‘భీమ్లా నాయక్‌’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా? | Telangana Folk Artist Darshanam Mogulaiah Sung A Song In Bheemla Naik Movie | Sakshi
Sakshi News home page

Bheemla Nayak Title Song Singer: వీధి పాటల నుంచి వెండి తెర దాకా

Published Fri, Sep 3 2021 11:37 AM | Last Updated on Fri, Sep 3 2021 7:53 PM

Telangana Folk Artist Darshanam Mogulaiah Sung A Song In Bheemla Naik Movie - Sakshi

తెలంగాణ కిన్నెరనాదాన్ని గుర్తింపు లభించింది. అరుదైన.. అంతరించిపోయే కళకు జీవమొచ్చినట్టు అయ్యింది. బతుకుదెరువు కోసం పాటలు పాడుకుంటూ ఊరూరూ తిరిగిన కళాకారుడిని చిత్రసీమ గుర్తించింది. అంతకుముందే తెలంగాణ ప్రభుత్వం అతడిని కళను గుర్తించి ప్రోత్సహించి సత్కరించింది. ఆ చర్యలు ఫలించి అంతరించిపోయే కళకు సజీవ సాక్షిగా ఉన్న దర్శనం మొగులయ్య గురించి తెలుసుకుందాం.

లింగాల: జానపద పాటలనే జీవనోపాధిగా మార్చుకున్న దర్శనం మొగులయ్య, 12 మెట్ల కిన్నెర మొగులయ్యగా అందరికీ సుపరిచితుడు. పాన్‌గల్‌ మియాసాబ్, పండుగ సాయన్న వీరగాథ వంటివి కిన్నెర వాయిస్తూ పాడేవాడు. అనుకోకుండా వెండి తెరపై పాటలు పాడేందుకు అవకాశం రావడంతో దానిని సద్వినియోగం చేసుకున్నాడు. సినీ కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ కొత్త సినిమా ‘భీమ్లా నాయక్‌’లో ఇంట్రడక్షన్‌ టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌ చేశారు. దీంతో ఆయన ప్రయాణం వెండితెరపై వెలుగనుంది.



ఆయన పాడిన పాట ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలంలోని అవుసలికుంట ప్రాంతానికి చెందిన మొగులయ్య గురించి స్థానికులకు తెలియడంతో మొగులయ్య వెండి తెరపై పాటలు పాడుతాడని అసలు ఊహించలేదని అంటున్నారు. గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు ఇచ్చి అతడికి పింఛన్‌ సౌకర్యం కల్పించింది.


తమిళనాడు ప్రాంతంలో షూటింగ్‌..
భీమ్లానాయక్‌ చిత్రానికి అవసరమైన టైటిల్‌ సాంగ్‌ షూటింగ్‌ తమిళనాడులోని ఓ అటవీ ప్రాంతంలో జరిగింది. దీనికి మొగులయ్యకు అవకాశం రావడంతో అక్కడికి వెళ్లి పాట పాడారు. అది నచ్చడంతో చిత్రంలో పెట్టినట్లు తెలుస్తోంది.

జానపద కళలంటే ప్రాణం
తాత, ముత్తాల వారసత్వంగా వచ్చిన జానపద పాటలు అంటే నాకు ఎంతో ఇష్టం. సొంతంగా కిన్నెరను తయారు చేసుకొని గ్రామాల్లో కిన్నెరతో పాటలు పాడుతుంటా. ఇలా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నా కళను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించింది. నా కళ నచ్చి, మెచ్చిన వారి సాయంతో వెండి తెరపై పాట పాడే అవకాశం వచ్చింది. నాకు అవకాశం ఇచ్చిన పవన్‌కల్యాణ్‌కు కృతజ్ఞతలు.  
- దర్శనం మొగులయ్య, కిన్నెర కళాకారుడు, అవుసలికుంట

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement