ఎర్రచందనం కేసులో చైనా స్మగ్లర్ అరెస్టు
చిత్తూరు (అర్బన్): ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో చైనాకు చెందిన లిన్‌డాంగ్ ఫూ (39) అనే వ్యక్తిని చిత్తూరు పోలీసులు శుక్రవారం రాత్రి బెంగళూరులో అరెస్టుచేశారు. చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ శనివారం ఈ వివరాలు వెల్లడించారు. చైనాలోని ఫుజియన్ రాష్ట్రానికి చెందిన లిన్డాంగ్ఫూ మూడేళ్ల నుంచి చైనా, ఇండియా మధ్య తిరుగుతూ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నాడు.
ముందస్తు సమాచారంతో చిత్తూరు పోలీసులు బెంగళూరులో దాడులు నిర్వహించిన శుక్రవారం రాత్రి ఫూను అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ఏడు దేశాలకు చెందిన 52 కరెన్సీ నోట్లు, రూ.10వేల విలువగల చైనా యన్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా దుబాయ్‌కి చెందిన సాహుల్‌భాయ్, హాంకాంగ్‌కు చెందిన సలీం అనే ఇద్దరు స్మగ్లర్లకు ఫూ ఆరు కంటైనర్లలో ఎర్రచందనం దుంగలు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఇతనితోపాటు చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళెంకు చెందిన ప్రసాద్‌నాయక్ (28) అనే మధ్యవర్తిని కూడా పోలీసులు అరెస్టుచేశారు.