జబ్బు నయం చేస్తానంటూ.. కళ్లలో స్ప్రే
కేప్ టౌన్ (పోలోక్వేన్) :
దక్షిణాఫ్రికాకు చెందిన వివాదాస్పద ప్రవక్త లిథేబో రబాలగో భవితవ్యం సోమవారం తేలనుంది. ఇంట్లో కీటకాలను చంపడానికి ఉపయోగించే విషపూరితమైన స్ప్రేలను ప్రజల కళ్లు, మొహాల్లో స్ప్రే చేయడం ఆపాలంటూ లింపోపో ప్రావిన్స్ ఆరోగ్య శాఖ విభాగం హైకోర్టును ఆశ్రయించింది. స్పందించిన హైకోర్టు వెంటనే కీటకాల సంహారానికి ఉపయోగించే స్ప్రేలను ప్రజలపై ఉపయోగించొద్దంటూ లిథేబో రబాలగో ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా సోమవారం హాజరు కావాలని కోర్టు నోటీసుకూడా పంపినట్టు లింపోపో ఆరోగ్య శాఖ విభాగం అధికారప్రతినిధి డెర్రిక్ తెలిపారు.
తనకు అతీత శక్తులున్నాయంటూ ఎయిడ్స్, క్యాన్సర్లతో పాటూ వివిధ జబ్బులతో బాధపడుతున్నవారి వ్యాధులను నయం చేస్తానని లిథేబో రబాలగో ప్రకటించుకున్నాడు. పెద్ద ఎత్తున వచ్చిన బాధితుల కళ్లలో, మొహంపై పురుగుల మందును స్ప్రే చేసేవాడు. దీంతో లిథేబో రబాలగో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. కళ్లలో, మొహంపై స్ప్రే చేసుకోవడం హానికరమని సదురు స్ర్పే కంపెనీ కూడా ప్రజలను హెచ్చరించింది. 'ఈ సంఘటన చూస్తుంటే నా గుండె పగిలిపోయింది. బాధితులు తమ జీవితాల్లో మార్పు కోసం ఎవరు ఏది చెప్పినా వినడం చాలా బాధాకరం' అని దక్షిణాఫ్రికా ప్రముఖ నటి బోయిటీ తులో ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.