Lingala Mandal
-
‘భీమ్లా నాయక్’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా?
తెలంగాణ కిన్నెరనాదాన్ని గుర్తింపు లభించింది. అరుదైన.. అంతరించిపోయే కళకు జీవమొచ్చినట్టు అయ్యింది. బతుకుదెరువు కోసం పాటలు పాడుకుంటూ ఊరూరూ తిరిగిన కళాకారుడిని చిత్రసీమ గుర్తించింది. అంతకుముందే తెలంగాణ ప్రభుత్వం అతడిని కళను గుర్తించి ప్రోత్సహించి సత్కరించింది. ఆ చర్యలు ఫలించి అంతరించిపోయే కళకు సజీవ సాక్షిగా ఉన్న దర్శనం మొగులయ్య గురించి తెలుసుకుందాం. లింగాల: జానపద పాటలనే జీవనోపాధిగా మార్చుకున్న దర్శనం మొగులయ్య, 12 మెట్ల కిన్నెర మొగులయ్యగా అందరికీ సుపరిచితుడు. పాన్‌గల్ మియాసాబ్, పండుగ సాయన్న వీరగాథ వంటివి కిన్నెర వాయిస్తూ పాడేవాడు. అనుకోకుండా వెండి తెరపై పాటలు పాడేందుకు అవకాశం రావడంతో దానిని సద్వినియోగం చేసుకున్నాడు. సినీ కథానాయకుడు పవన్ కల్యాణ్ కొత్త సినిమా ‘భీమ్లా నాయక్’లో ఇంట్రడక్షన్ టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. దీంతో ఆయన ప్రయాణం వెండితెరపై వెలుగనుంది. ఆయన పాడిన పాట ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని అవుసలికుంట ప్రాంతానికి చెందిన మొగులయ్య గురించి స్థానికులకు తెలియడంతో మొగులయ్య వెండి తెరపై పాటలు పాడుతాడని అసలు ఊహించలేదని అంటున్నారు. గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు ఇచ్చి అతడికి పింఛన్ సౌకర్యం కల్పించింది. తమిళనాడు ప్రాంతంలో షూటింగ్.. భీమ్లానాయక్ చిత్రానికి అవసరమైన టైటిల్ సాంగ్ షూటింగ్ తమిళనాడులోని ఓ అటవీ ప్రాంతంలో జరిగింది. దీనికి మొగులయ్యకు అవకాశం రావడంతో అక్కడికి వెళ్లి పాట పాడారు. అది నచ్చడంతో చిత్రంలో పెట్టినట్లు తెలుస్తోంది. జానపద కళలంటే ప్రాణం తాత, ముత్తాల వారసత్వంగా వచ్చిన జానపద పాటలు అంటే నాకు ఎంతో ఇష్టం. సొంతంగా కిన్నెరను తయారు చేసుకొని గ్రామాల్లో కిన్నెరతో పాటలు పాడుతుంటా. ఇలా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నా కళను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించింది. నా కళ నచ్చి, మెచ్చిన వారి సాయంతో వెండి తెరపై పాట పాడే అవకాశం వచ్చింది. నాకు అవకాశం ఇచ్చిన పవన్‌కల్యాణ్‌కు కృతజ్ఞతలు. - దర్శనం మొగులయ్య, కిన్నెర కళాకారుడు, అవుసలికుంట -
వీడిన సర్పంచ్ హత్య మిస్టరీ: పాతకక్షలతోనే దాడి
లింగాల : వైఎస్సార్ కడప జిల్లా లింగాల మండలం కోమన్నూతల సర్పంచ్ కణం చిన్న మునెప్ప హత్యకు పాత కక్షలే కారణమని డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. లింగాల పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. మునెప్ప సర్పంచ్‌గా గెలుపొందడం జీర్ణించుకోలేక నాగిరెడ్డి గారి లక్ష్మీరెడ్డి వర్గీయులు హతమార్చారు. 1995లో గ్రామంలోని సరిబాల లక్ష్మీనారాయణరెడ్డి వర్గీయులు అదే గ్రామానికి చెందిన కాల్వ పుల్లన్నపై బాంబులు, తుపాకులు, కొడవళ్లతో దాడిచేసి చంపారు. దాడిలో పుల్లన్న, నలుగురు సోదరులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో కణం చిన్న మునెప్ప నిందితుడిగా ఉన్నాడు. తర్వాత 1995లో పులివెందుల మండలం రాయలాపురం బ్రిడ్జి సమీపంలో సరిబాల లక్ష్మీనారాయణరెడ్డి వర్గీయులే నాగిరెడ్డి గారి లక్ష్మీరెడ్డి బావ అంకిరెడ్డి మనోహర్‌రెడ్డిని హతమార్చారు. ఈ కేసులో కణం చిన్న మునెప్ప హస్తం ఉన్నట్లు బయటపడింది. అప్పటి నుంచి ఇతడిపై లక్ష్మీరెడ్డి వర్గీయులు కక్ష పెంచుకున్నారు. చిన్న మునెప్పను హతమార్చేందుకు పథకం వేశారు. గతనెల 27వ తేదీన పులివెందులలో నిర్వహించిన సర్పంచ్ శిక్షణా తరగతులకు కణం చిన్నమునెప్ప హాజరై తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో నాగిరెడ్డిగారి లక్ష్మీరెడ్డి, మరో 15 మంది ద్విచక్ర వాహనాల్లో వచ్చి ఢీకొట్టారు. కిందపడిన చిన్న మునెప్పను కొడవళ్లతో అతి కిరాతకంగా నరికి చంపారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను గురువారం వెలిదండ్ల సమీపంలోని గొడ్డుమర్రి క్రాస్ రోడ్డు వద్ద అరెస్టు చేశారు. ప్రత్యక్ష సాక్షి సరిబాల వెంకట్రామిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ద్విచక్రవాహలను సీజ్ చేసినట్లు చెప్పారు. నిందితులను శుక్రవారం పులివెందుల సివిల్ జడ్జి కోర్టుకు హాజరుపరచగా.. రిమాండ్‌కు పంపించారు. సమావేశంలో సీఐ రవీంద్రనాథరెడ్డి, ఎస్ఐ హృషికేశవరెడ్డి పాల్గొన్నారు. -
18 ఏళ్ల వ్యక్తితో 22 ఏళ్ల యువతి ప్రేమ: చివరకు నల్లమలలో
లింగాల (అచ్చంపేట): ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వయసు మధ్య అంతరం ఉండడంతో పెద్దలు వారి పెళ్లికి నిరాకరించారు. దీంతో యువతి కుటుంబసభ్యులు వేరొకరితో నిశ్చితార్థం జరిపించి పెళ్లి జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది తట్టుకోలేక ఆ యువతి తన ప్రియుడితో కలిసి నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన ఏదుల సలేశ్వరంగౌడ్ (18) ఇంటర్ చదివాడు. హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి అదే గ్రామానికి చెందిన ఉడ్తనూరి రాధ (22) పరిచయమైంది. డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసిన రాధ కరోనా వ్యాప్తి నేపథ్యంలో గ్రామంలోనే ఉంటోంది. వీరిద్దరి మధ్య కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వారి ప్రేమకు నిరాకరించారు. దీంతో రాధకు కుటుంబసభ్యులు కొన్ని రోజుల కిందట మరో వ్యక్తితో రాధకు నిశ్చితార్థం జరిపించారు. పెళ్లి జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సలేశ్వరంగౌడ్ నాలుగు రోజుల కిందట హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చి రాధను తీసుకుని వెళ్లిపోయాడు. వారిద్దరూ అదృశ్యమవడంతో ఇరు కుటుంబాల వారు గాలిస్తున్నారు. ఎంత వెతికినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఆదివారం సాయంత్రం నల్లమల అటవీ ప్రాంతంలో గొర్రెలను మేపుతున్న కాపరులకు రామచంద్రికుంట సమీపంలో వీరిద్దరూ ఉరి వేసుకుని కనిపించారు. విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయగా అక్కడికి వెళ్లి వారిని గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ కృష్ణయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. -
వానరం మృతి.. అన్న సంతర్పణ
లింగాల : వృద్ధ వానరం చనిపోతే మనకెందుకులే అనుకుని మృతదేహాన్ని అవతల పారేయలేదు.. భక్తితో మృతదేహాన్ని ఊరేగించి ఖననం చేయడమేగాక సమాధి కట్టి అన్నదానం కూడా జరిపారు ఆ గ్రామస్తులు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా లింగాల మండల కేంద్రంలో జరిగింది. ఈనెల 19వ తేదీన ఓ వృద్ధ వానరం మృతిచెందింది. ఆ మర్నాడు దాని మృతదేహాన్ని గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ఖననం చేశారు. ఆ ప్రదేశంలో సమాధి కట్టి శనివారం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రశేఖరరెడ్డి, చెన్నకేశవరెడ్డి, వీరారెడ్డిల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహాయసహకారాలతో గ్రామ ప్రజలందరికీ అన్న సంతర్పణ నిర్వహించి సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ భర్త సారెడ్డి చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అక్కను సజీవదహనం చేసిన తమ్ముడు
లింగాల: మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండలం రాయవరానికి చెందిన గొడచర్ల మంగమ్మ(45)ను ఆమె తమ్ముడు బొందయ్య సజీవదహనం చేశాడు. మానవత్వం మరచి..చిన్నవిషయానికే ఆమెపై కిరోసిన్ పోసి నిప్పటించాడు. వివరాలు.. గొడచర్ల మంగమ్మకు సుమారు 20 ఏళ్ల క్రితం నిరంజన్‌తో వివాహమైంది. వారి మధ్య విబేధాలు రావడంతో విడిపోయారు. ఏడేళ్ల క్రితం మంగమ్మకు మరో వ్యక్తితో రెండో వివాహం చేశారు. మూడేళ్లకే వారు విడిపోయారు. అప్పటి నుంచి మంగమ్మ పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో తరచూ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం మంగమ్మకు ఆమె తమ్ముడు బొందయ్య భార్యతో ఘర్షణ జరిగింది. రాత్రి ఇంటికి వచ్చిన బొందయ్యకు ఘర్షణ విషయం తెలిసింది. శుక్రవారం మధ్యాహ్నం మద్యం మత్తులో ఉన్న బొందయ్య అక్క మంగమ్మ వద్దకు వెళ్లి కిరోసిన్‌పోసి నిప్పటించాడు. దీంతో ఆమె అక్కడిక్కడే చనిపోయింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.