోర్టు ఆదేశించింది. ల్యాబ్ నివేదికలు వచ్చిన అనంతరం తదుపరి విచారణ ఉంటుందని కోర్టు తెలిపింది. అంతేకాకుండా అప్పటివరకూ మ్యాగీ నూడుల్స్ అమ్మకాలను, తయారీ చేయకూడదని కోర్టు ఆదేశించింది. కాగా హైదరాబాద్, జైపూర్, మొహాలీ ల్యాబ్‌లలో మ్యాగీకి పరీక్షలు నిర్వహించనున్నారు.