kinnera
-
ముందుకు సాగడమే జీవితం.. సేవ కోసం ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని..
కిన్నెర నాగ చంద్రికాదేవి పుట్టింది అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణం (కడప జిల్లా). పెరిగింది కడప జిల్లా ఎర్రగుంట్లలో. ఉన్నత విద్యావంతుల కుటుంబంలో పుట్టిన నాగచంద్రాదేవికి పదో తరగతితోనే పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని ఊహించలేదు. అలాగే రెండు వందల తులాల బంగారంతో మొదలైన ఆమె జీవితంలో కాలంతోపాటు బంగారం కరిగిపోవడమూ ఊహించలేదు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని, సమాజ సేవ కోసం ఆ ఉద్యోగాన్ని వదిలేయాల్సి వస్తుందని కూడా ఊహించని సంఘటనలే. అలాగే సోదరులున్నప్పటికీ తల్లిదండ్రుల దహన సంస్కారాలు తన చేతులతో చేయాల్సి వస్తుందని కూడా ఊహించని పరిణామమే. అలాగే తన హోమ్‌లో కాలధర్మం చెందిన ఆరు వందల మందికి స్వయంగా అంత్యక్రియలు చేయడం కూడా ఊహించని సంఘటనలే. తన సేవా ప్రస్థానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారామె. ‘జీవితం అంటేనే గమ్యం ఏమిటో తెలియకనే మొదలు పెట్టే ప్రయాణం. ఊహకందని మలుపులతో సాగే ఈ ప్రయాణంలో స్పీడ్ బ్రేకర్లుంటాయి, గతుకులుంటాయి, వాహనం మొరాయిస్తుంది, మరమ్మతులు చేసి ముందుకు సాగబోతే ఇంధనం నిండుకోనూవచ్చు. ఇన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగడమే మనం చేయగలిగింది. వృద్ధుల సేవలో నా జీవితానికి ఒక అర్థాన్ని నిర్వచించుకున్నాననే అనుకుంటున్నాను’ అన్నారామె. నైరాశ్యం– నేను– నా బిడ్డ ‘‘మా నాన్న మెడికల్ ఆఫీసర్. అమ్మానాన్నలకు తొలి సంతానం నేను. నన్ను మా మేనత్తకు దత్తత ఇచ్చారు. అత్త, మామ ఇద్దరూ హైస్కూల్ టీచర్లు. ఎందుకు నిర్ణయం తీసుకున్నారో కానీ టెన్త్ క్లాస్‌తోనే పెళ్లి చేశారు. అయితే పెళ్లి తర్వాత కాలేజ్‌కెళ్లే అవకాశం ఉండింది. ఇంటర్ తర్వాత విద్యుత్‌సౌధలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశాను. ఈ లోపు బాబుకి తల్లి కావడం... బిడ్డనెత్తుకుని ఇంటి నుంచి బయటపడడం వరకు జీవితంలో ముఖ్యమైన ఘట్టాలన్నీ చిన్నవయసుకే పూర్తయిపోయాయి.. ఉద్యోగం చేసుకుని ఇంటికి వస్తే నాలుగ్గోడల మధ్య నేను, నా కొడుకు. నైరాశ్యం ఆవరించినట్లయ్యేది. దాని నుంచి బయటపడడానికి వేసిన ఒక్కో అడుగూ నన్ను ఇవాళ ఇలా సేవకు ప్రతీకగా నిలబెట్టాయి. నా పనిని గుర్తించి అవార్డులు వరించాయి. నన్ను అంటిపెట్టుకుని నేడో రేపో అన్నట్లు కళ్లలో ప్రాణాలు నిలుపుకుని రోజులు లెక్కపెట్టుకుంటున్న వాళ్లు ఉన్నారు. నేను కనిపించగానే వాళ్ల కళ్లలో కనిపించే వెలుగు నన్ను నడిపిస్తోంది. ఒకరికి ఒకరు తోడు మగవాడి మోసానికి గురయి ఒంటరైన మహిళలకు నా ఇంట్లో ఉంచుకుని వాళ్లు ఏదో ఒక పని నేర్చుకుని వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే వరకు ఆసరా ఇస్తూ వచ్చాను. అలాగే ఏ దిక్కూలేని వృద్ధులను ఇంటికి తీసుకురావడం కూడా. ఏ బంధుత్వం లేని వాళ్లను అలా ఇంట్లో ఉంచుకోవడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం అని తెలిసి 2003లో మా ఇంటి పేరుతోనే కిన్నెర ఫౌండేషన్ స్థాపించాను. అక్కడి నుంచి నా సర్వీస్ విస్తరణ కూడా మొదలైంది. స్కూల్లో ఉండాల్సిన పిల్లలు వీథుల్లో ఉంటే వారిని సమీకరించి కౌన్సెలింగ్ ఇచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేర్చాను. ఎందుకో తెలియదు కానీ అక్కడ కూడా సింగిల్ పేరెంట్ సంరక్షణలో ఉన్న పిల్లలే ఎక్కువగా ఉండేవారు. ఆ బాధ నాకు తెలుసు కాబట్టి నా బిడ్డల్లా అనిపించేవారు. సామాజిక చైతన్యం మహిళలకు ఎదురయ్యే ఇబ్బందులను వివరిస్తూ ప్రభుత్వపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో షీ టీమ్‌తో కలిసి పని చేశాను. నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట దగ్గర జప్తేసద్గూడ గ్రామాన్ని దత్తత తీసుకుని ప్లోరోసిస్ బాధితులకు మంచి నీటి ఏర్పాటు చేయడం వంటి అనేక కార్యక్రమాలు నా చేతుల మీదుగా చేయగలిగాను. వృద్ధుల సేవనే ప్రధానంగా తీసుకోవడానికి కారణం మా అమ్మమ్మ, అత్త మంచం పట్టిన రోజులను దగ్గరగా చూడడమే. వాళ్ల మీద మనకు ఎంత ప్రేమ ఉన్నప్పటికీ వాళ్ల బాధను పంచుకోలేం. మనం చేయగలిగింది వారికి తోడుగా ఉంటూ భరోసా ఇవ్వడం మాత్రమే. అందుకే మా హోమ్‌లో హాస్పిస్ సేవలే ప్రధానంగా ఉంటాయి. హోమ్ నిర్వహణకు నెలకు మూడు లక్షల ఖర్చు వస్తుంది. ఒక కంపెనీ నుంచి అద్దెలో కొంత ఆర్థిక సహాయం, మరో కంపెనీ నుంచి బియ్యం నెలనెలా అందుతున్నాయి. పుట్టినరోజులు హోమ్‌లో చేసుకోవడానికి కొంతమంది వస్తారు. మిగిలిన ఖర్చుల కోసం ... ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌లో సంపాదించుకున్న ఇల్లు, రెండు ప్లాట్లు అమ్ముకున్నాను. బంగారం బ్యాంకులో తాకట్టు పెడుతూ విడిపిస్తూ, పెద్ద అవసరంలో అమ్ముకుంటూ అలా 30 తులాలు ఖర్చయింది. మాసాబ్ ట్యాంకులో అద్దె ఇంట్లో హోమ్ నిర్వహిస్తున్నాను. నా శక్తి తగ్గిపోతోందనే సమయం వచ్చిందని కాబోలు భగవంతుడు హోమ్ కోసం సొంత భవనాన్ని నిర్మించే మార్గం చూపించాడు. చిన్న జీయర్ స్వామి సూచనతో ముచ్చింతల్‌లో హోమ్ నిర్మాణం పూర్తయితే మా హోమ్ అక్కడికి మారుతుంది’’ అని వివరించారు నాగ చంద్రికాదేవి. సేవలోనే సాంత్వన నా సర్వీస్‌కి గుర్తింపుగా స్టేట్ అవార్డు, ఉత్తమ మహిళ అవార్డు, సేవాధార్మిక, గవర్నర్ అవార్డు, నేషనల్ అవార్డు అందుకున్నాను.ఈ పనుల్లో నన్ను నేను ఎంగేజ్ చేసుకున్నాను. ఈ సేవలో నాకు సాంత్వన లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏపీలో గుణదలలో పోస్టింగ్ వచ్చింది. నేను హైదరాబాద్ వదిలి వెళ్లాలంటే హోమ్‌లో ఉన్న వాళ్ల సంరక్షణ ప్రశ్నార్థకమైంది. వాళ్లను ఎవరి మీద వదలాలి? తాత్కాలికంగా బాధ్యత అందుకోవడానికి కూడా ఏ ఆసరా లభించలేదు. దాంతో 2016లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. – నాగ చంద్రికాదేవి, ఫౌండర్, కిన్నెర ఫౌండేషన్ – వాకా మంజులారెడ్డి -
స్వరార్చన
-
కిన్నెర లింగు కన్నుమూత
ఆదిలాబాద్: ప్రముఖ పన్నేండు మేట్ల కిన్నెర కళాకారుడు కుమ్రం లింగు అనారోగ్యంతో ఆదిలాబాద్ జిల్లా చించూట్‌లో కన్నుమూశారు. తెలంగాణలో ఎకైక పన్నెండు మేట్ల కిక్రీ కళకారుడు లింగు. గిరిజన కళాకారుడైన లింగు పన్నేండు మేట్ల కిక్రీ వాయిస్తూ ఎన్నో కళా ప్రదర్శనలు ఇచ్చారు. కిక్రీ కళతో వివిధ అవార్డులు పోందారు. కుమ్రం లింగు మృతిపై అదివాసీ గిరిజన సంఘాలు తీవ్ర సంతాపం ప్రకటించాయి. చదవండి: తెలంగాణ కేబినెట్ సమావేశం.. ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం -
కళాకారుడి బతుకుపళ్లెం
మహా కథకుడు ప్రేమ్‌చంద్ కాశీలో ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ ఆ రాబడితో బతకలేక సినిమాలకు రాద్దామని బొంబాయి చేరుకున్నాడు. తన మానవీయ, సామ్యవాద ధోరణులకు తగినట్టుగా ఒక సినిమాలో జీతం ఇవ్వని యజమానిపై కార్మికులు తిరగబడాలని రాశాడు. తర్వాత పెద్దగా సినిమాలు రాలేదు. తిరిగి కాశీకి చేరుకుంటే సొంత ప్రెస్ కార్మికులు జీతం కోసం సమ్మె చేశారు. పైగా సమ్మె చేయమని మీరే రాశారు కదా అన్నారు. ప్రేమ్‌చంద్‌కు అనారోగ్యం. క్షయ. జీవితాంతం నానా బాధలు పడ్డాడు. ఇంత గొప్ప కథకుడివి, నీ కష్టం ఏమిటి అని ప్రభుత్వం అడిగి ఉంటే ఆయన బతుకు మరోలా ఉండేది. తెలుగువారు గర్వించదగ్గ కథకుడు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి పాఠకులను, కళాభిమానులను నమ్ముకుని ఫుల్‌టైమ్ రైటర్‌గా ఉన్నాడు. ఆయన ఆత్మకథ ‘అనుభవాలూ జ్ఞాపకాలూనూ’ చదివితే రచయితగా ఎన్ని సన్మానాలు పొందాడో బతకడానికి అన్నే అవస్థలు పడ్డాడని అర్థమవుతుంది. చివరి రోజుల్లో ఆయన ఒక ధనవంతునికి లేఖ రాస్తూ ‘నేను పోయాక నా భార్యకైనా సహాయం అందేలా చూడండి’ అని ప్రాథేయపడటం కనిపిస్తుంది. నాజర్ బుర్రకథ చెబుతున్నాడంటే పల్లెల్లో టికెట్ షో కోసం కట్టిన అడ్డు తడికెలు జనం ధాటికి తెగి పడేవి. పల్నాటి వీరగాథను శౌర్యంతో పాడిన ఈ గాయకుడు చివరి రోజుల్లో శౌర్యంగా బతక లేక పోయాడు. సరైన ఇల్లు లేదు. అనారోగ్యం బాధించింది. ప్రభుత్వంలో పెద్దలందరికీ ఆయన తెలిసినా సరైన సమయంలో సహాయం అందలేదు. తమిళవాడైనా తెలుగు నేర్చుకుని తెనాలిలో ఉంటూ కథలు, నవలలు రాసిన శారద (నటరాజన్) హోటళ్లలో సర్వర్‌గా పని చేస్తూ దారుణమైన పేదరికంలో మరణించడం మనకే చెల్లింది. మద్రాసులో 1970ల కాలంలో జీతం చాలక కనిపించిన ప్రతివాణ్ణీ ‘ఓ ఫైవ్ ఉందా’ అని అడిగిన ప్రఖ్యాత తెలుగు కవిని చూసి, ఏడవలేక నవ్వి ముళ్లపూడి వెంకటరమణ ‘అప్పారావు’ పాత్రను సృష్టించాడని అంటారు. ఆ అప్పారావు ‘ఓ ఫైవ్ ఉందా’ అని అడగనివాడు లేడు. ఫైవ్ అంటే ఫైవ్ రూపీస్. ఒక కాలంలో ఫైవ్ రూపీస్ కోసం అల్లల్లాడిన కళాకారులు ఉన్నారు. నేడు ఓ ఫైవ్ థౌజండ్ కోసం చూసే వారూ ఉన్నారు. ‘కళ జమీందార్లకు మాత్రమే ఉండాల్సిన జబ్బు’ అనేవాడు కార్టూనిస్టు మోహన్. రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి శ్రీమంతులు, రాజా రవివర్మ వంటి మహరాజులు కళను అభిమానించి సాధన చేశారంటే వాళ్లకు తిండికి ఢోకా లేకపోవడం ఒక కారణం. కాని కళ పట్ల ఉన్మత్తతతో దాని కోసమే జీవితాన్ని వెచ్చించాలని అనుకుంటే ప్రతిపూటా భోజనం వచ్చి ‘నా చంగతేంటి?’ అని అడక్క మానదు. భార్య, సంతానం, సంసారం... వీరు కూడా! కళలో రాణించాలి, సంసారాన్ని పోషించాలి అనేది అనాదిగా ఈ దేశంలో కళాకారులు ఎదుర్కొంటున్న విషమ పరీక్ష. ‘పథేర్ పాంచాలి’ నవలలో 1910 నాటి కరువు రోజుల్లో ఆ తండ్రి పల్లెటూళ్లోని భార్యను, కొడుకును, కూతురిని ఆకలికి వదిలి, వారి కోసం నాలుగు అన్నం ముద్దలు వెతకడానికి కవిగా, నాటక రచయితగా రాణించడానికి పట్నం వెళతాడు. కాని అతను రాడు. అతని కూతురు దుర్గ సరైన తిండి, వైద్యం లేక మరణిస్తే ఆ దయ నీయమైన మరణం పాఠకుణ్ణి వదలదు. కళకు ఈ దేశంలో పేదరికం అనే వదలని నీడ ఉంటుంది. ఆశ్రయం పొంది కళ రాణించింది చాల్నాళ్లు. రాజాశ్రయం, జమీందార్ల ప్రాపకం సంపాదించిన కళాకారులు తిండి నిశ్చింతతో బతికారు. అలా ఆశ్రయం పొంద నిరాకరించినవారు, పొందలేక పోయిన వారు ఎన్నో బాధలు పడ్డారు. నిజమైన కళాకారులు ‘జీ హుజూర్’ కొలువుకూ, జీతం రాళ్ల ఉద్యోగాలకు ఒదగరు. గొప్ప ప్రతిభ కలిగి, తమ కళతో సమాజానికి ఉల్లాసము, చైతన్యము, పరివర్తన ఇవ్వగలిగిన కళాకారులు ఎందరో నేడు కళను ‘వీలున్న సమయాల్లో’ సాధన చేస్తూ మిగిలిన సమయమంతా బతుకు తండ్లాటలో గడపవలసి వస్తున్నదన్నది వాస్తవం. కెనడా వంటి దేశాలలో ‘నేనొక నవల రాస్తాను’ అని దరఖాస్తు చేసుకుంటే పని చేసే సంస్థ పూర్తి శాలరీతో ఏడాది నుంచి రెండేళ్ల కాలం సెలవు మంజూరు చేసే వీలుందట. నవలాకారుడు గార్షియా మార్క్వెజ్ తన భార్యతో ‘ఒక రెండేళ్లు ఇంటిని నెట్టుకు రాగలవా? పైసా ఇవ్వలేను. నవల రాసుకుంటాను’ అనంటే ఆమె ‘సరే’ అంది. ఆమె ఇల్లు చూసుకోవడం వల్ల మార్క్వెజ్ ‘హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్’ అనే క్లాసిక్ రాశాడు. నిజానికి ఆ రెండేళ్లు ఇంటిని నెట్టుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిది! కళాకారులు పరోక్ష శాసనకర్తలు. వారు సమాజానికి నైతిక పాలననూ, సాంస్కతిక విలువలనూ కల్పిస్తారు. ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను అచ్చు వేయగలదు. కాని కళాకారులే ఏది మంచో, ఏది చెడో జనులకు కళాత్మక పద్ధతిలో హదయాలకు ఎక్కేలా చేస్తారు. అందుకే కళాకారుల బాధ్యత ప్రభుత్వ బాధ్యత కూడా! తెలంగాణ ప్రభుత్వం పన్నెండు మెట్ల కిన్నెర వాద్యకారుడు మొగిలయ్యకు నివాసం, ఉపాధికి కోటి రూపాయలు మంజూరు చేయడం సంతోషకరమైన అంశం. ఇలా సమాజానికి ఉపయోగపడే, సీరియస్ కళాసాధనలో ఉండే సహాయం అందితే గొప్ప కళాసృష్టి చేయదలిచే కళాకారులకు మరింత నిర్మాణాత్మక పద్ధతిలో ప్రభుత్వ మద్దతు అందే ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కళాకారుల జీవన సమర్థనకు అవసరమైన ప్రయత్నాలు మొదలెట్టాలి. నకిలీ, కృత్రిమ, విశృంఖల, హానికారక వినోద కళల నుంచి దేశ ప్రజలను కాపాడాలన్నా, ప్రాదేశిక సంస్కృతిని నిలబెట్టుకోవాలన్నా ముందు కళాకారులను బతికించుకోవాలి. కళ బతుకు గాక కళాకారుని ఊపిరి యందు! -
‘భీమ్లా నాయక్’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా?
తెలంగాణ కిన్నెరనాదాన్ని గుర్తింపు లభించింది. అరుదైన.. అంతరించిపోయే కళకు జీవమొచ్చినట్టు అయ్యింది. బతుకుదెరువు కోసం పాటలు పాడుకుంటూ ఊరూరూ తిరిగిన కళాకారుడిని చిత్రసీమ గుర్తించింది. అంతకుముందే తెలంగాణ ప్రభుత్వం అతడిని కళను గుర్తించి ప్రోత్సహించి సత్కరించింది. ఆ చర్యలు ఫలించి అంతరించిపోయే కళకు సజీవ సాక్షిగా ఉన్న దర్శనం మొగులయ్య గురించి తెలుసుకుందాం. లింగాల: జానపద పాటలనే జీవనోపాధిగా మార్చుకున్న దర్శనం మొగులయ్య, 12 మెట్ల కిన్నెర మొగులయ్యగా అందరికీ సుపరిచితుడు. పాన్‌గల్ మియాసాబ్, పండుగ సాయన్న వీరగాథ వంటివి కిన్నెర వాయిస్తూ పాడేవాడు. అనుకోకుండా వెండి తెరపై పాటలు పాడేందుకు అవకాశం రావడంతో దానిని సద్వినియోగం చేసుకున్నాడు. సినీ కథానాయకుడు పవన్ కల్యాణ్ కొత్త సినిమా ‘భీమ్లా నాయక్’లో ఇంట్రడక్షన్ టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. దీంతో ఆయన ప్రయాణం వెండితెరపై వెలుగనుంది. ఆయన పాడిన పాట ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని అవుసలికుంట ప్రాంతానికి చెందిన మొగులయ్య గురించి స్థానికులకు తెలియడంతో మొగులయ్య వెండి తెరపై పాటలు పాడుతాడని అసలు ఊహించలేదని అంటున్నారు. గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు ఇచ్చి అతడికి పింఛన్ సౌకర్యం కల్పించింది. తమిళనాడు ప్రాంతంలో షూటింగ్.. భీమ్లానాయక్ చిత్రానికి అవసరమైన టైటిల్ సాంగ్ షూటింగ్ తమిళనాడులోని ఓ అటవీ ప్రాంతంలో జరిగింది. దీనికి మొగులయ్యకు అవకాశం రావడంతో అక్కడికి వెళ్లి పాట పాడారు. అది నచ్చడంతో చిత్రంలో పెట్టినట్లు తెలుస్తోంది. జానపద కళలంటే ప్రాణం తాత, ముత్తాల వారసత్వంగా వచ్చిన జానపద పాటలు అంటే నాకు ఎంతో ఇష్టం. సొంతంగా కిన్నెరను తయారు చేసుకొని గ్రామాల్లో కిన్నెరతో పాటలు పాడుతుంటా. ఇలా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నా కళను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించింది. నా కళ నచ్చి, మెచ్చిన వారి సాయంతో వెండి తెరపై పాట పాడే అవకాశం వచ్చింది. నాకు అవకాశం ఇచ్చిన పవన్‌కల్యాణ్‌కు కృతజ్ఞతలు. - దర్శనం మొగులయ్య, కిన్నెర కళాకారుడు, అవుసలికుంట -
15న కందుకూరికి కిన్నెర సాహితీపురస్కారం
రాజమహేంద్రవరం కల్చరల్: కొత్తపేట మండలం మోడేకుర్రు గ్రామానికి చెందిన విశ్రాంత సంస్కృతాంధ్ర ఉపన్యాసకుడు కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ కిన్నెర సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. కిన్నెర ఆర్ట్ థియేటర్, ద్వానా సాహితీ కుటీరం సంయుక్త ఆధ్వర్యంలో కందుకూరి ఈ పురస్కారాన్ని ఈ నెల 15వ తేదీన హైదరాబాద్‌లో అందుకోనున్నారు. అష్ట దిగ్గజాలలో ఒక్కరైన అయ్యలరాజు రామభద్రుడు రచించిన రామాభ్యుదయ కావ్యానికి కందుకూరి రచించిన వ్యాఖ్యాన గ్రంథానికి ఈ పురస్కారం లభిస్తుంది. నగరానికి చెందిన ప్రజ్ఞారాజహంస చింతలపాటి శర్మ, ప్రాచార్య శలాక రఘునాథ శర్మ, భాగవతవిరించి డాక్టర్ టివి.నారాయణరావులు కందుకూరికి తమ అభినందనలు తెలియజేశారు. -
కన్నీటి కిన్నెర
పురాణ ప్రశస్తి పొందిన శతాబ్దాల నాటి అపురూప వాద్య పరికరం కిన్నెర. ఎలక్ట్రానిక్ వాయిద్యాల హోరులో అంతరించే దశకు చేరుకుంది. ఇప్పుడు దాని తయారీని పట్టించుకునే వారే లేరు. అలాంటి అరుదైన కిన్నెరను నేటికీ మీటుతున్న ఏకైక కళాకారుడు దర్శనం మొగులయ్య (63). కిన్నెరపై ఆయన చేసే స్వర విన్యాసాన్ని విన్నవారు, కన్నవారు ఎన్ని ప్రశంసలు కురిపిస్తున్నా, ఆ కళాకారుడికి పూట గడవడమే కష్టంగా ఉంటోంది. తరతరాలుగా నమ్ముకున్న కిన్నెర తనకు అన్నం పెట్టకున్నా, అదే తన ప్రాణమని చెబుతున్న మొగులయ్య గురువారం బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో కచేరీ ఇచ్చాడు. ఈ సందర్భంగా పలకరించినప్పుడు ‘సిటీప్లస్’తో తన అనుభవాలను పంచుకున్నాడు. అవి ఆయన మాటల్లోనే... ఈ కిన్నెరను మా తాతల కాలంలో తయారు చేశారు. దాన్నే మార్చుకుంటొస్తున్న. దీన్ని వాయించడం ఇంకెవ్వరికీ రాదు. నాకొస్తది. ఎంత బాగా వినిపించినా ఏం లాభం? కూటికొస్త లేదు, గుడ్డకొస్త లేదు ఈ విద్య. ఇంటిని నడపాలంటే కూలిపనే దిక్కు. ఇంతకు ముందు కూడా ఈ కళ అన్నంపెట్టనప్పుడు ఐదేళ్లు మట్టిపని చేసిన. కానీ, కిన్నెరను చూస్తే పాట మొదలెట్టాలనిపిస్తది. నా మూడో కొడుకుకు మూర్ఛరోగం. మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లలో ఉన్న పెద్దపెద్ద దవాఖానలన్నీ తిరిగిన. అప్పుసొప్పుజేసి మూడు లక్షలదాకా ఖర్చుపెట్టిన. అవన్నీ ఇప్పుడు గుండెమీదున్నయి. పిల్లలు నేర్వరు.. ఉండ ఇల్లు లేదు. దున్న భూమి సంపాదించలేదు. బుక్కెడు బువ్వ అడుక్కోవడానికి పనికొచ్చే ఈ విద్యను నేర్చుకోం అంటున్నరు నా కొడుకులు. ముత్తాతల నుంచి వస్తున్న ఈ కళను ఈ తరమోల్లు కూడా అందుకోవాలని, అట్ల దీని సప్పుడు ఆగిపోవద్దని నా కోరిక. నా కుటుంబం ఎల్లే దారి దొరికితే నాకొచ్చిన ఈ విద్యను పదిమందికీ నేర్పిస్త. మనసున్నోళ్లు ఎందరో... ఈ కళ నాతోనే పోవద్దని దాసరి రంగ( తెలుగు యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్) ఎంతో ప్రోత్సహించినరు. దీని గురించి పేపర్ల రాసి ఎక్కడెక్కడో ప్రదర్శనలు ఇప్పించిండు. ప్రదర్శనలకు రావడానికి, ఇల్లు రిపేర్‌కు రంగయ్య సారే పైసలిచ్చిండు. లామకాన్‌లో ప్రదర్శన కోసం పైసల్లేక బస్టాండులో దిక్కుతోచక నిలుచుంటే భువనగిరి మారాజు సుధాకర్ సార్ టికెట్ పైసలిచ్చిండు. మూడువేల కోసం అప్పులోల్లు నా కిన్నెరను జప్తు చేసుకుంటే, లాయర్ సార్ (సీవీఎల్ నరసింహారావు) సాయం చేసిండు. గుర్తింపునకు కొదువ లేకపోయినా, దినదినం తిండికి తడుముకోవాల్సి వస్తోంది. కదిలివచ్చిన కళాభిమానులు మెట్ల కిన్నెర వాయిస్తూ తెలంగాణ వీరగాథలను అద్భుతంగా వినిపించే మహబూబ్‌నగర్ వాయిద్యకారుడు మొగులయ్య ప్రదర్శనకు జానపద కళాభిమానులు ఎంతోమంది కదిలి వచ్చారు. పండుగ సాయన్న, పానుగంటి మీరాసాహెబ్, వంగ పకీరయ్య కథలను ఆయన వినిపించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. దయనీయ స్థితిలో వున్న ఈ పేద కళాకారుడికి అక్కడికి వచ్చిన పలువురు తమకు తోచిన విధంగా విరాళాలు అందచేశారు. లామకాన్‌లో జరిగిన ఈ ప్రదర్శన వాగేశ్, శ్రీశైలం ఏర్పాటు చేశారు. సినీ దర్శకులు అజిత్ నాగు, అవసరాల శ్రీనివాస్.. రచయితలు సంగిశెట్టి శ్రీనివాస్, ఎస్.జగన్, రిటైర్డ్ ప్రొఫెసర్లు కిషన్రావ్, రాములు, కళాకారులు నిస్సార్, బైరాగి, గడ్డం యాదగిరి, కార్టూనిస్ట్ శివాజీతో పాటు రేడియో, టీవీలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇదీ పరంపర... పన్నెండేళ్ల బాల్యం నుంచే కిన్నెరతో చెలిమి చేసిన మొగులయ్య పూర్వీకులు కాశీం, వెంకటరాముడు, మొగులాన్, రాములయ్య, ఎల్లయ్యలు. ఎల్లయ్య కొడుకే మొగులయ్య. యాభయ్యేళ్లుగా కిన్నెరతో సావాసం చేస్తున్న మొగులయ్య ఆత్మాభిమానం ఉన్న కళాకారుడు. ఎన్నడూ చేయిచాచి ఎరుగడు. వెదురు, గుండ్రటి సొరకాయలు, తేనె, మైనం, తీగలు, ఎద్దుకొమ్ములు, అద్దాలతో ఎంతో నేర్పుతో ఈ కిన్నెర వాద్యాన్ని ఆయన పూర్వీకులు తయారు చేశారు. పానుగంటి మీర్‌సాబ్ కథ, ఎండమెట్ల ఫకీరయ్య, బండోళ్ల కురుమన్న, వట్టెం రంగనాయకమ్మ వంటి తెలంగాణ కథలను మొగులయ్య వినసొంపైన తన వాద్యంతో హావభావ సహితంగా వినిపిస్తాడు. ఆయన ప్రదర్శనను తిలకించిన వారు మళ్లీ మళ్లీ తిలకించాలనుకుంటారు. కిన్నెర కమ్మదనాన్ని పదే పదే ఆస్వాదించాలనుకుంటారు. ఈ కన్నీటి కిన్నెరను ఆదుకోదలచినవారు ..9505513891నంబరుకు ఫోన్ చేయండి. - ఓ మధు