ప్రభుత్వ విధానాలతో గీత వృత్తికి చేటు
తణుకు అర్బన్ : మద్యాన్ని ప్రోత్సహిస్తూ కల్లుగీత వృత్తిని భక్షించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జుత్తిగ నరసింహమూర్తి విమర్శించారు. కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సమావేశం ఆదివారం తణుకు అమరవీరుల భవనంలో జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లుగీత వృత్తికి సమగ్రమైన చట్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గీత కార్మికులు పోరాడి సాధించుకున్న జీవోలను ప్రభుత్వం అమలు చేయడంలేదని, అర్హత కలిగిన కార్మికులందరికీ పింఛన్లు, గుర్తింపు కార్డులు మంజూరు చేయడంలేదని విమర్శించారు. తెలంగాణలో గీత కార్మికుడు వృత్తిలో మరణిస్తే ఆ ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నారని మన రాష్ట్రంలో కూడా అదే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 27న తణుకులో జిల్లా కల్లుగీత కార్మిక సమావేశం నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. సమావేశంలో రాష్ట్ర తాటిబెల్లం ఫెడరేషన్ అ««దl్యక్షుడు బొల్లా ముసలయ్య గౌడ్, కల్లుగీత సంఘ నాయకులు చిటకన వెంకటేశ్వరరావు, కోమటి శ్రీనివాస్, కడలి పాండు, జుత్తిగ వెంకటేశ్వరరావు, గుబ్బల వీర రాఘవులు, బొంతు శ్రీనివాస్ పాల్గొన్నారు.